రాంబాబు Vs శ్యాంబాబు.. పొలిటికల్ స్క్రీన్ పై ‘బ్రో’

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మరో వివాదం రాజుకుంది. ఈసారి వివాదానికి బ్రో సినిమా కారణమైంది. ఈ సినిమాలో అంబటి రాంబాబును, అతడు గతంలో వేసిన డాన్స్ ను ఇమిటేట్ చేశారు. దీనికి పవన్ కల్యాణ్…

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మరో వివాదం రాజుకుంది. ఈసారి వివాదానికి బ్రో సినిమా కారణమైంది. ఈ సినిమాలో అంబటి రాంబాబును, అతడు గతంలో వేసిన డాన్స్ ను ఇమిటేట్ చేశారు. దీనికి పవన్ కల్యాణ్ సినిమాలో తనదైన వ్యాఖ్యానాన్ని కూడా జోడించారు.

నిజానికి బ్రో సినిమాకు, ఈ సన్నివేశానికి ఎలాంటి సంబంధం లేదు. కళ్లుమూసుకొని ఎడిటింగ్ లో తీసిపారేసే ఎపిసోడ్ ఇది. కానీ కావాలనే దీన్ని ఉంచారు, కారణం వైసీపీ నేత అంబటి రాంబాబును గిల్లడమే ధ్యేయం.

అయితే తనను గిల్లితే, ఎదుటి వ్యక్తి ఒళ్లంతా రక్కేసే రకం అంబటి రాంబాబు. బ్రో లో తనను అనుకరించారనే విషయం తెలిసి వెంటనే సీన్ లోకి వచ్చారు ఈ నేత. పొద్దున్నే ట్వీట్ పెట్టి, ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి పవన్ ను ఏకి పడేశారు. ఆయన ఏమంటున్నారంటే…

“నేను ప్రజల మద్దతుతో గెలిచాను, ప్రజల మద్దతుతో మంత్రి అయ్యాను. గెలిచినోడు డాన్స్ చేస్తే సంక్రాంతి. నేను ఆనందంతో డాన్స్ చేశాను. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక, సినిమాలో నా పేరడీలు పెట్టుకొని పవన్ కల్యాణ్ శునకానందం పొందుతున్నారు. ఇలాంటి విషయాల్ని నేను పట్టించుకోను. చంద్రబాబు చెప్పారని పవన్ కల్యాణ్ డాన్సులు వేస్తున్నారు. ఎవరో చెబితే నేను డాన్స్ చేయలేదు, ఆనందంతో వేశాను. ఈసారి భోగీకి మళ్లీ డాన్స్ చేస్తాను, కావాలంటే నేరుగా వచ్చి చూస్కోండి.”

ఇలా ఓ రేంజ్ లో కడిగిపారేశారు అంబటి రాంబాబు. నా డాన్స్ లో సింక్ లేదంటూ సినిమాలో పవన్ కల్యాణ్ పరోక్షంగా విమర్శించడంపై ప్రత్యక్షంగా స్పందించారు అంబటి. తను డాన్స్ మాస్టర్ ని కాదన్నారు. తన సంగతి పక్కనపెడితే, పవన్ కల్యాణ్, రాజకీయాల్లో సింక్ అవ్వడం లేదంటూ విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలిచి తను ఆనందంగా ఉన్నానని, తనపై పేరడీలు చేసుకుంటూ పవన్, శునకానందాన్ని పొందుతున్నారని ఎద్దేవా చేశారు.

బ్రో సినిమాలో అంబటి రాంబాబు పేరడీ పాత్ర పేరు శ్యాంబాబు. ఈ శ్యాంబాబు పాత్రను 30 ఇయర్స్ పృధ్వీ పోషించారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలపై పృధ్వి స్పందించారు. ఇమేటేట్ చేసేంత పెద్ద ఫిగర్ అంబటి రాంబాబు కాదన్నారు. ఆయన్ను అనుకరించేంత సీన్ లేదన్నారు.

“అంబటి రాంబాబును ఇమిటేట్ చేసేంత సీన్ లేదు. ఆయన ఆస్కార్ నటుడేం కాదు. ఆయన్ను ఇమిటేట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. తనలా డాన్స్ చేశానని ఆయన అనుకుంటున్నారు, మేం అనుకోవడం లేదు. మా డాన్స్ వేరు, ఆయన డాన్స్ వేరు. మంత్రుల్ని కించపరుస్తున్నాడని అన్నారు. మరి పవన్ ను వైసీపీ నేతలు ఎంత కించపరిచారో తెలుసుకుంటే మంచిది.”

ఇలా అంబటి కామెంట్స్ ను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు పృధ్వీ. ఈ 'బ్రో' వివాదం రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.