మురగదాస్-మహేష్ బాబు సినిమాకు నిధుల కొరత లేదు..స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ. షూటింగ్ చకచకా సాగుతోంది. కానీ ఎక్కడి లేని సమస్య టైటిల్ కోసమే. అదేంటో..ఈ సినిమాకు టైటిల్ అంత సులువుగా కుదరడం లేదు. దీనికి ప్రధాన కారణం తెలుగు తమిళ వెర్షన్ లకు ఒకే టైటిల్ కావాలని దర్శకుడు మురుగదాస్ పట్టుదలగా వుండడమే.
తెలుగు తమిళ పదాల్లో సమార్ధాలు కలిగినవి ఎన్ని వుంటాయి? దేవుళ్ల పేర్లే వాటిలో అధికంగా వుంటాయి. ఇక ఇక్కడ ఇంకో రూల్ కూడా వుంది. అలా వచ్చే పేరు లోకకళ్యాణం, విశ్వరక్షకుడు తదితర పరమార్థాలు సూచించేలా వుండాలి. వీలయితే శివుడి మీద రావాలి. తుపాకి సినిమాలో హీరో ఏ విధంగా అయితే సిటీ జనాలకు విధ్వంసం బారి నుంచి రక్షించి, రక్షకుడు అవుతాడో? ఇక్కడా అలాంటి వ్యవహారమే.
ఆఖరికి సంభవామి అన్న టైటిల్ ను ఫిక్స్ చేసారు. హీరో మహేష్ బాబు..సింపుల్ గా ' మీ ఇష్టం ' అనేసాడు. అక్కడే తెలుస్తొంది..బెటర్ టైటిల్ వుంటే బాగుంటుంది అన్న మీనింగ్. సరే ఎందుకయినా మంచిది అని రిజిస్టర్ చేయించేసారు. ఫ్యాన్స్ లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వెరైటీగా వుంది అంటూ కొంత మంది..కాస్తయినా క్యాచీగా, మాస్ టచ్ వుండాలని కొంతమంది. దీంతో ఇప్పుడు టైటిల్ కథ మళ్లీ మధ్యలో ఆగింది. వేట సాగుతోంది..కొత్త టైటిల్ దొరకిందా ఒకె. లేదూ అంటే సంభవామితో సరిపెట్టేసుకోవడమే.
ఎలాగూ టీజర్, ఫస్ట్ లుక్ ఇప్పట్లో వుండేలా లేవు. సినిమా విడుదల చాలా దూరంగా వుంది కాబట్టి, వీటిపై ఇప్పట్లో దృష్టి పెట్టేలా లేరు. అందువల్ల టైటిల్ ను ఆలోచించడానికి ఇంకా చాలా టైమ్ వుంది.