ఎమ్బీయస్‌: ఐర్లండ్‌లో గర్భస్రావ హక్కులకై ఉద్యమం

ఐర్లండ్‌ ప్రధానంగా కాథలిక్‌ దేశం. కాథలిక్కులు గర్భస్రావాన్ని నేరంగా పరిగణిస్తారు. అందువలన ఐర్లండ్‌ తన రాజ్యాంగంలో అబార్షన్‌ను పెద్ద నేరంగా పరిగణించింది. అయితే దానికి ఒక కలరింగ్‌ యిచ్చింది. సమాజంలో వున్న వ్యక్తికి వుండే…

ఐర్లండ్‌ ప్రధానంగా కాథలిక్‌ దేశం. కాథలిక్కులు గర్భస్రావాన్ని నేరంగా పరిగణిస్తారు. అందువలన ఐర్లండ్‌ తన రాజ్యాంగంలో అబార్షన్‌ను పెద్ద నేరంగా పరిగణించింది. అయితే దానికి ఒక కలరింగ్‌ యిచ్చింది. సమాజంలో వున్న వ్యక్తికి వుండే జీవించే హక్కు గర్భంలో వున్న శిశువుకు కూడా వుంటుందని, దాన్ని హరించే హక్కు ఎవరికీ లేదని 8వ సవరణ చేసింది. దాన్ని 30 ఏళ్ల క్రితం ఓటింగుకి పెట్టినపుడు పౌరుల్లో అధిక సంఖ్యాకులు బలపరిచారు. తల్లికి ప్రాణాపాయం వుందని తెలిస్తే తప్ప, గర్భస్థ శిశువు రోగగ్రస్తుడని తెలిసినా గర్భస్రావం చేయకూడదని చట్టం. పాతతరం వారు ఆ చట్టాన్ని ఆమోదించినా యీనాటి యువత దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తోంది. నవంబరులో 99 మంది ఐర్లండ్‌ నలుమూలల నుండి యువతీయువకులు రాజధాని డబ్లిన్‌ చేరి ప్రదర్శన నిర్వహించారు. 2017 నాటికి ఉద్యమాన్ని తీవ్రం చేయాలని సంకల్పిస్తున్నారు. వారిని యీ చర్యకు పురికొల్పిన సంఘటనలు రెండు వున్నాయి. 

2011 నవంబరులో అమందా మెలెట్‌ అనే ఒక గర్భిణికి తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు జన్యుసంబంధమైన వ్యాధి వుందని, గర్భంలోనో, పుట్టిన వెంటనేనో చనిపోతుందని తెలిసింది. అప్పటికే గర్భం వచ్చి 21 వారాలైంది. అబార్షన్‌ చేయించుకోవాలంటే ఐర్లండ్‌ చట్టాల ప్రకారం అది నేరం. అప్పుడామె  ఇంగ్లండు వెళ్లింది. 24 వారాల లోపున అబార్షన్‌ చేయించుకోవడం అక్కడ చట్టబద్ధమే. ఈమె ప్రయాణపు ఏర్పాట్లు చేసుకునేసరికి ఆ గడువు సరిగ్గా ముగుస్తోంది. గడువు తర్వాత ఇంగ్లండు వుండేటంత డబ్బు ఆమె వద్ద లేదు. దాంతో గర్భస్రావమైన 12 గంటల్లోనే ఆమె ఐర్లండ్‌కు తిరిగి రావలసి వచ్చింది. 

2012లో ఐర్లండ్‌లో నివసిస్తూన్న భారతీయ సంతతికి ఉద్యోగస్తురాలు సవితా హలప్పనవార్‌ 17 వారాల గర్భంతో వుండగా ఆమెకు రక్తస్రావం జరిగింది. ఆసుపత్రిలో చేర్చారు. గర్భం ఎలాగూ నిలవదు కాబట్టి అబార్షన్‌ చేసేయండి అని ఆమె బతిమాలింది. 'లేదు, శిశువు గుండె కొట్టుకుంటోంది, అబార్షన్‌ చేస్తే నేరమౌతుంది' అని వైద్యులు నిరాకరించారు. రక్తస్రావం తీవ్రంగా జరిగి ఆమె ఆరోగ్యం పాడై పోయింది. కాంప్లికేషన్స్‌ వచ్చి రక్తం కలుషితమై పోయి, శరీరం సెప్టిక్‌ అయి ఐసియులో వుండగానే ఆమె చనిపోయింది. అబార్షన్‌ చేసేసి వుంటే ఆమె బతికి వుండేదని వైద్యనిపుణులు అభిప్రాయపడ్డారు. 

ఈ సంఘటనలు తమ దృష్టికి రావడంతో యునైటెడ్‌ నేషన్స్‌ హ్యూమన్‌ రైట్స్‌  చర్చించింది. తమ అబార్షన్‌ చట్టాన్ని మార్చుకోమని ఈ ఏడాది జూన్‌లో ఐర్లండ్‌కు సలహా యిచ్చింది. కానీ ఐర్లండ్‌ ప్రభుత్వం దానికి సిద్ధపడలేదు. అందుకే యిప్పుడు వీరు ఉద్యమిస్తున్నారు. నిజానికి వారు చాలా రాడికల్‌గా ఆలోచిస్తున్నారు. ప్రపంచంలో మగ-మగ, ఆడ-ఆడ వివాహాలని ఆమోదించిన తొలిదేశంగా ఐర్లండ్‌ 2015లో పేరు తెచ్చుకోవడానికి కారణం వీరి పట్టుదలే. చర్చి ఎంత వ్యతిరేకించినా వారు పోరాడి గెలిచారు. ఇప్పుడు అబార్షన్‌కు అనుమతి సాధనే లక్ష్యంగా ఉద్యమిస్తున్నారు. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2016)

[email protected]