ఏపీలో కార్యాలయం నిర్మాణంపై మౌనమెందుకు?

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు పార్టీ కార్యాలయం నిర్మించడంలేదు? దీనిపై పార్టీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా జగన్‌ ఎందుకు పట్టించుకోవడంలేదు? ఈ ప్రశ్నలు ఇప్పటివరకు…

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు పార్టీ కార్యాలయం నిర్మించడంలేదు? దీనిపై పార్టీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా జగన్‌ ఎందుకు పట్టించుకోవడంలేదు? ఈ ప్రశ్నలు ఇప్పటివరకు అనేకసార్లు తలెత్తాయి. మీడియాలో పలుమార్లు వార్తలొచ్చాయి. అయినా ఇప్పటివరకు జవాబు దొరకలేదు. రాజధాని ప్రాంత పరిసర నగరాల్లో అన్ని ప్రధాన పార్టీలు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ జగన్‌ పార్టీ ఇప్పటివరకు ఎందుకు ఏర్పాటు చేసుకోలేదో…!  ఆంధ్రాలో కార్యాలయం లేకపోవడంతో నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తాజాగా ఓ పత్రిక రాసింది. వైఎస్సార్‌సీపీ సాధారణ రాజకీయ పార్టీ కాదు. ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం. ఆ రాష్ట్రంలో అధికార పార్టీని ఢీకొట్టగల సత్తా ఉన్న పార్టీ. మరో రెండున్నరేళ్లలో ఎన్నికలు జరగబోతున్నాయి. పార్టీ ప్రధాన కార్యక్షేత్రం ఏపీ అయినప్పుడు అక్కడ కార్యాలయం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఏపీ పాలన పూర్తిగా ఆంధ్రాకు తరలిపోయింది.

శాసనసభ సమావేశాలూ శాశ్వతంగా అక్కడే జరగబోతున్నాయి. ఆంధ్రాలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ తాము హైదరాబాదుకు వచ్చిపోతుండటం, ఇక్కడిక్కడే తిరుగుతుండటం బాగాలేదని నాయకులు, ఎమ్మెల్యేలు చెబుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం భూమి ఇచ్చుంటే ఈపాటికి కార్యాలయం నిర్మించేవారేమో. కాని ప్రభుత్వ భూమిని జగన్‌ తిరస్కరించారు. ఎందుకు? మిత్రపక్షమైన బీజేపీకీ ఇచ్చినంత స్థలం కంటే పిసరు ఎక్కువగా  వైకాపాకు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. అసెంబ్లీలో వివిధ పార్టీలకున్న బలం ఆధారంగా స్థలాలు కేటాయిస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో  దిగువ సభలో ఉన్నవి మూడే పార్టీలు. అధికార టీడీపీ, మిత్రపక్షం బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం వైకాపా. ఈ లెక్కన చూస్తే మొదటిస్థానంలో టీడీపీ, రెండో స్థానంలో వైకాపా, మూడో స్థానంలో బీజేపీ ఉన్నాయి. కాని చంద్రబాబు నాయుడుకు వైకాపా అంటే పడదు కదా. అందుకని బీజేపీని, వైకాపాను కొద్ది తేడాతో దాదాపు ఒకేలా ట్రీట్‌ చేశారు.  ఇది పక్షపాతమని, అన్యాయమని ఎవ్వరైనా చెబుతారు. కాని చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే పక్షపాతం చూపితే ఎవరేం చేస్తారు?

టీడీపీకి సర్కారు నాలుగు ఎకరాలు కేటాయించింది. కాని వైకాపాకు అర ఎకరం మాత్రమే కేటాయించింది. బీజేపీకి నాలుగు సీట్లే ఉన్నాయి కాబట్టి వెయ్యి గజాలు కేటాయించింది. 67 సీట్లు సాధించిన వైకాపాకు, కేవలం నాలుగు సీట్లు సాధించిన బీజేపీకి చాలా వ్యత్యాసముంది. కాని భూమి కేటాయింపులో రెండు పార్టీల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదు. వాస్తవానికి టీడీపీకి  నాలుగెకరాలు కేటాయించినప్పుడు వైకాపాకు రెండెకరాలు కేటాయించడం న్యాయం. కాని బాబు అన్యాయం చేయడంతో ఆగ్రహించిన జగన్‌ ఆ భూమిని తిరస్కరించారు. సొంతంగా భూమి కొనుక్కుని కట్టుకుందామన్నారు. బాబు వేసిన బిక్షం తిరస్కరించి జగన్‌ మంచి పనే చేశారు. కాని కార్యాలయం నిర్మాణం గురించి ఆలోచించడంలేదు. ఆంధ్రాకు రాకుండా తెలంగాణలో ఉండి కార్యకలాపాలు చేస్తే టీడీపీ దీనిపై నెగెటవ్‌గా ప్రచారం చేస్తుందని వైకాపా నాయకులు భయపడుతున్నారు.

గుంటూరులో కార్యాలయం నిర్మిస్తారని గతంలో వార్తలొచ్చాయి. కార్యాలయం నిర్మించాల్సిన బాధ్యత అధినేతగా జగన్‌దే. పార్టీ నిధులతో ఈ పని చేయాలి. కాని ఆయన 'మీరే డబ్బులేసుకొని కట్టుకోండి' అన్నారట…! దీంతో ఎవరికి వారు గమ్మున ఉండిపోయారట…! ఇది ఎంతవరకు నిజమో తెలియదు.  ఆంధ్రాలో కార్యాలయం లేకపోవడంతో నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా అసంతృప్తి చెందుతున్నారనేది వాస్తవమే.  కార్యాలయం నిర్మించకపోతే పార్టీ నష్టపోతుందని అంటున్నారు. జగన్‌ పార్టీకి ఆర్థిక వనరుల కొరత ఉందనుకోలేం. స్వతహాగా జగన్‌ సంపన్నుడు. పార్టీ నాయకుల్లో అనేకమంది ఉద్దండులున్నారు. స్థలం కొని కార్యాలయం నిర్మించుకోవడం కష్టం కాదు. ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాటపడుతున్న జగన్‌ ఇప్పటివరకు ఏపీలో పార్టీ కార్యాలయం ఎందుకు ఏర్పాటు చేసుకోలేదనే ప్రశ్నకు జవాబు చెప్పాల్సివుంది. పార్టీ కార్యాలయం నిర్మించకపోతే రకరకాల పుకార్లు ప్రబలే ప్రమాదముంది.