పెద్ద హీరోలు డేట్లు ఇవ్వకపోవడంతో, చిన్న సినిమా దారిలోకి అడుగుపెట్టక తప్పలేదు దర్శకుడు శ్రీను వైట్లకు. తను సృష్టించిన ఫార్ములా తనకే ఉరితాడులా మారడంతో, తప్పనిసరి అయి అబౌట్ టర్న్ తీసుకుని పాత బాటలోకి అడుగు పెట్టక తప్పలేదు. వరుణ్ తేజ తో తీస్తున్న ఈ సినిమాకు శ్రీనువైట్ల వర్కింగ్ పార్టనర్. అంటే ఫీజు తీసుకోకుండా లాభాల్లో సగం తీసుకుంటాడన్నమాట. ఒకప్పుడు పది కోట్లకు పైగా తీసుకున్న దర్శకుడు. ఇప్పుడు అంత ఫీజు లాభంగా రావాలి అంటే ఆ సినిమాకు ఇరవై కోట్లు లాభమే రావాలన్నమాట. కానీ ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలి అంటే, ఇప్పటి దాకా లాభాలు పండించిన వరుణ్ తేజ సినిమా ఏదీ లేదనే చెప్పాలి.
ముకుంద, కంచె మంచి సినిమాలే కానీ లాభాలు పండించినవి కాదు. లోఫర్ పరిస్థితి తెలిసిందే. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో శ్రీనువైట్ల పేరు జోడించి మిస్టర్ సినిమాను మంచి రేట్లకే విక్రయించడం స్టార్ట్ చేసారు. ఆంధ్ర అంతా కలిపి పది కోట్లకు అమ్మాలని టార్గెట్ పెట్టుకున్నారు. మరి ఆ రేషియోలో సీడెడ్, నైజాం అన్నీ కలుపుకుని ఇరవై నుంచి పాతిక కోట్ల మధ్య వుంటుందన్నమాట. శాటిలైట్, హిందీ, ఓవర్ సీస్ అన్నీ కలుపుకుంటే ముఫై కోట్లకు పై మాటే.
సినిమా ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి పది, పన్నెండు కి కాస్త పైగా మాత్రమే వుంటుందని వినికిడి. ఎందుకంటే వరుణ్ తేజ ముకుంద లింక్ తో ఈ సినిమా చెేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్లు ఇద్దరూ కలిసి కూడా డెభై అయిదు లక్షలు దాటలేదు.
అంటే సినిమా అనుకున్నట్లు మార్కెట్ జరిగితే శ్రీనువైట్లకు ఎప్పటిలాగే రెమ్యూనిరేషన్ అందుతుందన్నమాట. కానీ ఒకటే అనుమానం వరుణ్ తేజకు పాతిక కోట్ల థియేటర్ కలెక్షన్ స్టామినా వుంటందా అనేదే.