మలైకా అరోరా ఖాన్, అర్బాజ్ ఖాన్.. విడాకులకు దరఖాస్తు చేసుకుని, కౌన్సిలింగ్ సెషన్స్ కోసమని కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. పద్నాలు సంవత్సరాల పాటు వైవాహిక జీవితాన్ని గడిపిన వీళ్లిద్దరూ ఇటీవలే విడిపోవాలని నిర్ణయించుకున్నారు. పిల్లలు కూడా కలిగిన ఈ జంట విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల కౌన్సిలింగ్ లో వీరి భరణం వ్యవహారం కూడా సెటిలైనట్టుగా వార్తలు వచ్చాయి.
పది నుంచి పదిహేను కోట్ల రూపాయలతో వీరు విడాకుల డీల్ ను సెటిల్ చేసుకున్నట్టుగా బాలీవుడ్ పత్రికలు ప్రముఖంగా పేర్కొన్నాయి. ఇక వీరు విడిపోవాలని నిర్ణయించుకున్న తరుణంలో వీరి కుటుంబ సభ్యులు వీరికి సర్ధి చెప్పడానికి ప్రయత్నించినట్టుగా కూడా వార్తలొచ్చాయి. అయితే వీరు అందుకు సమ్మతించలేదని తెలుస్తోంది.
ఆ సంగతంతా అలా ఉంటే.. ఈ జంట న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను జంటగా జాం.. జాం.. అంటూ జరుపుకోవడం విశేషం. గోవా వేదికగా.. మలైకా- అర్బాజ్ లు న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వీరి సన్నిహితులంతా కలిసి పార్టీ చేసుకున్నారట. ఈ పార్టీలో వీళ్లిద్దరూ కలిసి ఫొటోలకు పోజులు కూడా ఇచ్చారు. ఆ ఫొటోలను వీరి సన్నిహితులు సోషల్ మీడియాలో షేర్ చేశారు!
మరి కలిసి ఉండలేమంటూ.. విడిపోవడానికి నిర్ణయించుకుని … విడాకుల వరకూ వెళ్లిన వీళ్ల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మాత్రం ఆశ్చర్యాన్ని కలిగించే రీతిలోనే ఉన్నాయి. కలిసి సంబరాలు జరుపుకునేంత సాన్నిహిత్యం ఉన్నప్పుడు చట్టబద్ధమైన విడాకులు ఎందుకో!