అవును.. అతను క్రికెట్‌ని జయించాడు.. అవును.. అతను క్యాన్సర్‌ని జయించాడు.. అవును.. అతను జీవితాన్ని జయించాడు. మైదానంలో అవలీలగా సిక్సర్లు బాదేటోడికి, అనూహ్యంగా బంతి గిరగిరా తిరుగుతూ వికెట్లను గిరాటేస్తుందని కూడా బాగా తెలుసు. అయితే, అది క్రికెట్‌లోనే కాదు, జీవితంలో కూడా సాధ్యమేనని యువరాజ్‌సింగ్‌కి అతి తక్కువ వయసులోనే అర్థమయ్యింది. క్యాన్సర్ రూపంలో, బంతి యువీని మానసికంగా పడగొట్టేసింది.
యువరాజ్‌సింగ్‌కి క్యాన్సరేంటి.? అని అంతా షాక్‌కి గురయ్యారు. తనకు క్యాన్సర్ అని యువీ ఎంత షాక్ అయ్యాడోగానీ, ఈ వార్త విన్న క్రికెట్ లోకం అంతకన్నా ఎక్కువగా షాక్ అయ్యింది.. మరీ ముఖ్యంగా యువీ కుటుంబం, యువీ అభిమానులూ ఆ షాక్ నుంచి తేరుకోడానికి చాలా టైమే పట్టింది. కానీ, మైదానంలో ఎలాంటి బంతినైనాసరే, బలంగా బాదగల యువీ, క్యాన్సర్‌ని కూడా అలాగే బాదాలని నిర్ణయించుకున్నాడు. ముందు కుంగిపోయినా, అది సమస్యకు పరిష్కారం చూపదని అర్థం చేసుకున్నాడు. మానసికంగా బలం పెంచుకుని, క్యాన్సర్‌తో పోరాడి విజయం సాధించాడు.
నిజానికి, యువరాజ్‌సింగ్ ఆ సమయంలో 'వరల్డ్ కప్ హీరో' అన్న గుర్తింపుతో ఉబ్బితబ్బిబ్బవుతున్న క్షణాలు. అంతలోనే, అతనికి క్యాన్సర్ సోకిన విషయం బయటపడింది. ఎలాగైతేనేం, జీవితంలో అత్యంత క్లిష్టతరమైన ఫేజ్.. అదీ క్యాన్సర్ చికిత్స పొందిన కాలాన్ని విజయవంతంగా దాటేశాడు యువీ. క్యాన్సర్‌ని జయించడంతో కొత్త జీవితాన్ని ప్రారంభించానంటాడు యువీ. అయితే, మునుపటిలా ఫామ్ ప్రదర్శించలేకపోవడంతో జట్టులో స్థానం సంపాదించుకోలేకపోవడం ఎప్పటికీ పెద్ద లోటు అని యువీ చెబుతుంటాడు.
నేడు యువీ 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అతనికి, సాటి క్రికెటర్లంతా శుభాకాంక్షలు చెబుతున్నారు. మైదానంలో యువీతో సందడి చేసిన రోజుల్ని సచిన్ లాంటి సీనియర్ల నుంచి, కోహ్లీ లాంటి యంగ్ స్టర్స్ కూడా గుర్తు చేసుకుంటున్నారు. నిజమే, మైదానంలో యువీ వుంటే ఆ సందడే వేరు. క్రికెట్ కెరీర్‌లోనూ చిన్న చిన్న వివాదాలున్నాసరే, యూవరాజ్‌సింగ్ అంటే, స్టార్ క్రికెటర్. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
ఇక, క్రికెట్‌లో గెలవడం పెద్ద విషయమేమీ కాదు, యువరాజ్‌సింగ్ జీవితంలో గెలిచాడు, జీవితాన్ని గెలిచాడు, క్యాన్సర్‌ని గెలిచాడంటూ.. ఆయన అభిమానులు, తమ అభిమాన క్రికెటర్ పుట్టినరోజు వేడుకల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటీవలే ప్రియురాలు హేజెల్ కీచ్‌ని పెళ్ళాడిన యువీకి, పెళ్ళయ్యాక ఇదే తొలి పుట్టినరోజు. హ్యాపీ బర్త్ డే టు యువరాజ్‌సింగ్.