రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఎలా వెలిగిపోతారో, ఎలా మలిగిపోతారో చెప్పలేం. ఒక్కోసారి అవకాశాలు అడక్కుండానే వస్తాయి. ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా ఫలితముండదు. కొందరు నాయకులు స్వయంకృతాపరాధాలతో తెరమరుగైతే, కొందరు తమ ప్రమేయం లేని పరిణామాలతో తెర చాటుకు వెళ్లిపోతారు.
ఉత్తరప్రదేశ్‌లో ఒకనాటి అందాల తార, మాజీ ఎంపీ జయప్రద పరిస్థితి ఈ విధంగానే ఉందనిపిస్తోంది. అచ్చ తెలుగు మహిళ జయప్రద తన రాజకీయ జీవితాన్ని యూపీకి అంకితం చేసింది. అక్కడి నుంచే రెండుసార్లు పార్లమెంటుకు ఎంపికైన ఆమె ఒడిదొడుకులను అధిగమించి మళ్లీ ఒక వెలుగు వెలగవచ్చని అంచనా వేస్తున్న సమయంలో అధికార సమాజ్‌వాదీ పార్టీలో విభేదాలతో, తండ్రీకొడుకులు ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్ తగాదాలతో తెరమరుగు కావొచ్చనే అనుమానం కలుగుతోంది. జయప్రద రాజకీయ గురువు అమర్‌సింగ్ తాజాగా చేసిన ప్రకటన జయప్రదకు శరాఘాతమే. యూపీలో ఆమె ఒంటరిగా మిగిలిపోవల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇంతకూ అమర్‌సింగ్ ఏమన్నారు? తాను కొన్ని నెలలపాటు విదేశాలకు వెళ్లిపోతున్నానని, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాతనే వస్తానని ప్రకటించారు. చికిత్స కోసం లండన్‌కు, సింగపూర్‌కు వెళుతున్నానని చెప్పారు. చికిత్స కోసం వెళుతున్నానని చెప్పడం కేవలం సాకు మాత్రమే అనుకోవచ్చు.
సమాజ్‌వాదీ పార్టీలోకి అమర్‌సింగ్, జయప్రద మళ్లీ ప్రవేశించిన తరువాతనే సంక్షోభం ఏర్పడి పెను తుపానుగా మారింది. ఇందుకు ప్రధాన కారకుడు అమర్‌సింగేనని అఖిలేష్ ఆరోపించారు. ఆయన్ని పార్టీ నుంచి తొలగించాలని కుమారుడు చేసిన డిమాండ్‌ను తండ్రి అంగీకరించలేదు. పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి ప్రమాదపుటంచులకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే తాను విదేశాలకు వెళుతున్నానని అమర్‌సింగ్ ప్రకటించారు. పార్టీ రెండుగా చీలిపోతే తాను, జయప్రద ఏ వర్గంలోనూ చేరబోమని కూడా చెప్పారు. జయప్రదను కూడా తానే కమిట్ చేయించేశారన్నమాట. అమర్‌సింగ్ చెప్పిందాన్నిబట్టి చూస్తుంటే విదేశాల్లో దీర్ఘకాలం ఉండేలా కనబడుతోంది. ఏదైనా పార్టీలో చేరాలనుకున్నా ఆయన తిరిగొచ్చాక నిర్ణయమవుతుంది. అప్పటివరకు జయప్రద కూడా ఖాళీగా ఉండాల్సిందే.
ఈ రాజమండ్రి హీరోయిన్ తన జీవితాన్ని పూర్తిగా ఉత్తర ప్రదేశ్‌కు అంకితం చేసింది. ఆమె రాజకీయ అరంగేట్రం తెలుగు రాజకీయాల ద్వారా జరిగినా యూపీ రాజకీయాల్లో జయకేతనం ఎగరేసి పూర్తిగా ఆ రాష్ట్ర రాజకీయ నాయకురాలైపోయింది. దీర్ఘకాలం ఎంపీగా పనిచేసి యూపీ రాజకీయాల్లో ఆటుపోట్లు, అవమానాలు ఎదుర్కొన్న జయప్రదకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయి. గత ఏడాది ఆగస్టులో జయప్రదకు యూపీ సర్కారులో కేబినెట్ హోదా ఉన్న పదవి దక్కింది.
ఒకప్పుడు ఎస్పీ నుంచి తన రాజకీయ గురువు అమర్‌సింగ్‌తోపాటు బహిష్కరణకు గురైన జయప్రద మళ్లీ అదే పార్టీలో గుర్తింపు పొందడం విశేషమే. ఇంతకూ ఆమెకు దక్కిన పదవి ఏమిటి? యూపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్పర్సన్. ఈ సంస్థకు ఛైర్మన్‌గా ప్రముఖ కవి గోపాల్‌దాస్ నీరజ్ వ్యవహరిస్తున్నారు. జయప్రద తనకు సన్నిహితురాలని, పార్టీలో ఆమెకు అవమానం జరగుతోందని, దాన్ని సరిదిద్దకపోతే (పదవి ఇవ్వకపోతే అని అర్థం) తాను పార్టీ నుంచి వెళ్లిపోతానని అమర్‌సింగ్ హెచ్చరించారట…!
దీంతో అఖిలేష్ సర్కారు కేబినెట్ హోదా ఉన్న పదవి ఇచ్చి అమర్‌సింగ్‌ను సంతృప్తిపరిచింది. జయప్రద మళ్లీ నెమ్మదిగా రాజకీయాల్లో బిజీ అవుతుందనుకునే సమయానికి సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం మొదలైంది. గతంలో అమర్‌సింగ్‌కు ఎస్పీ అధ్యక్షుడు ములాయంసింగ్‌తో విభేదాలు రావడంతో ఆయనతో పాటు శిష్యురాలు జయప్రదను కూడా 2010లో పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ తరువాత అమర్‌సింగ్ సొంత కుంపటి పెట్టుకున్నా అది వెలగలేదు. తరువాత ఆర్ఎల్డీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసినా జయప్రదకు పరాజయం తప్పలేదు. మళ్లీ ఏదోవిధంగా రాజీపడి సొంత పార్టీకి చేరుకున్నారు.
గత ఏడాది జయప్రదకు ఎమ్మెల్సీ పదవి వచ్చినట్లే వచ్చి వెనక్కి పోయింది. ఇందుకు కారణం ఆమె శత్రువు ఆజంఖాన్. గవర్నర్ కోటాలో తొమ్మిదిమంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా అఖిలేష్ తయారుచేశారు. అందులో ఈమె పేరూ ఉంది. కాని ఆజంఖాన్ ఆమెకు ససేమిరా ఎమ్మెల్సీ ఇవ్వకూడదని పట్టుబట్టారు. అఖిలేష్, ములాయం ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అమర్‌సింగ్ పట్టుదల కారణంగా ఫిల్మ్ డెవలప్మెంట్ కౌన్సిల్ పదవి దక్కినా రాజకీయ భవిష్యత్తే అయోమయంలో పడింది. మరి యూపీలో ఆమె రాజకీయ అధ్యాయం ముగుస్తుందో, కొనసాగుతుందో అమర్‌సింగ్ నిర్ణయాలపై ఆధారపడి ఉంది.