మనోడేలే.. ఏం చేసినా ఫర్వాలేదని అనుకున్నారో.. ఏమో కానీ ‘ఈనాడు’ వాళ్లు చేసిన అతి ఎదురుతన్నింది! దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ‘ఈనాడు’ పేరెత్తకుండానే కడిగేశాడు! ఎక్కడా ఆ పత్రిక పేరు ప్రస్తావించుకుండానే, ‘అత్యుత్సాహం’ అంటూ ట్విటర్ వేదికగా ఆ ప్రింట్ మీడియా వర్గం మీద రాజమౌళి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు!
‘గౌతమి పుత్రశాతకర్ణి’ ని ఆకాశానికెత్తేయడంలో భాగంగా ‘ఈనాడు’ పత్రిక చేసిన ఒక అత్యుత్సాహపు పనిలో తనను వాడుకోవడం పట్ల రాజమౌళి అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ విషయంలో తను వివరణను అడిగాను అని, అయినా కూడా స్పందన లేదని.. పనిలో పనిగా దర్శకుడు క్రిష్ మీద కూడా రాజమౌళి తన అసంతృప్తి వ్యక్తం చేశాడు!
ఇంతకీ జరిగింది ఏమిటంటే.. ఇటీవల గౌతమిపుత్రశాతకర్ణి సినిమాను చూసి.. చలించిపోయి, భావోద్వేగాన్ని ఆపుకోలేక.. రాజమౌళి ‘ఈనాడు’ కు ఒక లేఖ రాసినట్టుగా చెబుతూ ఆ పత్రికలో ఒక ప్రత్యేక కథనం ప్రచురితం అయ్యింది. మొన్నటి సోమవారం ప్రచురితమైన ఆ కథనం ఇంట్రోలోనే ఎంత అతి చేయాలో అంతా చేసేశారు ‘ఈనాడు’ వాళ్లు!
కలం పట్టుకొచ్చేశాడు, లేఖ రాసేశాడు, ఈనాడుకు అందించాడు.. అంటూ రాజుకు మించిన భక్తిని ప్రదర్శించారు. ఇక ఆ లేఖలో వీరి సొంత పైత్యం చదవనలవి కాదు, చదివి తట్టుకోలేనలవి కాదు! అంతలా పైత్యాన్ని ప్రదర్శించారు. ఒక చివర్లో అయితే.. రాజనందిని పుత్ర రాజమౌళి అంటూ, తమ పాండిత్యాన్నంతా ప్రదర్శించారు!
ఆ రోజు ఆ అతిని ‘గ్రేట్ ఆంధ్ర’ ప్రస్తావించింది. అంతిమంగా ఈ అంశంపై స్పందించారు దర్శకుడు రాజమౌళి! ఈయన చెప్పేంది ఏమిటంటే.. తను ఆ లేఖ రాయలేదు అని! తను ఆ లేఖ రాయలేదు అని, కానీ తను రాసినట్టుగా దాన్ని కల్పించారని ఆయన తెలిపాడు! దీంతో.. ఆ లేఖ కేవలం ‘ఈనాడు’ సృష్టి అని స్పష్టం అయ్యింది. ఆ సృష్టిలో పైత్యం చాటుకున్నారని స్పష్టం అవుతోంది!
తనకు ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమా నచ్చిన మాట వాస్తవమే అని, ఈ సినిమా ప్రచారం కోసం.. క్రిష్ ను ఇంటర్వ్యూ చేయాలని తనను కోరారని, దానికి సమ్మతించాను అని రాజమౌళి ట్వీట్ చేశాడు. టీవీలో ఆ ఇంటర్వ్యూను ప్రదర్శించుకుంటాం, అలాగే పేపర్లో కూడా ఇంటర్వ్యూను ప్రచురించుకుంటామని అడిగారని.. దానికి కూడా సమ్మతం తెలిపానని రాజమౌళి తెలిపాడు. అయితే.. దాన్ని అంతటితో వాడుకోకుండా, లేఖ రాశాడు, ఈనాడు ఆఫీసుకు తెచ్చిచ్చాడు.. అంటూ వాళ్లు అతి చేశారని రాజమౌళి చెబుతున్నారు!
ఈ విషయంలో తను క్రిష్ ను కూడా వివరణ అడిగాను అని, ఇంకా స్పందన రాలేదని రాజమౌళి ట్వీట్ చేశాడు! ఇదీ కథ. అయ్య వారిని చేయబోయి కోతిని చేసినట్టుగా మారింది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డెయిలీ వాళ్ల పరిస్థితి! చూశారా.. మాకు రాజమౌళినే లేఖ తెచ్చిచ్చాడు అని రాసుకుని ఇప్పుడు అభాసుపాలవుతోంది ఆ పత్రిక!
అయితే గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. వాళ్లంటే అత్యుత్సాహం కొద్దీ ఆ పని చేశారు, రాజమౌళి కూడా దాన్ని అంతటితో వదిలేకపోవడం! ఎంత కాదనుకున్నా.. రాజమౌళి కోసం ‘ఈనాడు’ వాళ్లు ఎంతో సేవ చేశారు! ‘బాహుబలి’ సినిమాను వాళ్లు ఎంతగా ఆకాశానికి ఎత్తారో.. ఎన్ని పేజీలు కేటాయించారో, అలా ఎన్ని రోజులు ఎంత ప్రింట్ ఖర్చు పెట్టుకున్నారో.. ప్రపంచానికి ఎరుక!
ఆ విధంగా రాజమౌళిని ఓన్ చేసుకున్న పత్రిక ఈ లేఖ అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది. అయితే రాజమౌళి దాన్ని భరించలేకపోయినట్టున్నాడు. వారి గత సేవలను గుర్తుంచుకుని కూడా వదిలేయలేకపోయాడు! దేని లెక్క దానిదేనా!