‘తెలంగాణ’ను గుర్తుకు తెప్పిస్తున్న ‘జల్లికట్టు’…!

తెలుగు రాష్ట్రమైన తెలంగాణకు, తమిళనాడులోని సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు ఏమిటి సంబంధం? ఆంధ్రప్రదేశ్‌-తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న తెలుగు ప్రాంతాల్లో కొన్నిచోట్ల జల్లికట్టు క్రీడ నిర్వహిస్తారు. కాని తెలంగాణలో దాని ఊసు లేదు. అలాంటప్పుడు రెండింటికీ…

తెలుగు రాష్ట్రమైన తెలంగాణకు, తమిళనాడులోని సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు ఏమిటి సంబంధం? ఆంధ్రప్రదేశ్‌-తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న తెలుగు ప్రాంతాల్లో కొన్నిచోట్ల జల్లికట్టు క్రీడ నిర్వహిస్తారు. కాని తెలంగాణలో దాని ఊసు లేదు. అలాంటప్పుడు రెండింటికీ ముడిపెట్టడం ఎందుకు? అనే ప్రశ్న వస్తుంది. నిజానికి తెలంగాణకు జల్లికట్టు క్రీడతో సంబంధం లేదు. కాని ప్రస్తుతం తమిళనాడులో జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని, దానిపై నిషేధం ఎత్తేయాలని భారీఎత్తున చేస్తున్న ఆందోళన చూస్తుంటే తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తోంది. ఎందుకంటే ఈ రెండూ సెంటిమెంటుతో ముడిపడి ఉన్నవే కాబట్టి. తెలంగాణ సెంటిమెంటుకు రాజకీయ ప్రయోజనాలు కూడా కలిగలిసిన కారణంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తమిళనాడులో జల్లికట్టు సెంటిమెంటు తీవ్రంగా ఉన్నా ఆ సమస్య సుప్రీం కోర్టులో ఉన్న కారణంగా కేంద్ర ప్రభుత్వమూ ఏమీ చేయలేకపోతోంది. తమిళనాడులో సామాన్యులు మొదలు ప్రముఖుల వరకు జల్లికట్టుకు మద్దతు ఇచ్చారు. మద్దతు ఇవ్వని హీరోయిన్‌ త్రిషకు ఎలాంటి అవమానం ఎదురైందో చూశాం. ఆమె మరణించినట్లుగా ప్రకటన చేసి శ్రద్ధాంజలి ఫోటోలు విడుదల చేశారు.

ఒక్క మాటలో చెప్పాలంటే జల్లికట్టుకు మద్దతు ఇవ్వని వారెవరైనా సరే బతుకు బస్టాండు అయిపోతుంది. జల్లికట్టును వ్యతిరేకించేవారు ఎంతటి సూపర్‌డూపర్‌  తమిళులు కేర్‌ చెయ్యని పరిస్థితి ఏర్పడింది. సినిమా పరిశ్రమ ఏకతాటిపై నిలబడి జల్లికట్టుపై నిషేధం ఎత్తేయాలని డిమాండ్‌ చేసింది. జల్లికట్టును వ్యతిరేకించేవారిని తమిళ ద్రోహులుగా పరిగణిస్తున్నారు. ఇది తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుకు తెస్తోంది. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగిన సమయంలో తెలంగాణకు మద్దతు ఇవ్వనివారిపై 'తెలంగాణ ద్రోహులు'గా ముద్రవేశారు. హైదరాబాదులో, తెలంగాణలో నివసిస్తున్నవారంతా తెలంగాణకు మద్దతు ఇచ్చి తీరాల్సిందేనని షరతు విధించారు ఉద్యమకారులు. తటస్థంగా ఉన్నవారిని కూడా తెలంగాణకు మద్దతు ఇచ్చేది లేనిది చెప్పాలని పట్టుబట్టారు. దీంతో హైదరాబాదులో, ఇతర తెలంగాణ జిల్లాల్లో స్థిరపడి వ్యాపారాలు చేసుకుంటున్న ఆంధ్రావారు ప్రత్యేక తెలంగాణకు తప్పనిసరిగా మద్దతు పలకాల్సివచ్చింది. చంద్రబాబు నాయుడు సహా అనేకమంది ఆంధ్రా ప్రముఖులు తెలంగాణకు మద్దతు ఇస్తున్నామనేందుకు నిదర్శనంగా బతుకమ్మలు ఎత్తుకున్నారు. తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తున్నామని పదేపదే ప్రకటనలు చేశారు.

తెలంగాణకు జై కొడితేనే హైదరాబాదులో ఉండే పరిస్థితి ఏర్పడటంతో సెటిలర్లంతా ఉద్యమాన్ని బలపరిచారు. తెలంగాణ సెంటిమెంటు ఎంత బలంగా ఉందో అప్పట్లో చూశాం. ఇప్పుడు తమిళనాడులో జల్లికట్టు అనే సెంటిమెంట్‌ కూడా అంత బలంగా ఉంది. జల్లికట్టు పశువులను హింసించే క్రూరమైన క్రీడ అని చట్టం, న్యాయస్థానాలు చెబుతున్నాయి. అది క్రూరమైందా కాదా అనే విషయం తమకు అనవసరమని, అది తమిళనాడులో తరతరాలుగా ఉన్న సంప్రదాయమని జనం చెబుతున్నారు.  కోడి పందాలు జూదం కిందకు వస్తాయి. ఇందులోనూ క్రూరత్వం ఉంది.  కోట్ల రూపాయల డబ్బు చేతులు మారుతుంది. జూదం నేరం కాబట్టి కోడి పందాలు ఆడటం కూడా నేరమే. అయినా కోడి పందాలు ఆగుతున్నాయా? లేదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు మొదలైనవారే కోడి పందాలు ఆడతారు. ఆడిస్తారు. సంక్రాంతికి కోడి పందాలు ఆడటం హక్కుగా భావిస్తారు.  ఏ ప్రభుత్వమూ కోడి పందాలను ఇప్పటివరకు పూర్తిగా నిషేధించలేకపోయింది.  కోడి పందాలు ఆడకూడదని, ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించడం,  ప్రభుత్వం 'అలాగే' అని తలూపడం, అవి జరుగుతూనే ఉండటం షరా మామూలుగా మారింది.

తమిళనాడులోనూ సంక్రాంతికి 'జల్లికట్టు'  జోరుగా నిర్వహిస్తారు. మదించిన ఎద్దుతో పోరాడి దాన్ని కంట్రోల్‌ చేసి ఓడగొట్టడం అనే క్రీడ ఈ జల్లికట్టు. ఈ క్రీడ చాలా ప్రమాదకరంగా ఉంటుంది. కోడి పందాల్లో కోళ్లు మాత్రమే కొట్టుకుంటాయి. కాని జల్లికట్టులో మనుషుల ప్రమేయం ఉంటుంది కాబట్టి గాయపడటమే కాదు, ఒక్కోసారి చనిపోతారు కూడా.  2011లో యూపీఏ ప్రభుత్వం జల్లికట్టును నిషేధించినా 2015 వరకు అమలు కాలేదు. 2016లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో  అప్పటి ముఖ్యమంత్రి జయలలిత జల్లికట్టు మీద నిషేధం ఎత్తేయాలని కేంద్రానికి లేఖ రాశారు. జల్లికట్టు నిషేధం ఎన్నికల్లో అధికార పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో నిషేధం ఎత్తేయాలని కోరారు. రాజకీయ ప్రయోజనాలు జయలలితకు ఎంత అవసరమో, ప్రధాని మోదీకి కూడా అంతే అవసరం కదా. 'ఓకే' అన్నారు. ఏదో నామమాత్రంగా కొన్ని నిబంధనలు విధించారు. జల్లికట్టు మీద నిషేధం ఎత్తేయడంతో తమిళనాడులో సంబరాలు జరుపుకున్నారు. కాని సుప్రీం కోర్టు మళ్లీ నిషేధం విధించింది.