ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌.. ఏది బెటర్‌.?

మెగాస్టార్‌ చిరంజీవి గతంలో స్థాపించిన ప్రజారాజ్యం పార్టీపై 'పోస్ట్‌పెయిడ్‌' అన్న విమర్శలున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి 2009 ఎన్నికల తర్వాత గంపగుత్తగా ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి అమ్మేశారనే కోణంలో ఈ 'పోస్ట్‌పెయిడ్‌' అంశం తెరపైకొచ్చింది. ఇక,…

మెగాస్టార్‌ చిరంజీవి గతంలో స్థాపించిన ప్రజారాజ్యం పార్టీపై 'పోస్ట్‌పెయిడ్‌' అన్న విమర్శలున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి 2009 ఎన్నికల తర్వాత గంపగుత్తగా ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి అమ్మేశారనే కోణంలో ఈ 'పోస్ట్‌పెయిడ్‌' అంశం తెరపైకొచ్చింది. ఇక, ఎన్నికలకు ముందే జనసేన పార్టీని, బీజేపీ – టీడీపీలకు అమ్మేశారన్న విమర్శల్ని ఎదుర్కొంటున్నారు పవన్‌కళ్యాణ్‌. అలా, ఆయనకీ 'ప్రీపెయిడ్‌' విమర్శలు తప్పలేదు. 

ప్రజారాజ్యం పార్టీ అనుభవాల నేపథ్యంలో జాగ్రత్తపడుతున్నానని పవన్‌కళ్యాణ్‌ నిన్న చేసిన వ్యాఖ్యలతో పోస్ట్‌పెయిడ్‌, ప్రీపెయిడ్‌ అంశం మళ్ళీ తెరపైకొచ్చింది. ప్రజారాజ్యం పార్టీకి ఓ జెండా, ఎజెండా, ఎన్నికల గుర్తు వంటివన్నీ వుండేవి. కానీ, జనసేన పార్టీకి జెండా తప్ప ఇంకేమీ లేవు. ఎజెండా పేరుతో పవన్‌ ఏవేవో చెబుతుంటారుగానీ, వాటి పట్ల ఆయనకే చిత్తశుద్ధి కనిపించదాయె. ప్రజారాజ్యం పార్టీతో జనసేనను పోల్చడం ద్వారా, అన్నయ్య మీద సెటైర్‌ వేశారనుకోవాలో, ఆ పార్టీ అనుభవాలతో తాను జాగ్రత్తపడుతున్నానని జనాన్ని కన్‌విన్స్‌ చెయ్యాలనుకుంటున్నారో అది పవన్‌కే తెలియాలి. 

ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, పార్టీ పెట్టిన చిరంజీవి ఆ పార్టీ కోసం చాలానే కష్టపడ్డారు. అఫ్‌కోర్స్‌, ఫలితం అనుకున్న విధంగా రాలేదనుకోండి.. అది వేరే విషయం. పవన్‌ అలా కాదు కదా, జనసేన పార్టీ పెట్టారంటే పెట్టారంతే. అది ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేస్తుందో ఆయనకీ సరైన అవగాహన లేదాయె. మొత్తమ్మీద, గతంలో ప్రజారాజ్యం పార్టీ యూత్‌ వింగ్‌ యువరాజ్యం అధ్యక్షుడిగా పనిచేసిన పవన్‌, ఆనాటి అనుభవాల్ని గుర్తు తెచ్చుకోవడం విశేషమే. 

కొసమెరుపేంటంటే, ప్రజారాజ్యంతో జనసేనను పోల్చుతూ నెటిజన్లు ఇప్పుడు మళ్ళీ కొత్తగా కామెంట్లు, కార్టూన్లతో సోషల్‌ మీడియాలో సందడి చేస్తుండడం. ఇంతకీ, పోస్ట్‌పెయిడ్‌ – ప్రీపెయిడ్‌లలో ఏది బెటర్‌.? ఒపీనియన్‌ పోల్‌ పెడితే పోలా.?