‘ప్యాకేజి’ చట్టబద్ధతకూ తిలోదకాలేనా?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తాం…ఇస్తాం అని ఆశలు కల్పించి, అరచేతిలో స్వర్గం చూపించి నిసిగ్గుగా, నిర్భయంగా ఎగ్గొట్టింది నరేంద్ర మోదీ సర్కారు. అందుకు చెప్పిన ఏ కారణాలు సహేతుకం కావనే విషయం బీజేపీ నాయకులకూ…

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తాం…ఇస్తాం అని ఆశలు కల్పించి, అరచేతిలో స్వర్గం చూపించి నిసిగ్గుగా, నిర్భయంగా ఎగ్గొట్టింది నరేంద్ర మోదీ సర్కారు. అందుకు చెప్పిన ఏ కారణాలు సహేతుకం కావనే విషయం బీజేపీ నాయకులకూ తెలుసు. జనాలకూ తెలుసు. పార్లమెంటులో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిందీ వారే. ఆ తరువాత ఇవ్వలేమని, ఇవ్వడం కుదరదని, ఇవ్వలేకపోతున్నామని, అరిచి గీపెట్టినా ఇవ్వం పోండి అని అన్నదీ వారే.

ఇంత ద్రోహం చేసినా చంద్రబాబు కాబట్టి సర్దుకుపోయారుగాని తమిళనాడులోనో, కర్నాటకలోనో అయితే కేంద్రాన్ని గడగడలాడించేవారే. అక్కడివరకూ ఎందుకు తెలంగాణకు ఇలా ద్రోహం చేసుంటే రచ్చరచ్చ చేసి బూరు పీకి చారు పెట్టేవారే. సరే…ప్రత్యేక హోదా అటకెక్కించాక ప్రత్యేక ప్యాకేజీ అని ప్రచారం పొందిన ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ. ఇది జరిగి నాలుగు నెలలైంది. అరుణ్‌ జైట్లీ, వెంకయ్య నాయుడు సన్మానాలు చేయించుకున్నారుగాని ఇప్పటివరకు ప్రత్యేక ప్యాకేజీ అనబడే ఆర్థిక సాయానికి చట్టబద్ధత కల్పించలేదు. 

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తప్పనిసరిగా చేస్తామన్నారు. ఆ సమావేశాలు గొడలతో, గందరగోళంతో మటాష్‌ అయ్యాయి. ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని సీఎం చంద్రబాబు అడిగారు. తప్పనిసరిగా కల్పిస్తామని, అందులో సందేహమే అక్కర్లేదని అరుణ్‌ జైట్లీ, వెంకయ్య నాయుడు పదే పదే చెప్పారు. కాని ఇప్పటివరకు ఏమీ లేదు. కారణం ఏమిటి? వారికే తెలియదు.

బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు హరిబాబు చెప్పిందాన్నిబట్టి చూస్తే మోదీ సర్కారు ప్యాకేజీ చట్టబద్ధతకూ తిలోదకాలు ఇస్తుందేమోననే అనుమానం కలుగుతోంది. కాకినాడలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. దీనికి పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్‌ సింగ్‌ కూడా హాజరయ్యారు. మీడియా ప్రతినిధులు హరిబాబును కలిసి ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు కదా, ఆ విషయం ఏం చేశారు? అని అడిగారు. దీనికాయన 'చట్టబద్ధత ఇవ్వాల్సిన పనేముంది? ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం కదా' అని జవాబిచ్చారు.

అంటే ఏమనుకోవాలి? హరిబాబు అంతటితో ఊరుకోలేదు. 'ప్యాకేజీకి చట్టబద్ధత ఇవ్వకపోయినా పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తున్నాం కదా' అన్నారు. దీన్నిబట్టి చూస్తే ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధతకు కేంద్రం తిలోదకాలు ఇస్తుందనే అనుమానం కలుగుతోంది. తిలోదకాలు ఇచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్దుకుపోతారని మోదీ, వెంకయ్య, అరుణ్‌ జైటీకి తెలుసు. ప్రత్యేక హోదా వల్ల ఒరిగేదేమీలేదని చెప్పిన చంద్రబాబు ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించకపోవడం వల్ల ఏమీ నష్టం లేదని చెప్పగలరు. 2018 నాటికి పోలవరం పూర్తిచేసి తీరుతామని చంద్రబాబు బల్లగుద్ది చెబుతున్నారు. ఆయన గట్టిగా గుద్దితే బల్ల విరుగుతుందే తప్ప పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని ఇరగేషన్‌ నిపుణలే అభిప్రాయపడుతున్నారు.

ఇక పోలవరం ప్రాజెక్టు క్రెడిట్‌ దక్కించుకోవడానికి చంద్రబాబు నాయుడు, వైఎస్‌ జగన్‌ పోటీ పడుతున్నారు. పోలవరంను సాకారం చేసిన ఘనత తనదేనని చంద్రబాబు, నరేంద్ర మోదీ ఇందుకు కారకుడని బీజేపీ నాయకులు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి కృషి వల్లనే సాధ్యమైందని జగన్‌ ప్రచారం చేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోలవరం ప్రాజెక్టు ప్రధాన ప్రచారాస్త్రంగా మారుతుంది. కాబట్టి ఎవరికివారే దీన్ని ప్రజల బుర్రల్లోకి ఎక్కించేందుకు పాట్లు పడుతున్నారు. ఇక  విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ఏమైందో తెలియదు. ఈ జోన్‌ కోసమే రైల్వే మంత్రి సురేష్‌ ప్రభును ఏపీ నుంచి రాజ్యసభకు పంపారు చంద్రబాబు నాయుడు.

మరి పంపినందుకు దక్కాల్సిన ప్రతిఫలం దక్కలేదేం? ఇది చాలా సున్నితమైన సమస్య అని చంద్రబాబు అన్నారు. విభజన చట్టంలో ఉన్న ఈ అంశం అమలు చేయాల్సిన బాధ్యత  ప్రధాని మోదీకి, చేయించే పట్టుదల బాబుకు ఉండాలి. కాని ఆయన ఇది సున్నితమైన సమస్య అంటేనే సందేహం కలుగుతోంది. రైల్వే జోన్‌కు పంగనామాలు పెట్టినా చంద్రబాబు సర్దుకుపోవచ్చు. ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. ఉమ్మడి ఏపీని విభజించడంలో బీజేపీకి, టీడీపీకి ఉన్న పట్టుదల అవశేష ఏపీకి అన్యాయం చేయడంలోనూ కనబడుతోంది. దీని ఫలితం ఎన్నికల్లోనే తెలియాలి.