చంద్రబాబునాయుడు తన వయసుకు తగ్గట్టు విమర్శలు చేస్తే బాగుండేది. ప్రత్యర్థులపై బాబు ఏదో అభ్యంతరకర వ్యాఖ్య చేయడం, వాళ్లు పదింతలు మాట్లాడ్డం అలవాటైంది. మంత్రి అంబటి రాంబాబు వెటకారానికి మారుపేరు. అలాంటి నాయకుడిపై అవాకులు చెవాకులు పేలితే ఊరుకుంటారా? అబ్బే…తగ్గేలే అని ఆయన రెచ్చిపోతారు. అలాంటిదే ఇవాళ జరిగింది.
మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి అంబోతు అని చంద్రబాబు నోరు పారేసుకున్నారు. ఇందుకు కౌంటర్ ఇచ్చేందుకు అంబటి రాంబాబు ప్రెస్‌మీట్ పెట్టారు. తనను చంద్రబాబు ఆంబోతు అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ అల్లుడు కావడం వల్లే చంద్రబాబు సీఎం అయ్యారని చెప్పుకొచ్చారు. కానీ తాను అలా కాదన్నారు. కిందిస్థాయి నుంచి ఎదుగుతూ వచ్చానన్నారు.
తనపై ఇష్టానుసారం చంద్రబాబు మాట్లాడ్డం ఏంటని ఆగ్రహం ప్రదర్శించారు. ఆంబోతు అన్న చంద్రబాబుకు అంబటి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అంబటి ఏమన్నారంటే…‘చంద్రబాబు నన్ను ఆంబోతు అన్నప్పుడు ఆయన ఆంబోతులకు ఆవులను సరఫరా చేసినట్టు కలిపి చదువుకోవాలి’ అని దిమ్మతిరిగే పంచ్ విసిరారు. ఇటీవల వలంటీర్లపై పవన్‌కల్యాణ్ విమర్శ ఎందుకు వివాదాస్పదం అయ్యిందో అంబటి తాజా కామెంట్ వింటే అర్థమవుతుంది.
పెద్దరికంతో రాజకీయ విమర్శలు చేయాల్సిన చంద్రబాబు, అది పోగొట్టుకుని తిట్టడం, తిట్టించుకోవడం అలవాటు చేసుకున్నారు. అందులో భాగంగానే అంబటితో అంత పెద్ద మాట అనిపించుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంబోతులకు అవులను సరఫరా చేసే నాయకుడిగా చంద్రబాబును చిత్రీకరించడం …వినడానికే కాస్త ఇబ్బందిగా అనిపించే అంశం.
ఇక చంద్రబాబు తల ఎక్కడ పెట్టుకుంటాడో ఆయనకే తెలియాలనే చర్చకు తెరలేచింది. అందుకే మనం గౌరవం పొందాలని అనుకుంటే, ఎదుటి వాళ్లను కూడా గౌరవించడం నేర్చుకోవాలి. లేదంటే ఇదిగో ఇలా తిట్టించుకోవాల్సి వస్తుందని చంద్రబాబు ఎప్పుడు తెలుసుకుంటారో.