వ్యవస్థలమీద గౌరవం ఎక్కడ ఏడ్చింది.!

కోడి పందాలపై చట్టాలున్నాయి.. న్యాయస్థానాల తీర్పులున్నాయి. జీవ హింస నేరమంటూ న్యాయస్థానాలు కోడి పందాల్ని నిషేధించిన సందర్భాలనేకం. కానీ, కోడి పందాలు లేని సంక్రాంతి ఏంటి.? అంటూ పందెంరాయళ్ళు ఎప్పటికప్పుడు తమదైన స్టయిల్లో నినదిస్తూనే…

కోడి పందాలపై చట్టాలున్నాయి.. న్యాయస్థానాల తీర్పులున్నాయి. జీవ హింస నేరమంటూ న్యాయస్థానాలు కోడి పందాల్ని నిషేధించిన సందర్భాలనేకం. కానీ, కోడి పందాలు లేని సంక్రాంతి ఏంటి.? అంటూ పందెంరాయళ్ళు ఎప్పటికప్పుడు తమదైన స్టయిల్లో నినదిస్తూనే వుంటారు. నిజానికి, నిషేధం మొదలయ్యాకనే కోడి పందాల సందడి జోరందుకుంది. ఇది మరీ చిత్రమైన సందర్భం. 

గతంలో కోడి పందాల తీరు వేరు, ఇప్పుడు కోడి పందాల తీరు వేరు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? అన్న చందాన ప్రతి యేటా కోట్లాది రూపాయల బెట్టింగ్‌ జరుగుతోంది కోడి పందాల్లో. కోడికి కత్తి కట్టకుండా పందాలు నిర్వహించవచ్చునని ప్రజా ప్రతినిథులే చెబుతుంటారు. 'కత్తి' కట్టకూడదు.. అని చెప్పే మాటలు పైకి మాత్రమే. కత్తి లేకుండా కోడి బరిలోకి దిగదంతే. అసలు ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందాలు జరగకపోతే అది ప్రజా ప్రతినిథులకు ప్రెస్టీజ్‌ ఇష్యూలా చూసే పరిస్థితులొచ్చేశాయి. 

'కోడిపందాలు ఆడారో ఖబడ్తార్‌..' అంటూ ఏపీ పోలీసు ఉన్నతాధికారులే కాదు, సాక్షాత్తూ హోంమంత్రి నిమ్మకాల చినరాజప్ప కూడా హెచ్చరించేశారు మొన్నీమధ్యనే. కానీ, చినరాజప్ప సొంత కాలాకాలోనే మైదానాల్ని రెడీ చేసేసి, కోడి పందాలు నిర్వహించేస్తున్నారు. పోలీసులు ఎక్కడ.? అనడక్కండి. అదంతే. షరామామూలుగానే ప్రజా ప్రతినిథులు కోడి పందాల దగ్గర దర్శనమిస్తున్నారు. అత్యంత ఖరీదైన కార్లు కోడి పందాల బరుల వద్ద కనిపిస్తుండడం గమనార్హం. 

నిన్న ప్రారంభమైన కోడి పందాలు, కొన్ని చోట్ల రాత్రంతా కొనసాగాయి. కోడి పందాలంటే ఆ తతంగమే వేరు. అక్కడే అన్ని ఏర్పాట్లూ వుంటాయి. తాగడానికి తగినంత మద్యం, తినడానికి తిండి, ఒక్కో చోట వ్యభిచార కార్యకలాపాలకి తగినన్ని ఏర్పాట్లు.. అబ్బో, కోడి పందాలంటే ఆ కిక్కే వేరప్పా. ఈమాత్రందానికి కోడి పందాలపై నిషేధమెందుకు.? న్యాయస్థానాల్లో ప్రభుత్వాల ప్రమాణ పత్రాలెందుకు.? పోలీసుల హెచ్చరికలు ఎందుకు.? 

ఈసారి కోడి పందాల హవా చాలా ప్రాంతాలకు పాకేసింది. ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ కోడి పందాల కోసం ఫ్లడ్‌ లైట్లతో కూడిన బరులు తయారయ్యాయి. రాయలసీమ, ఉత్తరాంధ్రల్లోనూ కోడిపందాలు దర్శనమిచ్చాయి. మొత్తమ్మీద, నిషేధ హెచ్చరికలు నానాటికీ కోడి పందాలకు విపరీతమైన పాపులారిటీని తెచ్చిపెడ్తున్నాయన్నమాట.