కేటీఆర్‌పై రేవంత్ ఎంత మాట‌న్నాడో!

తెలంగాణ రాజ‌కీయాల్లో వ్య‌క్తిగ‌త దూషణ‌లు పెరిగాయి. ముఖ్యంగా టీపీసీసీ అధ్య‌క్ష బాధ్య‌త‌లను రేవంత్‌రెడ్డి తీసుకున్న త‌ర్వాత బీఆర్ఎస్‌పై ఘాటైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఒక్కోసారి వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగ‌డం, అటు వైపు నుంచి అదే రీతిలో…

తెలంగాణ రాజ‌కీయాల్లో వ్య‌క్తిగ‌త దూషణ‌లు పెరిగాయి. ముఖ్యంగా టీపీసీసీ అధ్య‌క్ష బాధ్య‌త‌లను రేవంత్‌రెడ్డి తీసుకున్న త‌ర్వాత బీఆర్ఎస్‌పై ఘాటైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఒక్కోసారి వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగ‌డం, అటు వైపు నుంచి అదే రీతిలో కౌంట‌ర్లు స‌ర్వ‌సాధార‌ణ‌మ‌య్యాయి. తాజాగా తుపాను ప్ర‌భావంతో తెలంగాణ‌లో విస్తారంగా వ‌ర్షాలు కురిశాయి. వ‌రద‌లు ముంచెత్తాయి. కొన్ని ప్రాంతాల్లో భారీగా ఆస్తి న‌ష్టం సంభ‌వించింది.

ఈ నేప‌థ్యంలో వ‌ర‌ద బాధితుల‌ను ప‌ట్టించుకోలేద‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఉప్ప‌ల్‌లో ప‌ర్య‌టించిన రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై చెల‌రేగిపోయారు. తుపాను ప్ర‌భావంతో ప్రాణాలు పోయిన కుటుంబాల‌ను ఆయ‌న ఓదారుస్తూ, మంత్రి కేటీఆర్‌పై ప‌రుష ప‌ద‌జాలాన్ని ప్ర‌యోగించ‌డం గ‌మ‌నార్హం.

మున్సిప‌ల్ మంత్రికి పిండ‌ప్ర‌దానం చేస్తామ‌ని రేవంత్‌రెడ్డి నోటికొచ్చిన‌ట్టు తిట్టారు. పార్టీ ఫిరాయింపుల‌పై సీఎం కేసీఆర్‌కు ఉన్న శ్ర‌ద్ధ‌, ప్ర‌జల ప్రాణాల‌పై లేవ‌ని ధ్వ‌జ‌మెత్తారు. వ‌ర‌ద‌ల‌పై స‌మీక్షించకుండా రాజ‌కీయ కార్య‌క‌లాపాల్లో మునిగిపోయార‌ని విమ‌ర్శించారు. 

వ‌ర్ష ప్ర‌భావంపై వాతావ‌ర‌ణ శాఖ ముంద‌స్తుగా హెచ్చ‌రించినా కేసీఆర్ స‌ర్కార్ ప‌ట్టించుకోలేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. వ‌ర‌ద‌ల వ‌ల్ల 30 మంది ప్రాణాలు కోల్పోయినా, సీఎం కేసీఆర్ ఎందుకు ఇంత వ‌ర‌కూ బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌లేద‌ని రేవంత్‌రెడ్డి ప్ర‌శ్నించారు. హైకోర్టు అక్షింత‌లు వేసినా సీఎంకు బుద్ధి రాలేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.