సినిమా రివ్యూ: ధృవ

రివ్యూ: ధృవ రేటింగ్‌: 3/5 బ్యానర్‌: గీతా ఆర్ట్స్‌ తారాగణం: రామ్‌ చరణ్‌, అరవింద్‌ స్వామి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, పోసాని కృష్ణమురళి, నాజర్‌, నవదీప్‌, సయాజీ షిండే, రణధీర్‌ తదితరులు కథ: మోహన్‌ రాజా…

రివ్యూ: ధృవ
రేటింగ్‌: 3/5
బ్యానర్‌: గీతా ఆర్ట్స్‌
తారాగణం: రామ్‌ చరణ్‌, అరవింద్‌ స్వామి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, పోసాని కృష్ణమురళి, నాజర్‌, నవదీప్‌, సయాజీ షిండే, రణధీర్‌ తదితరులు
కథ: మోహన్‌ రాజా
మాటలు: వేమారెడ్డి
సంగీతం: హిప్‌హాప్‌ తమిళ
కూర్పు: నవీన్‌ నూలి
ఛాయాగ్రహణం: పి.ఎస్‌. వినోద్‌
నిర్మాతలు: అల్లు అరవింద్‌, ఎన్‌.వి. ప్రసాద్‌
కథనం, దర్శకత్వం: సురేందర్‌ రెడ్డి
విడుదల తేదీ: డిసెంబరు 9, 2016

రామ్‌ చరణ్‌లా మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ వున్న హీరోకి, హీరో సెంట్రిక్‌ సినిమాలు చేయడానికి అలవాటు పడ్డ నటుడికి 'తని ఒరువన్‌'లాంటి కథని ఎంచుకోవడం రిస్కే. ఎందుకంటే ఇందులో హీరో నేల విడిచి సాము చేయడు. ఎప్పుడూ తన శత్రువు కంటే రెండడుగులు ముందు వుండడు. ఇన్‌ఫాక్ట్‌ విలన్‌ జిత్తుల ముందు హీరో పలుమార్లు చిత్తు అవుతుంటాడు. సాధారణంగా ఇలాంటి కథల్లో ఒక పెద్ద స్టార్‌ని మాస్‌ ప్రేక్షకులు యాక్సెప్ట్‌ చేస్తారో లేదోననే అనుమానాలు తలెత్తుతాయి. వీరాభిమానులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారోననే సందేహాలు మదిని తొలిచేస్తాయి. 

ఎంతగా కథ నచ్చినా కానీ పైన చెప్పుకున్న భయాలకి, అనుమానాలకి అనుగుణంగా కథని మార్చేసి హీరోకి పైచేయి ఇవ్వాలనే ఐడియాలు రావచ్చు. కానీ చరణ్‌ 'తని ఒరువన్‌' కథని టాంపర్‌ చేయడానికి ట్రై చేయలేదు. ధృవ క్యారెక్టర్‌లోకి తనని తాను మౌల్డ్‌ చేసుకోవడానికే తపించాడు తప్ప ఎక్కడా తన స్టార్‌డమ్‌ ఈ స్టోరీకి అవరోధం కాకుండా చూసుకున్నాడు. దర్శకుడు సురేందర్‌ రెడ్డి కూడా చిన్న చిన్న మార్పు చేర్పులు మినహా ఒరిజినల్‌ని మార్చే ప్రయత్నం చేయలేదు. అయితే ఈ క్రమంలో ఒరిజినల్‌లోని బలాలతో పాటు బలహీనతల్ని కూడా యథాతథంగా ఉంచేశారు! 'తని ఒరువన్‌' మంచి సినిమా అనడంలో సందేహం లేదు, కాకపోతే అదేమీ పర్‌ఫెక్ట్‌ సినిమా కాదు. దాంట్లో చాలానే వీక్‌ లింక్స్‌ వున్నాయి. బహుశా సురేందర్‌ అండ్‌ టీమ్‌ వాటిని సరిదిద్ది 'ధృవ'ని ఒరిజినల్‌ కంటే పర్‌ఫెక్ట్‌గా తీర్చిదిద్ది వుండాల్సిందేమో. రీమేక్‌ సినిమాల విషయంలో ఎక్కువ మార్పులు చేయడానికి సాహసించరు కానీ అవకాశం వున్నప్పుడు మార్చుకోవడానికి వెనకాడకూడదు. ఉదాహరణకి 'దబంగ్‌'ని పవన్‌ తెలుగులోకి రీమేక్‌ చేస్తున్నాడంటే 'ఎందుకొచ్చిన తంటా' అనుకున్నారు. కానీ హరీష్‌ శంకర్‌ చేసిన 'మార్పులు' దానిని ఒరిజినల్‌ కంటే బెటర్‌ ఎంటర్‌టైనర్‌గా నిలబెట్టాయి.

'తని ఒరువన్‌'లో విలన్‌ క్యారెక్టర్‌ని పిల్లాడిగా పరిచయం చేసిన తర్వాత హీరో ఇంట్రడక్షన్‌ నుంచి అతని లవ్‌ ఎపిసోడ్‌ వరకు జరిగేదంతా చాలా వీక్‌గా ఉంటుంది. అరవింద్‌ స్వామి కథలోకి ఎంటర్‌ అయిన తర్వాత కానీ కథనం జోరందుకోదు. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల ట్రాక్‌ చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. ధృవ టీమ్‌ ఈ పార్ట్‌లో కొన్ని సీన్స్‌ డిఫరెంట్‌గా రాసుకున్నా కానీ ఓవరాల్‌ కంటెంట్‌ అలానే ఉంచేయడం వల్ల కథ రసకందాయంలో పడడానికి సమయం తీసుకుంటుంది. చెయిన్‌ స్నాచింగ్‌ సీన్‌ నుంచి స్క్రీన్‌ప్లేలో చలనం వస్తుంది. సిద్ధార్థ్‌ అభిమన్యు (అరవింద్‌స్వామి) తలపెట్టిన ఒక పెద్ద స్కామ్‌ని భగ్నం చేయడానికి ధృవ (చరణ్‌) వేసే ప్లాన్‌ నుంచి సినిమా స్వరూపమే మారిపోతుంది. అంతవరకు నత్త నడకన నడిచిన సినిమా కాస్తా ఒక్కసారిగా పరుగందుకుంటుంది. ఇంటర్వెల్‌ సీన్‌తోనే విలన్‌ ఎంత పవర్‌ఫుల్‌ అనేది ఎస్టాబ్లిష్‌ అయిపోతుంది. అతడిని దెబ్బ తీయడం అంత తేలిక కాదనే పాయింట్‌తో సెకండ్‌ హాఫ్‌పై ఎక్సయిట్‌మెంట్‌ పెరుగుతుంది. అందుకు ఏమాత్రం తగ్గని తెలివైన కథనంతో ద్వితీయార్ధం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. సుదీర్ఘంగా సాగే ద్వితీయార్ధంలో రెండు చిన్న పాటలు మినహా మరి ఏ విధమైన డీవియేషన్‌ ఉండదు. కామెడీ కోసం ప్రత్యేకమైన ట్రాక్స్‌ కూడా ఉండవు. పూర్తిగా హీరో, విలన్‌ మధ్య మైండ్‌ గేమ్స్‌తోనే సాగుతున్నా ఎక్కడా బోర్‌ కొట్టదంటే కంటెంట్‌ ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉండి వుంటుందనేది ఊహించుకోండిక. 

హీరో, విలన్‌ మధ్య నడిచే కథ అయినా ఇద్దరూ పతాక సన్నివేశాల వరకు ఎదురు పడరు. కానీ వారిద్దరి మధ్య టగ్‌ ఆఫ్‌ వార్‌ మాత్రం ఎప్పుడూ నడుస్తూనే వుంటుంది. అదే ఈ చిత్ర కథనంలోని ప్రత్యేకత. అదే దీనిని మిగతా సినిమాల మధ్య ప్రత్యేకంగా నిలబెడుతుంది. తన స్టార్‌డమ్‌పై దృష్టి పెట్టకుండా పాత్రకి అనుగుణంగా కనిపించిన రామ్‌ చరణ్‌ తన పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. ధృఢమైన శరీరంతో, టఫ్‌ బాడీ లాంగ్వేజ్‌తో పోలీస్‌ పాత్రలో చక్కగా ఇమిడిపోయాడు. స్నేహితుడు చనిపోయే సన్నివేశాల్లో, ప్రేయసికి ప్రాణాపాయం వుందని తన మనసులోని ఫీలింగ్స్‌ బయట పెట్టలేని సందర్భంలో చరణ్‌ అభినయం ఆకట్టుకుంటుంది. మూస సినిమాల్లో పడి తనలోని నటుడికి ఇన్నాళ్లు సానబెట్టని చరణ్‌ ఈ మేక్‌ ఓవర్‌తో ఇకపై హంగుల కంటే కథలకే ప్రాధాన్యతనిస్తాడనే అనుకుందాం. 

ఒరిజినల్‌కి మెయిన్‌ హైలైట్‌ అయిన అరవింద్‌ స్వామి మరోసారి అదే పాత్రని అంతే అద్భుతంగా అభినయించి 'ధృవ'కి పిల్లర్‌గా నిలిచాడు. ఎప్పటికీ గుర్తుండిపోయే విలన్‌ పాత్రల్లో సిద్ధార్థ్‌ అభిమన్యుకి పర్మినెంట్‌ స్థానం కల్పించాడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటన పరంగా మెప్పించలేకున్నా గ్లామర్‌తో ఉనికి చాటుకుంది. మిగిలిన వారిలో నవదీప్‌, పోసానికి మంచి పాత్రలు దక్కాయి. నేపథ్య సంగీతం చక్కగా కుదిరింది. డ్రామాని ఎలివేట్‌ చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఛాయాగ్రహణం టాప్‌ క్లాస్‌ అనిపిస్తుంది. విజువల్స్‌ చాలా బాగున్నాయి. స్ల్పిట్‌ స్క్రీన్‌ టెక్నిక్‌తో ఎడిటింగ్‌ చిత్రానికి మరింత స్టయిల్‌ జోడించింది. నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడలేదు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ వేల్యూకి తగ్గట్టే ప్రతి ఫ్రేమ్‌ చాలా రిచ్‌గా వుంది. 

సురేందర్‌ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని హ్యాండిల్‌ చేసాడు. తన మార్కు స్టయిలిష్‌ టచెస్‌ క్లియర్‌గా తెలుస్తుంటాయి. గోల్కొండ సీన్‌, చివర్లో ఎనిమిది అంకె వెనుక ఉన్న ముడి విప్పే సీన్‌ లాంటివి ఈ రీమేక్‌లో సురేందర్‌ ముద్రని తెలియజేస్తాయి. తని ఒరువన్‌తో పోలిస్తే ఈ చిత్రం స్టయిలిష్‌గా, స్లిక్‌గా అనిపిస్తుందంటే దానికి కారణం సురేందర్‌ రెడ్డి. 

రొటీన్‌ కామెడీ-సాంగ్‌-ఫైట్‌-కామెడీ సీన్‌ తరహా స్క్రీన్‌ప్లేకి అలవాటు పడి అదే రకం పాప్‌కార్న్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆశిస్తే 'ధృవ' మింగుడు పడకపోవచ్చు. సరికొత్త చరణ్‌ని చూడాలనుకునే వారికి, కొత్తరకం కమర్షియల్‌ వినోదాన్ని ఆశించే వారికి 'ధృవ' పూర్తి సంతృప్తినిస్తుంది. 

బాటమ్‌ లైన్‌: కట్టిపడేసే మైండ్‌ గేమ్స్‌!

– గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri