ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు డబ్బు మంచి నీళ్లలా ఖర్చు చేయడమంటే సరదా అనుకోవాలో, అలవాటు అనుకోవాలో అర్థం కావడంలేదు. అధికారంలోకొచ్చి రెండున్నరేళ్లు దాటినా ఈ రాష్ట్రానికి ఇంకా ఆర్థిక కష్టాలు తీరలేదనేది వాస్తవం. అసలు రాష్ట్రానికి ఆర్థిక కష్టాలు ఉన్నాయో లేవో కూడా చంద్రబాబు సర్కారు విస్పష్టంగా చెప్పదు.
చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆర్థిక పరిస్థితిపై ఇష్టమొచ్చినట్లు ప్రకటనలు చేస్తుంటారు. ఒకసారి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని చెబుతారు. కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించి ఆర్థిక కష్టాల్లోకి నెట్టిందంటారు. మరోసారి రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతోందని, వృద్ధి రేటు పెరిగిందని అంటుంటారు.
ఏదిఏమైనా డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారనేది నిజం. గతంలో కేంద్ర ప్రభుత్వమే ఈ విషయం అనేకసార్లు చెప్పింది. వృథా ఖర్చుకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించింది. అయినా బాబు మారలేదు. వృథాగా ఖర్చు చేయడం, అప్పులు తేవడం. ఇదే ఆయన విధానం. పనికిమాలిన పథకాల మీద, కార్యక్రమాల మీద కోట్లు తగలేస్తున్నారు. ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాల్లో 'దోమలపై దండయాత్ర' ఒకటి. ఇది ఈమధ్యనే ముగిసింది.
గత ఏడాది (2016) దీన్ని ప్రతిష్టాత్మక కార్యక్రమంగా చేపట్టిన బాబు ఎప్పటి మాదిరిగానే ఘనంగా ప్రచారం చేశారు. పూర్వకాలంలో చక్రవర్తులు శత్రు రాజుల మీదికి దండయాత్ర చేసినట్లుగా చంద్రబాబు చక్రవర్తి ప్రజలకు శత్రువులైన దోమల మీద దండయాత్ర ప్రారంభించారు. ఈ దండయాత్రలో బాబు సర్కారు అరివీర భయంకరంగా విజృంభించి కోట్లాది దోమలను మట్టికరిపించిందా? రక్తపుటేరులు పారించిందా? దోమల జాతిని సమూలంగా నిర్మూలించిందా? ఏమీ చేయలేదు. 20 కోట్ల రూపాయలు దోమల్లో పోసిన పన్నీరైంది. దోమలను కాదు కదా వాటి గుడ్లను కూడా నాశనం చేయలేదని సమాచారం. బాబు సర్కారు దోమల దండయాత్ర చేయడానికి కారణం గత ఏడాది తీవ్రంగా జ్వరాలు ప్రబలడమే. చికున్‌గున్యా, డెంగ్యూ, మలేరియా మొదలైన జ్వరాలతో చాలా జిల్లాల్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జ్వరాలకు కారణం దోమలే కదా. అందుకే దండయాత్ర చేశారు. చంద్రబాబు పార్టీ నాయకులను, మంత్రులను, ఉద్యోగులను భయపెట్టగలరేమోగాని దోమలను భయపెట్టగలరా? 'తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవు' అన్నట్లుగా 'మిమ్మల్ని (దోమలను) రెండేళ్లలోగా సర్వనాశనం చేస్తాను. వంద శాతం దోమలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను' అని ప్రతిజ్ఞ చేసినంత మాత్రాన దోమ జాతి గజగజ వణికిపోయి కాళ్ల బేరానికి వస్తుందా?
రాష్ట్రాన్ని సింగపూర్‌లా చేస్తా, జపాన్‌లా చేస్తా, ఇంకేదో దేశం మాదిరిగా చేస్తా…అంటూ ప్రచారం చేసుకుంటున్న బాబు అదే వాగ్ధాటిలో 'వంద శాతం దోమల్లేని రాష్ట్రంగా చేస్తా' అని గొప్పగా చెప్పారు. కాస్త కామన్‌సెన్స్ ఉన్నవారెవరైనా అది సాధ్యం కాదని చెప్పగలరు. ఇదే మాట శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు చెప్పారని ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది.
ఆంధ్రప్రదేశ్ వాతావరణమే దోమలు బాగా ఉత్పత్తి కావడానికి దోహదపడేదిగా ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ రాష్ట్రం విపరీతమైన ఉష్ణోగ్రత, ఎక్కువ వర్షపాతం ఉన్న రాష్ట్రం. ఇక్కడి వాతావరణంలో తేమ ఎక్కువ. నీరు, తేమ ఎక్కువ ఉన్న కారణంగా అనేక జాతుల దోమలు ఉత్పత్తి అవుతున్నాయి. ఏడెస్, అనాఫిలిస్, క్యూలెక్స్, ఏషియన్ టైగర్, ఎల్లో ఫీవర్….ఇంకా అనేక రకాల దోమలు పుడుతున్నాయి. దీంతో మలేరియా, డెంగ్యూ ఇతరత్రా వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ దోమ జాతులను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదని, పూర్తిగా నిర్మూలించే రసాయనాలుగాని, బ్యాక్టీరియాగాని ఇప్పటివరకు లేవని నిపుణులు స్పష్టం చేశారు.
దోమల ఉత్పత్తి స్థానాల్లో రెగ్యులర్‌గా కొన్ని మందులు చల్లి కొంతమేరకు నియంత్రించవచ్చుగాని వందశాతం లేకుండా చేయడం, భవిష్యత్తులో దోమలు ఉత్పత్తి కాకుండా చేయడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. చంద్రబాబు 'దోమలపై దండయాత్ర' పేరుతో హడావుడి చేశారు. బడి పిల్లలతో ర్యాలీలు తీయించారు. దోమలపై పోరాడాలని వారితో నినాదాలు చేయించారు. దోమల నిర్మూలనపై అధికారులకు ఆదేశాలిచ్చారు. లక్ష్యాలు నిర్దేశించారు. బాబు స్వయంగా ర్యాలీల్లో పాల్గొని జనాలను ఉత్తేజితులను చేశారు. వారిలో చైతన్యం నింపారు. ప్రతి ఇంట్లో దోమలపై చర్చ జరగాలని, ఆ జాతిపై అలుపెరుగని సమరం చేయాలని, అప్పుడే ఆరోగ్యం బాగుంటుందని హితవు చెప్పారు. డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయాలని, పట్టణాలు, పల్లెల్లో దోమల నివారణకు మందులు చల్లాలని ఆదేశించారు. శ్రీలంక 'దోమలు లేని దేశం' అని బాబుకు ఎవరో చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ శ్రీలంకను దోమలు లేని దేశంగా ప్రకటించిందట. ఆ దేశంలో సాధ్యమైన పని ఏపీలో ఎందుకు కాదు? అని అనుకొని తాను కూడా ప్రతిజ్ఞ చేశారు.