చిరంజీవి, బాలకృష్ణకీ.. బాలకృష్ణ, చిరంజీవికీ 'సంక్రాంతి విషెస్' చెప్పుకున్నారు. 'గౌతమి పుత్ర శాతకర్ణి' విజయం సాధించాలని చిరంజీవి, 'ఖైదీ నెంబర్ 150' విజయం సాధించాలని ఆకాంక్షించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీ ఖచ్చితంగా వుండాల్సిందేనని ఇరువురూ అభిప్రాయపడ్డారు. అందుకు తగ్గట్టే ఈ సంక్రాంతి బరిలో రెండు సినిమాలూ పోటీ పడ్డాయి. దేనికదే.. అన్నట్టు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి.
సినిమాల సంగతి అలా వుంటే, 'ఖైదీ', 'శాతకర్ణి' ఇంకో చోట పోటీ పడుతున్నాయి. అదీ ముఖాముఖి తలపడుతున్నాయి. నువ్వా.? నేనా.? అంటూ ఒకరి మీదకు ఇంకొకరు కాలు దువ్వేస్తున్నారు. ఇదంతా ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందాల వ్యవహారం లెండి. ఉన్నత న్యాయస్థానం కోడి పందాల నిర్వహణకు బ్రేక్ వేసినా, అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చేందుకు నిరాకరించినా, ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు మాత్రం బ్రేక్ పడలేదు.
చాలాకాలంగా జరుగుతున్న ప్లానింగ్ ప్రకారమే అంతా జరిగిపోతోంది. ఎల్ఈడీ స్క్రీన్లు, స్వైపింగ్ మెషీన్లకు తోడు, ఈసారి మొబైల్ బ్యాంకింగ్, పేటీఎం వంటివి కూడా అందుబాటులోకి వచ్చేశాయండోయ్. ఫ్లడ్ లైట్లు షరామామూలేననుకోండి.. అది వేరే విషయం. ఆన్లైన్లో కోడి పుంజులు దొరకడమే కాదు, ఆన్లైన్లోనూ పందాల నిర్వహణ చకచకా జరిగిపోతోంది. కోడి పందాల్లో కొందరు నిర్వాహకులు తమ తమ పుంజులకు ఖైదీ అనీ, శాతకర్ణి అనీ పేర్లు పెట్టేసి బరిలోకి దించుతున్నారు.
ఇంకేముంది, సినీ అభిమానులు తమ తమ అభిమాన హీరోల సినిమాల పేర్లతో బరిలోకి దిగుతున్న పుంజులపై భారీ స్థాయిలో బెట్టింగులకు దిగుతున్నారు. సంక్రాంతి పండుగ మూడు రోజులూ ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు ఏ స్థాయిలో జరుగుతాయో అందరికీ తెల్సిన విషయమే. కోర్టు తీర్పు, పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో నిన్నటిదాకా గందరగోళంగా వున్న వాతావరణం ఈ రోజు ఒక్కసారిగా మారిపోయింది. అధికారికంగా ఎలాంటి అనుమతులూ లేకపోయినా.. యధాతథంగా కోడి పందాలు జరిగిపోతున్నాయి. ఇంతా జరుగుతున్నా, పోలీసులు అటువైపు వెళితే ఒట్టు.!