ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? యువరాజ్‌సింగ్ నుంచి ఈ తరహా బ్యాటింగ్ చూసిన బారత క్రికెట్ అభిమానులంతా ఇప్పుడు ఇదే మాట అంటున్నారు. నిజమే మరి, భారత డాషింగ్ బ్యాట్స్‌మెన్ యువరాజ్‌సింగ్ గత కొంతకాలంగా ఫామ్ లేక, ఫిట్‌నెస్ లేక నానా తంటాలూ పడ్డాడు. ఓ దశలో, ఇకపై భారత జట్టులో చోటు దక్కించుకోవడం అసాధ్యమేనని యువీ కూడా ఫిక్సయిపోయాడు. కానీ, పెళ్ళయ్యాక దశ తిరిగిపోయినట్టుంది. అనూహ్యంగా వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆకట్టుకోలేకపోయిన యువీ, రెండో వన్డేలో మాత్రం చెలరేగిపోయాడు. సెంచరీతో ఇంగ్లాండ్ బౌలర్లని ఓ ఆట ఆడుకున్నాడు. టీమిండియా కేవలం 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో భారత క్రికెట్ అభిమానులు డీలాపడిపోయారు. కటక్ మైదానంలో కాస్సేపు నిస్తేజం అలముకుంది. కానీ, కాస్సేపటికే సీన్ మారిపోయింది. ధోనీతో కలిసి యువీ రెచ్చిపోయాడు.. ఇంకేముంది, స్కోర్ బోర్డ్ పరుగులెట్టింది.
యువరాజ్‌సింగ్‌కి వన్డేల్లో ఇది 14వ సెంచరీ కావడం గమనార్హం. 2011 వరల్డ్ కప్ హీరో అయిన యువరాజ్‌సింగ్, అప్పట్లో క్యాన్సర్ బారిన పడిన విషయం విదితమే. క్యాన్సర్‌తో ఇక జీవితం ముగిసిపోతుందేమోనన్న ఆందోళన నుంచి ఎలాగైతేనేం బయటపడ్డాడు. క్యాన్సర్‌ను జయించాడు. ఇటీవలే ప్రియురాలు హేజెల్ కీచ్‌ని పెళ్ళాడాడు. ఇప్పుడు సెంచరీతో సత్తా చాటాడు. యస్.. యువీ ఈజ్ బ్యాక్.