టాలీవుడ్ నటుడు నారా రోహిత్ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు రైడ్ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. గత ఏడాదిలో ఐదారు సినిమాల్లో హీరోగా నటించి, ఒక సినిమాను నిర్మించాడు రోహిత్. ఈయన నిర్మాతగా వ్యవహరించిన సినిమాకు సంబంధించిన బిల్స్ ను ఇతర ఆదాయ వివరాలను అధికారులు పరిశీలించారట.
రెండు రోజుల క్రితం ఈ రైడ్స్ జరిగినట్టు సమాచారం. మరి ఈ రైడ్స్ తో అధికారులు ఎలాంటి వివరాలు పొందారో, ఏం పట్టుకెళ్లారు అనే విషయాలపై స్పష్టత లేదు.
కేవలం సినీహీరో, నిర్మాతగా అయితే నారా రోహిత్ ఇంటిపై ఐటీ రైడ్స్ అంత ప్రాధాన్యతను ఇవ్వదగిన అంశాలు కాదు కానీ, ఆయన ఏపీ చంద్రబాబు తమ్ముడి కొడుకు. దీంతో.. ఐటీ రైడ్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తమ్ముడి తనయుడి ఇంట్లో ఐటీ రైడ్స్ అంటే.. ఒక విధంగా సంచలనం కూడా. అవతల తమిళనాడులో జరుగుతున్న ఐటీ రైడ్స్ పతాక శీర్షికలకు ఎక్కుతున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో నారా రోహిత్ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల తనిఖీల గురించి మాత్రం ప్రెస్ రిలీజ్ లేమీ లేవు.