తనకు ఇంకా ఎన్నో సినిమాల్లో నటించాలని ఉందని, అయితే బిజీ షెడ్యూల్ అయిపోయిందని, సమయం చాలడం లేదని ఇటీవలే చెప్పారు అమితాబ్. వయసు మీద పడుతున్నా.. ఆయనకు సినిమాలపై ఆసక్తి ఏ మాత్రం తగ్గడం లేదని స్పష్టం అవుతోంది. ఇదే సమయంలో.. అమితాబ్ ఒక తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అని ముంబై మిర్రర్ పత్రిక ఒక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది.
సర్కార్- 3 సెట్స్ మీద బాలకృష్ణ ప్రత్యేకంగా అమితాబ్ ను కలిసిన విషయం విదితమే. ఆ సందర్భంగా ‘రైతు’ సినిమా ప్రతిపాదన తీసుకొచ్చారని.. అందులో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించమని అమితాబ్ ను కోరారని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం తను చాలా బిజీ అని, చేయలేనని బిగ్ బి అన్నారని.. దీంతో చేసేది లేక ఆ ప్రాజెక్టునే బాలయ్య పక్కన పెట్టేసినట్టుగా వార్తలు వచ్చాయి.
ఆ పాత్రలో అమితాబ్ అయితేనే బాగుంటుందని, మరొకరు ఆ పాత్ర ను ఇవ్వడానికి బాలయ్య- దర్శకుడు కృష్ణవంశీలు సిద్ధంగా లేరని అన్నారు. అయితే.. ఇప్పుడు ముంబై పత్రిక చెబుతున్నది ఏమిటంటే.. వచ్చే ఏడాది జూన్ తర్వాత ఆ సినిమా పట్టాలెక్కుతుంది అనేది!
ప్రస్తుతం ఉన్న కమిట్ మెంట్స్ తో బిగ్ బి 2017 జూన్ వరకూ చాలా బిజీగా ఉన్నారని, ఇవన్నీ పూర్తయ్యాకా ‘రైతు’కు సమయం కేటాయిస్తానని ఆయన చెప్పారట. ఈ ప్రతిపాదన పట్ల బాలకృష్ణ – కృష్ణవంశీలు ఆనందంగా ఒప్పుకున్నారని, ఈ లెక్కన 2017 జూన్ తర్వాత ఆ సినిమా పట్టాలెక్కుతుందనేది ఆ పత్రిక రాసిన కథనం సారాంశం.