నిషేధం ఉంటేనేం…సర్కారే ఆడిస్తుంది…!

పూర్వ కాలంలో జనం పోలీసులంటే భయపడేవారు. కోర్టు గడప తొక్కడమంటే పరువు పోయినట్లు భావించేవారు. ఎవరైనా కేసులు పెడితే హడలిపోయేవారు. కాని ఇప్పుడంత సీన్‌ లేదు. అందరూ రాటుదేలిపోయారు. పోలీసు వ్యవస్థను బేఖాతరు చేస్తున్నారు.…

పూర్వ కాలంలో జనం పోలీసులంటే భయపడేవారు. కోర్టు గడప తొక్కడమంటే పరువు పోయినట్లు భావించేవారు. ఎవరైనా కేసులు పెడితే హడలిపోయేవారు. కాని ఇప్పుడంత సీన్‌ లేదు. అందరూ రాటుదేలిపోయారు. పోలీసు వ్యవస్థను బేఖాతరు చేస్తున్నారు. కోర్టు తీర్పులను, ఆదేశాలను అస్సలు పట్టించుకోవడంలేదు. ఎవరు ఎలాంటి కేసులు పెట్టినా డోంట్‌ కేర్‌ అంటున్నారు. పాలకులు, నాయకులు సుప్రీం కోర్టు తీర్పులను, ఆదేశాలను సైతం లెక్క చేయడంలేదు. ఒకప్పుడు కోర్టు తీర్పులను శిలాశాసనంగా భావించేవారు. ఇప్పుడు అత్యున్నతమైన సుప్రీం కోర్టు తీర్పులను, ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారు. వ్యక్తులే పట్టించుకోవడంలేదు. ఇక ప్రభుత్వాల గురించి చెప్పేదేముంది? సుప్రీం కోర్టు తీర్పులను, ఆదేశాలను ప్రభుత్వాలు పట్టించుకోని ఘటనలు అనేకమున్నాయి. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వమూ ఆ పనే చేయబోతోంది. ఈ రాష్ట్రంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై సుప్రీం కోర్టు విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని కనీవినీ ఎరుగని రీతిలో ఆందోళన సాగుతోంది. 

చెన్నయ్‌లోని మెరీనా తీరం జనసంద్రమైంది. తమిళనాడు ప్రజలతోపాటు ఇతర రాష్ట్రాల్లోని తమిళులే కాకుండా విదేశాల్లోని తమిళులు సైతం జల్లికట్టు కోసం ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పన్నీరుశెల్వం ప్రధాని మోదీని అభ్యర్ధించి వచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితరులు పోలోమంటూ ఢిల్లీ వెళ్లి లాబీయింగ్‌ చేస్తున్నారు. సినిమా పరిశ్రమ పూర్తిగా జల్లికట్టు ఉద్యమంలోనే నిమగ్నమైంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూడా ఇంత పెద్ద ఎత్తున ఉద్యమించకపోవచ్చు. ఇంతగనం మద్దతు ఇవ్వకపోవచ్చు. కేవలం వినోదం అందించే క్రూరత్వం కలగలిసి ఉన్న క్రీడ కోసం భారీగా ఉద్యమిస్తున్నారు. జనం దోపిడీని, అవినీతిని, ఇబ్బందులను భరిస్తారుగాని సెంటిమెంటును కాదంటే మాత్రం తిరగబడతారు. ప్రాణాలు సైతం లెక్కచేయరు. ఈ వినోదం చేజారితే జీవితం వృథాయే అనుకుంటారు. అందులోనూ తమిళులు ప్రతి విషయంలోనూ 'ఓవరాక్షన్‌' చేస్తారనే విషయం తెలిసిందే. 

సినిమా నటీనటులను, రాజకీయ నాయకులను ఆరాధించడం మొదలు చిన్నాచితక విషయాలవరకు 'అతి'గా స్పందిస్తారు. ప్రజలు ఏ ఆందోళన చేసినా ప్రతిపక్షాలతోపాటు అధికార పార్టీ కూడా మద్దతు ఇవ్వడం తమిళనాడులో చూస్తుంటాం. నిజానికి ఆంధ్రాలో కోడి పందాలపై నిషేధమున్నా, తమిళనాడులో జల్లికట్టుపై నిషేధం ఉన్నా వాటిని నిర్వహిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. మొన్న సంక్రాంతికి తమిళనాడులో జల్లికట్టును కొన్ని ప్రాంతాల్లో నిర్వహించారు కూడా. ఎప్పటిమాదిరిగానే సర్కారు చూసీచూడనట్లు ఊరుకుంది. సంక్రాంతి పండుగ అయిపోయాక కూడా ఈ ఉద్యమం కొనసాగుతుండటానికి కారణం ఏమిటంటే జల్లికట్టుపై నిషేధాన్ని శాశ్వతంగా ఎత్తేయాలని డిమాండ్‌ చేస్తుండటమే. ఎన్నడూలేని విధంగా ఇదో ఉన్మాదంలా చెలరేగుతోంది. ముఖ్యమంత్రి పన్నీరు శెల్వానికి ఇదో జీవనమరణ సమస్యలా తయారైంది. అసలే ఆయన పరిస్థితి దయనీయం. పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియదు. ఈ నేపథ్యంలో జల్లికట్టుపై నిషేధాన్ని తొలగింపచేయకుంటే ప్రజల్లో వ్యతిరేకత ప్రబలుతుంది. ఆయన్ని బద్నాం చేయడానికి శశికళ వర్గానికి మంచి అవకాశం దొరుకుతుంది.

దీంతో ఆయన ఢిల్లీ వెళ్లి మోదీని బతిమాలుకున్నారు. కేసు సప్రీం కోర్టులో ఉంది కాబట్టి తానేమీ చేయలేనని చెప్పారు. మరోపక్క ప్రజలు శాంతించడంలేదు. ఇప్పుడు చేయాల్సిన పనేమిటి? నిషేధాన్ని బేఖాతరు చేయడమే. సుప్రీం ఆదేశాలను అమలు చేయాల్సిన సర్కారే తానే జల్లికట్టు నిర్వహిస్తానని ప్రకటించింది.

'జల్లికట్టును ఒకటి లేదా రెండు రోజుల్లో నిర్వహిస్తాం. మీరు ఆందోళన విరమించండి' అని ముఖ్యమంత్రి ప్రజకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆర్డినెన్స్‌ తెచ్చేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు చెప్పారు. త్వరలో ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాల్లో జల్లికట్టుపై నిషేధం ఎత్తేయాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపబోతున్నారు. జల్లికట్టును నిషేధించడానికి కారణమైన, ఈ క్రీడను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జంతు సంరక్షణ సంస్థ  'పీపుల్‌ ఫర్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ ఎనిమల్స్‌ (పెటా)పై నిషేధం విధించాలని అన్ని పార్టీలు కోరుతున్నాయి. విదేశీ సంస్థ అయిన పెటాకు తమిళ సంప్రదాయం గురించి తెలియదని నాయకులు విమర్శిస్తున్నారు. పెటాపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ దుమ్మెత్తిపోశారు. జల్లికట్టు వంటి క్రీడలు దేశంలోని మరి కొన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. దీనిపై నిషేధం ఎత్తేస్తే ఇలాంటి క్రీడలన్నింటికీ స్వేచ్చ లభించినట్లే. సుప్రీం కోర్టు ఏం నిర్ణయిస్తుందో చూడాలి.