శ్రీలంక టు చిత్తూరు.. మరో ఆన్ లైన్ ప్రేమాయణం

సీమా ఉదంతం ఇంకా వార్తల్లో నలుగుతూనే ఉంది. పాకిస్థాన్ కు చెందిన ఈ మహిళ, నేపాల్ మీదుగా ఇండియాలోకి ప్రవేశించి, ఢిల్లీ యువకుడితో ఉండిపోతానంటోంది. ఇప్పుడు అలాంటిదే మరో ఘటన జరిగింది. ఈసారి ఆంధ్రప్రదేశ్…

సీమా ఉదంతం ఇంకా వార్తల్లో నలుగుతూనే ఉంది. పాకిస్థాన్ కు చెందిన ఈ మహిళ, నేపాల్ మీదుగా ఇండియాలోకి ప్రవేశించి, ఢిల్లీ యువకుడితో ఉండిపోతానంటోంది. ఇప్పుడు అలాంటిదే మరో ఘటన జరిగింది. ఈసారి ఆంధ్రప్రదేశ్ దీనికి వేదికగా మారింది. సీమాది పబ్ జీ ప్రేమ కాగా… ఇది ఫేస్ బుక్ లవ్.

చిత్తూరు జిల్లా వి.కోట మండలం ఆరిమాకులపల్లెకు చెందిన ఓ తాపీ మేస్త్రి కొడుకు లక్ష్మణ్. ఇతడికి శ్రీలంకలోని బేలంగూడు ప్రాంతానికి చెందిన విఘ్నేశ్వరితో ఫేస్ బుక్ లో పరిచయమైంది. చాన్నాళ్లు ఇద్దరూ ఛాటింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఫోన్ నంబర్లు ఇచ్చారు. మాట్లాడుకున్నారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

ఇక ఆపుకోలేకపోయారు, ఎలాగైనా కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో శ్రీలంక విఘ్నేశ్వరి ఎక్కువ చొరవ చూపించింది. టూరిస్టు వీసా తీసుకొని, శ్రీలంక నుంచి తన ప్రియుడి కోసం ఇండియాకు వచ్చేసింది.

ఆమె ఫ్లయిట్ ఎక్కకముందే ఇంట్లో తల్లిదండ్రుల్ని ఒప్పించాడు లక్ష్మణ్. ఈనెల 8న ఆమె చెన్నైలో ల్యాండ్ అవ్వగా.. అక్కడికి వెళ్లి తన ఇంటికి తీసుకొచ్చాడు లక్ష్మణ్. పెద్దల అంగీకారంతో… ఈనెల 20న స్థానిక సాయిబాబా గుడిలో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.

ఇంతవరకు బాగానే నడిచింది, అసలు ట్విస్ట్ తర్వాతే మొదలైంది. ఆమె టూరిస్ట్ వీసా గడువు దగ్గరకొచ్చింది. ఆమె ఇంకా ఇండియాలోనే ఉందనే విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఆగస్ట్ 6లోగా దేశం విడిచి వెళ్లాలని నోటీసిచ్చారు. అయితే విఘ్నేశ్వరి మాత్రం ఇక్కడే ఉండిపోతానంటోంది.

భారత ప్రభుత్వం కరుణించి, తనను లక్ష్మణ్ తోనే ఉండిపోయేలా చూడాలని, శ్రీలంక తిరిగి వెళ్లడం తనకు ఇష్టంలేదని చెబుతోంది. అటు లక్ష్మణ్ కూడా తన కాపురం నిలబెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.