పవన్‌కళ్యాణ్ 'ట్వీటాస్త్రం'లో మూడో ఎపిసోడ్ ముందుగా ముచ్చటేసింది. దేశభక్తి గురించి పవన్‌కళ్యాణ్ ఈ ట్వీటాస్త్రంలో గట్టిగానే 'ఎత్తుకున్నారు'.! కాస్త, ఘాటుగానే ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఝలక్ ఇచ్చారు.. అదీ పరోక్షంగానే అనుకోండి.. అది వేరే విషయం. ఎలాగైతేనేం, దెబ్బ, గట్టిగానే తగిలిందన్నది నిర్వివాదాంశం. అయితే, ఇది ఒక్క నరేంద్రమోడీకి మాత్రమే కాదు, 'అసహనం' పేరుతో నానా రకాల రాజకీయాలు చేసినోళ్ళకీ, సహనం పేరుతో రాజకీయం చేసినవాళ్ళకీ చెర్నాకోల్ దెబ్బలాంటిదేనన్నది నిర్వివాదాంశం.
పీక్స్‌కి తీసుకెళ్ళి, పవన్‌కళ్యాణ్ ఒక్కసారిగా తుస్సుమనిపించేశారు. అదీ పవన్‌కళ్యాణ్ అంటే. దేశభక్తికి అర్థం వేరు.. తాము దేశభక్తి అనుకుంటున్నదాన్ని, ఇతరులపైకి బలవంతంగా రుద్దవద్దని పవన్ చెప్పడాన్నీ కాదనలేం. కానీ, మంచి ఘాటుగా నడుస్తున్న వ్యవహారానికి 'థియేటర్లలో జాతీయ గీతాలాపన' అంశంతో ఫినిషింగ్ టచ్ ఇవ్వాలనుకుని.. మొత్తం వ్యవహారాన్ని కలగూరగంపలా తయారు చేసేశారు. పవన్‌కళ్యాణ్ అంతే, ఆయన ఎట్నుంచో మొదలుపెట్టి, ఎక్కడికో తీసుకెళ్ళిపోయి, ఎవరికీ అర్థం కాకుండా చేసేస్తారు.
ఇక్కడ, పవన్‌కళ్యాణ్ అర్థం చేసుకోవాల్సిందొకటుంది. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికిగాను, సినిమా థియేటర్లలోనూ 'జాతీయ గీతాలాపన' తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం కానే కాదు. సర్వోన్నత న్యాయస్థానం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విషయమై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దాంతో, సుప్రీంకోర్టు ఆదేశాల్ని గౌరవించి థియేటర్లలో జనగనమన గీతాలాపన జరషురూ అయ్యింది.
ఓ సాయంత్రం కుటుంబం, స్నేహితులతో కలిసి సినిమాకి వెళితే దాన్ని దేశభక్తిని నిరూపించుకునే వేదికగా మార్చేయడం… అంటూ క్లాప్స్ కొడుతున్న చేతుల్ని పెట్టారు జనసేనాని పవన్‌కళ్యాణ్. ఇందులో ఆయన క్లాప్స్ కొట్టడానికేముందో.. అసలు వెటకారం చేయడానికేముందో ఆయనకే తెలియాలి. ఈ ఒక్క లైన్ 'యాడ్' చేయకుండా వుండి వుంటే, ఈ ట్వీటాస్త్రం గట్టిగా పేలేదే.!
పైన చెప్పుకున్న రాజకీయ దేశభక్తిని గురించి ఓ రోజు ప్రశ్నించి, ఇంకోరోజు అసలైన దేశభక్తి గురించి పవన్‌కళ్యాణ్ ప్రస్తావించి వుంటే బావుండేదేమో.! ఇంకా నయ్యం, అంత కరెక్ట్‌గా చేస్తే ఆయన పవన్‌కళ్యాణ్ ఎందుకవుతారు.? ఏదో చెప్దామనుకున్నారు, ఇంకేదో అయిపోయింది. దటీజ్ పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్. రేపటి ఎపిసోడ్‌లో ప్రత్యేక హోదా అంశం. కాస్కోండిక.!