పవన్‌కళ్యాణ్‌.. ‘ఉద్దాన’ విజయం.!

ప్రత్యేక హోదాని పాచిపోయిన లడ్డూలతో పవన్‌కళ్యాణ్‌ పోల్చినప్పుడు, టీడీపీతో పాటు బీజేపీ కూడా ఆయన మీద దుమ్మెత్తి పోసిన విషయం విదితమే. ఆ పాచిపోయిన లడ్డూలు కాస్తా బీజేపీ, టీడీపీలకు పవన్‌ని దూరం చేసేశాయి.…

ప్రత్యేక హోదాని పాచిపోయిన లడ్డూలతో పవన్‌కళ్యాణ్‌ పోల్చినప్పుడు, టీడీపీతో పాటు బీజేపీ కూడా ఆయన మీద దుమ్మెత్తి పోసిన విషయం విదితమే. ఆ పాచిపోయిన లడ్డూలు కాస్తా బీజేపీ, టీడీపీలకు పవన్‌ని దూరం చేసేశాయి. ప్రత్యేక హోదాని తుంగలో తొక్కేయాలని టీడీపీ, బీజేపీ నిర్ణయించుకున్నాక పవన్‌, ఆ ప్రత్యేక హోదా నినాదంతో ఉద్యమించడం ఆ రెండు పార్టీలకూ నచ్చలేదు మరి.! 

'అసలు పవన్‌కళ్యాణ్‌ ఎన్డీయే కూటమిలో వున్నారా.? లేదా.? జనసేన ఏమీ మాకు మిత్రపక్షం కాదు కదా.! ఆయన మిత్రుడో కాదో ఆయనే తేల్చుకోవాలి..' అంటూ బీజేపీ ఏపీ ఇన్‌ఛార్జ్‌ సిద్దార్థ నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబూ ఒకటి రెండు సందర్భాల్లో, 'వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి..' అంటూ పవన్‌కి ఝలక్‌ ఇచ్చారు. 

ఏమయ్యిందోగానీ, ఉద్దానం విషయానికొచ్చేసరికి పవన్‌కళ్యాణ్‌ మాట నెగ్గుతోంది. ఉద్ధానాన్ని ఉద్దరించేయడానికి ఇటు టీడీపీ, అటు బీజేపీ పడరాని పాట్లూ పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉద్దానంపై ప్రత్యేక శ్రద్ధ పెడతామనీ, కిడ్నీ వ్యాధి బాధితుల్ని ఆదుకుంటామనీ ప్రకటించేయడమే కాదు, అక్కడ వైద్య సౌకర్యాల్ని పెంచేందుకు అధికార యంత్రాంగానికి ఆదేశాలు కూడా జారీ చేసేశారు. కేంద్రమూ ఈ వ్యవహారంపై స్పందించింది. దాంతో, ఉద్దానం ప్రాంత కిడ్నీ వ్యాధి పీడిత కుటుంబాల్లో ఇప్పుడిప్పుడే బతుకు మీద ఆశలు పెరుగుతున్నాయి. ఆశపడటం, ఆవేదన చెందడం ఉద్దానం ప్రజలకి మామూలే అయినా, ఈసారెందుకో వారి ఆశ ఫలిస్తుందన్న సంకేతాలైతే కన్పిస్తుండడం గమనార్హం. 

48 గంటల డెడ్‌లైన్‌.. 15 రోజుల్లో నివేదిక.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని కలిసేందుకు ప్రణాళిక.. ఇలా ఉద్దానం పర్యటన అనంతరం పవన్‌కళ్యాణ్‌ పొలిటికల్‌ డెసిషన్లను అక్కడికక్కడే ప్రకటించేశారు. వీటితోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతలా కదిలిపోయాయా.? అంటే, కాదనడానికైతే కారణాలు కన్పించడంలేదు. ఎలాగైతేనేం, పవన్‌కళ్యాణ్‌ కారణంగా ఉద్దానం బాగుపడితే అంతకన్నా కావాల్సిందేముంది.? 

ప్రపంచంలోనే కిడ్నీ వ్యాధి సమస్యలు అత్యంత తీవ్రంగా వున్న మూడు ప్రాంతాల్లో ఉద్దానం ఒకటి. రెండు దశాబ్దాలుగా ఇక్కడి పరిస్థితి అత్యంత దయనీయం. ఇది, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి పెను సవాల్‌. వైద్య రంగానికే అంతుబట్టని రహస్యం. మానవత్వానికే మాయని మచ్చ. ప్రభుత్వాల నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఇలా ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ఎట్టకేలకు ఇన్నాళ్ళకు ఉద్దానం వెతలు తీరతాయంటే, ఎవరైనాసరే ఆహ్వానించి తీరాల్సిందే. ఉద్దానంలో చావు కళ పోయి, మళ్ళీ ఆరోగ్యకరమైన వాతావరణం అక్కడ నెలకొంటుందా.? ఇది జరిగే పనేనా.? జరిగితే అది అద్భుతమే. ఆ అద్భుతమే జరిగితే, అది పవన్‌కళ్యాణ్‌ 'ఉద్దాన' విజయంగా చరిత్రకెక్కుతుందన్నది నిర్వివాదాంశం.