అసలే మెగా ప్రీ సక్సెస్ మీట్ కు రాకుండా, జస్ట్ సాదా సీదా ట్వీట్ తో సరిపెట్టడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై లోలోపల కోపంగా వున్న మెగా ఫ్యాన్స్ ఇప్పుడు మరింత ఫీలవుతున్నారు. దీనికి కారణం మరేమీ కాదు, నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ లే.
గతంలో ప్రజారాజ్యం సమయంలో జరిగిన పొరపాట్లు, ఫలితాలు దృష్టిలో వుంచుకునే ఇప్పుడు జనసేన పార్టీ నిర్మాణాన్ని ఆచితూచి చేస్తున్నాననే అర్థం వచ్చేలా పవన్ మాట్లాడారు. జనసేన పార్టీ నిర్మాణాన్ని జాగ్రత్తగా చేస్తున్నానని అనడం వేరు, ప్రజారాజ్యం వైపల్యాన్ని ప్రస్తావించడం వేరు. పవన్ కళ్యాణ్ ఇలా కావాలనే చేసారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
ఖైదీ నెం 150 సినిమా హిట్ కావడంతో కాపులకు మళ్లీ చిరంజీవిలో ఓ చరిష్మా వున్న నాయకుడు కనిపించాడు. స్పీడ్ గా ముందుకు వెళ్లకుండా, బాబు చేయి పట్టుకు వదలకుండా, ముద్రగడ వ్వవహారంలో తమకు అండగా వుండకుండా తనకు తోచినట్లు తాను చేస్తున్న పవన్ విషయంలో కాపులు ఒక రకమైన నిర్లిప్తతతో వున్నారు. ఇప్పుడు ఖైదీ విజయంతో వారికి మళ్లీ చిరంజీవిలో మెగాస్టార్ కొట్టొచ్చినట్లు కనిపించాడు.
ఇది సహజంగానే పవన్ కళ్యాణ్ కు అంతగా మింగుడు పడని వ్యవహారం. అందుకే చిరంజీవి మెగాస్టారే కానీ, రాజకీయంగా పరిణితి వున్న నాయకుడు కాదని, అందుకే ప్రజారాజ్యం విఫలమైందని మరోసారి పవన్ ఈ విధంగా గుర్తుచేసే ప్రయత్నం చేసినట్లు మెగాభిమానులు, రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అందుకే మెగాభిమానులు పవన్ పై మరింత కినుకవహిస్తున్నారు. ఇంత అపూర్వ విజయం అందుకున్న వేళ ప్రజారాజ్యం వైఫల్యాన్ని పవన్ గుర్తుచేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.