మన తెలుగునాట ఉభయగోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగకి కోడి పందాలు ఫేమస్.. తమిళనాడులో సంక్రాంతి అంటే జల్లికట్టు. ఇవి రెండూ సంప్రదాయ క్రీడలే. ఈ రెండిటిపైనా నిషేధం వుంది. అయినా, ఇవి రెండూ యధేచ్ఛగా జరిగిపోతూనే వున్నాయి. కోడి పందాలపై నిషేధం ఎత్తివేయాలని కొందరు రాజకీయ ప్రముఖులు కోర్టులను ఆశ్రయించారు. అయితే, సినీ సెలబ్రిటీలెవరూ ఈ వివాదం జోలికి వెళ్ళలేదు. తమిళనాడులో పరిస్థితి వేరు. అక్కడ 'సెంటిమెంట్' రేగిందంటే చాలు సీన్ సితార్ అయిపోవాల్సిందే.
దాదాపుగా తమిళనాడులో సినీ, రాజకీయ ప్రముఖులంతా జల్లికట్టుకి మద్దతుగా నిలిచారు. ఈ రోజు ప్రత్యక్షంగా జల్లికట్టు ఆందోళనల్లో ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్, దర్శకుడు లారెన్స్ పాల్గొన్నాడు. జల్లికట్టుకి అనుకూలంగా ఆందోళన చేస్తున్నవారి కోసం అవసరమైతే కోటి రూపాయలైనా ఖర్చు చేస్తానన్నాడు లారెన్స్. ఆందోళనకారులకు సరైన తిండి లేకపోవడం తనను కలచివేసిందనీ, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని లారెన్స్ చెప్పుకొచ్చాడు.
ఇక, తాజాగా మరో సినీ ప్రముఖుడు మీడియా మందుకొచ్చాడు. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేశాడు. అతనెవరో కాదు, హీరో విశాల్. తమిళ సినీ రాజకీయాల్లో విశాల్ పేరు ప్రముఖంగా విన్పిస్తుంటుంది. శరత్‌కుమార్‌తో విభేదాలు, నడిగర్ సంఘం ఎన్నికల్లో హడావిడి.. ఇవన్నీ విశాల్‌ని సినీ రాజకీయాల్లో ప్రముఖుడిగా మార్చేశాయి. జల్లికట్టు కోసం జరుగుతున్నవి నిరసనలు కావనీ, ఇదొక ఉద్యమం అని విశాల్ నినదించాడు.
రజనీకాంత్ సహా పలువురు ప్రముఖులు ఇప్పటికే జల్లికట్టుకి అనుకూలంగా మాట్లాడిన విషయం విదితమే. ఇంతలా జల్లికట్టు ఉద్యమం ఊపందుకోవడంతో ప్రధాని నరేంద్రమోడీ కూడా స్పందించక తప్పలేదు. వివాదం కోర్టు పరిధిలో వుంది గనుక, ఆచి తూచి వ్యవహరిస్తున్నామనీ, తమిళనాడు సంస్కృతీ సంప్రదాయాల్ని గౌరవిస్తామనీ మోడీ చెప్పుకొచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఎంపీల బృందంతో కలిసి ప్రధానిని ఈ రోజు భేటీ అయిన అనంతరం మోడీ నుంచి ఈ ప్రకటన బయటకొచ్చింది.
ఇదిలా వుంటే, మూడు రోజులుగా చెన్నయ్‌లోని మెరీనా బీచ్ జనసంద్రమైంది. ఓ పక్క సముద్ర కెరటా ఘోష, ఇంకోపక్క జల్లికట్టు నినాదాలతో మెరీనా బీచ్ ప్రాంతమంతా మార్మోగిపోతోంది. విద్యా సంస్థలు స్వచ్ఛందంగా సెలవు పాటించడమే కాదు, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఉద్యోగులకు ఆందోళనల్లో పాల్గొనే వెసులుబాటు కల్పించడంతో జల్లికట్టు ఉద్యమానికి మరింత ఊతం లభించినట్లవుతోంది.
రానున్న రోజుల్లో జల్లికట్టుకి మద్దతుగా మరికొందరు సినీ ప్రముఖులు మీడియా ముందుకు రావడమో, స్వచ్ఛందంగా ఈ ఆందోళనల్లో పాల్గొనడమో జరుగుతుందన్నది నిర్వివాదాంశం. ఎందుకంటే, తమిళనాడులో 'సెంటిమెంట్లను' ఎవరైనాసరే గౌరవించి తీరాల్సిందే.! ప్చ్, ఈ యూనిటీ తెలుగునాట మాత్రం కన్పించదు.