త్రివిక్రమ్.. ఈ సారి ఎక్కడ దోపిడీ చేస్తాడో!

లోకల్ మేడా? హాలీవుడ్ నీడనా? ఈ సారి త్రివిక్రమ్ ఏం చేయబోతున్నాడా? తన తాజా సినిమాకు కథను, సీన్లను ఎక్కడ నుంచి అరువు తెచ్చుకోబోతున్నాడు? అరువు అనొచ్చా? లేక దోపిడీ అనేయాలా! ఇప్పటి వరకూ…

లోకల్ మేడా? హాలీవుడ్ నీడనా? ఈ సారి త్రివిక్రమ్ ఏం చేయబోతున్నాడా? తన తాజా సినిమాకు కథను, సీన్లను ఎక్కడ నుంచి అరువు తెచ్చుకోబోతున్నాడు? అరువు అనొచ్చా? లేక దోపిడీ అనేయాలా! ఇప్పటి వరకూ సాగించిన కాండను గమనిస్తే.. తన దేవుడు పవన్ కల్యాణ్ ను హీరోగా పెట్టి త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోయే కొత్త సినిమాకు కథను ఎక్కడ నుంచి తెస్తాడు? అనేది అనుమానాలు, సందేహాలతో కూడుకున్న అంశం. మాటలైతే త్రివిక్రమ్ మస్తిష్కంలో మెదులుతాయేమో కానీ.. కథలు, సీన్ల విషయంలో త్రివిక్రమ్ కు అంబ పలకదని వేరు చెప్పనక్కర్లా. ఇంత వరకూ ఈ దర్శకుడు సాగించిన ప్రస్థానమే అందుకు సాక్షి! ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ నుంచి త్వరలో రాబోయే సినిమాకు మూలాలు ఎక్కడ ఉంటాయో అనేది ఆసక్తికరంగా ఉంది. 

 నిస్సందేహంగా త్రివిక్రమ్ తెలుగు ఇండస్ట్రీకి దక్కిన పరాక్రమవంతమైన రచయిత. ట్రెండ్ సెట్టర్. తెలుగు సినిమాకు కొత్త నడక నేర్పిన వ్యక్తి. అయితే.. ఆ నడకలో విదేశీ సినిమా ను కాపీ కొట్టడం అనేక సార్లు బట్టబయలవుతూనే ఉంది. రచయితగా త్రివిక్రమ్ పెన్ను పదును చాటిన సినిమా ‘చిరునవ్వుతో..’లో మూలాలు ప్రఖ్యాత ఫ్రెంచ్ సినిమా ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ లో ఉన్నాయి. నాజీల హయాంలో ఒక యూధుడు పడిన అష్టకష్టాలను క్లైమాక్స్ వరకూ మనసును కదిలించే విధంగా చూపించిన ఆ సినిమా నుంచి హృద్యమైన సీన్లన్నింటినీ కాపీ కొట్టారు త్రివిక్రమ్.
ఆ ఫ్రెంచ్ సినిమా ప్రభావం త్రివిక్రమ్ పై ఎంతో ఉంది. చిరునవ్వుతో సినిమాలో హీరోహీరోయిన్ల మధ్యన వచ్చే ప్రణయ సన్నివేశాలు అన్నీ ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ నుంచి తెచ్చుకున్నవే. మూల కథను పక్కన పెడితే.. మిగతా నడకంతా ఫ్రెంచ్ సినిమా నుంచి కాపీ కొట్టిందే. అదంతా త్రివిక్రమ్ ఓన్ క్రియేటివిటీ కాదు.. కాపీ కొట్టడంలోనే త్రివిక్రమ్ క్రియేటివిటీ అంతా!

ఇక ‘నువ్వునాకు నచ్చావ్’ కామెడీ త్రివిక్రమ్ విరచిత కల్ట్ హిట్. ఈ సినిమాలోని సీన్లకు కూడా కొన్ని ఆంగ్ల సినీ మూలాలున్నాయి. ప్రత్యేకించి డైనింగ్ టేబుల్ సీన్, అక్కడ కవిత-ప్రార్థనతో జరిగే కామెడీ అంతా ఒక హాలీవుడ్ సినిమాలో ఉంటుంది.

ఇక దర్శకుడిగా మారి ‘నువ్వే నువ్వే’ ను రూపొందించిన త్రివిక్రమ్ చిత్రీకరణలో కూడా కాపీ కొట్టడం ప్రారంభించాడు. ఆ కాపీ ఫ్రేమ్ లు ఏవేవో ఇంటర్నెట్ యుగంలో బయటపడిపోయాయిప్పటికే.  ‘మన్మథుడు’ మూవీకి ఒక హాలీవుడ్ సినిమా మూలం.

ఇక ‘రోమన్ హాలిడే’ అనే ఒక ప్రసిద్ధ పాత సినిమాకు కాపీ గా రూపొందించిన ‘మల్లీశ్వరి’ కోసం సవాలక్ష హాలీవుడ్ సినిమాల నుంచి సీన్లను చోరీ చేశారు. ‘అతడు’ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ‘వారసుడొచ్చాడు..’ అనే వెంకటేష్ పాత సినిమాలో ఉంటుంది. ఇక ‘అతడు’ కు సంబంధించి కొన్ని సన్నివేశాలు విదేశీ సినిమాల్లోంచి తెచ్చుకున్నవే.

దర్శకుడిగా త్రివిక్రమ్ ఆకలి తీర్చిన ‘జులాయి’ లో బ్యాంకు రాబరీ సీన్ ను ఒక ప్రసిద్ధ హాలీవుడ్ సినిమా నుంచే నిర్మొహమాటంగా కాపీ కొట్టేశారు. అది ఫేమస్ సినిమా.. ఎక్కువమంది చూస్తారు.. నవ్వుతారు అనే భయం భక్తీ లేకుండా జరిగిన కాపీ అది!

అత్తారింటికి దారేదీ.. క్లైమాక్స్ మరో తెలుగు సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ అనే విషయాన్ని కొట్టి పారేయలేం. బ్రహ్మానందం కామెడీని విల్ స్మిత్ సినిమా ఒక దాని నుంచి కాపీ కొట్టారు. ఇక సన్నాఫ్ సత్యమూర్తి విషయానికి వస్తే.. ఈ సినిమాలోనూ ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ నుంచి సంగ్రహించిన కొన్ని పాయింట్లున్నాయి.

ఇవన్నీ కాదు.. ఎన్నాళ్లని విదేశీ సినిమాలను ఆధారంగా చేసుకుని బండి లాగించేది? అనుకున్నారో ఏమో కానీ, ‘అ..ఆ’ తో లోకల్ మేడ్ యద్ధనపూడి సులోచనరాణి నవలను వాడేశారు. వాడటం తప్పుకాకపోవచ్చు.. కానీ తొలి వారం రోజులూ.. మూల కథ క్రెడిట్ ను యద్ధనపూడికి ఇవ్వకపోవడం, ఈ వ్యవహారం పై రచ్చ జరిగిన తర్వాత ఆమె పేరును క్రెడిట్స్ లో ఇవ్వడం అంత అభినందించదగిన అంశం కాదు కదా!

నిజం చెప్పాలంటే ‘మీనా’ నవలకు త్రివిక్రమ్ ఇచ్చిన ట్రీట్ మెంట్ ఈ ట్రెండ్ కు తగినట్టుగా ఉంటుందేమో కానీ.. ఆ నవలలోని అద్భుతమైన ఫీల్ ను ఆస్వాధించాలంటే ఒకటి ‘మీనా’ నవలను చదవాలి, లేదా విజయనిర్మల దశాబ్దాల కిందట తీసిన ‘మీనా’ సినిమాను చూడాలి. ఆ రెండూ చేసిన తర్వాత ‘మీనా’ కు త్రివిక్రమ్ ఇచ్చిన ట్రీట్ మెంట్ చాలా వరకూ చిన్నబోతుంది! ‘అ..ఆ’ సినిమా హిట్ అయ్యుండొచ్చు.. డబ్బులు వచ్చి ఉండవచ్చు.. ఆ లెక్కలు వేరు. 

‘మీనా’ మూల కథను యథాతథంగా వాడుకొంటూ.. అర్థం లేని కథనంలో ‘అ..ఆ’ ను నడిపించారు. నవలను చదువుతున్నా, పాత ‘మీనా’ సినిమాను చూస్తున్నా.. ఉండే ఫీల్ త్రివిక్రమ్ సినిమాలో నిస్సందేహంగా ఉండదు. కొన్ని పాత్రల సారూప్యాలు మార్చినా.. త్రివిక్రమ్ సినిమాకూ ‘మీనా’ నవలకూ నక్కకూ నాకలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. 

మరి హాలీవుడ్ సినిమాలను అనుకరించడం అయ్యింది, లోకల్ మేడ్ నవలనూ టచ్ చేయడం అయ్యింది? త్రివిక్రమ్ ఇప్పుడేం చేయబోతున్నాడు? అనేది ఆసక్తికరమైన అంశం. ఏం ప్రతిసారీ త్రివిక్రమ్ కాపీనే కొడతాడా? ఆయనను తక్కువ అంచనా వేస్తారా? అనొచ్చు.. కానీ, ఇప్పటి వరకూ కొనసాగిన సంప్రదాయాన్ని బట్టి చూస్తే మాత్రం.. సందేహించడం, ఎక్కడ నుంచి దోపిడీ జరగబోతోంది? అనే అంశాన్ని ప్రస్తావించడం మరీ తప్పేం కాదు!

అయినా.. అలా కాపీ కొట్టడం, సీన్లకు సీన్లను లేపేయడం, ఒరిజినల్ ను రాసిన వారికి క్రెడిట్ ఇవ్వకుండా.. అంతా తమ క్రియేటివిటీనే అనేసుకోవడం త్రివిక్రమ్ దృష్టిలో కానీ, ఇతర తెలుగు మూవీ మేకర్ల దృష్టిలో కానీ పెద్ద తప్పేం కాదు! తోటకూర నాడే.. అన్నట్టుగా, తొలి తొలి రోజుల్లో కాపీలు కొట్టినప్పుడే వీరి తీరును విశ్లేషకులు తప్పుపట్టారు. విమర్శించారు. అయితే.. త్రివిక్రమ్ కానీ, ఇతర తెలుగు మూవీ మేకర్లు కానీ ఆ తీరును మార్చుకోలేదు.
అలాగే కొనసాగిస్తున్నారు. ఇంటర్నెట్ విస్తృతం అయిపోయిన రోజుల్లో కూడా వీళ్లు ఇంకా సీడీలు చూస్తే  సీన్లను రాసుకొంటూనే ఉన్నారు. ఆఖరికి నిన్నా మొన్న  కెరీర్ మొదలు పెట్టిన దర్శకులు కూడా తాము కాపీ కొడితే.. ఒరిజినల్ ఏమిటో ముందే చెప్పేస్తున్నారు. తాము ఏ సీన్ ను ఏ సినిమా నుంచి కాపీ కొట్టామో వారు చెప్పేస్తున్నారు. ఇండస్ట్రీలో ఇంకా నిలదొక్కుకుంటున్న స్థితిలో ఉన్నా వారిలో ఆ హుందాతనం ఉంది. అయితే త్రివిక్రమ్ లో ఇప్పటి వరకూ అది కనిపించడం లేదు!

ఎంతో మందికి ఆరాధ్యనీయమైన, రచయితకు మించి ఫిలాసఫర్ అనిపించుకుంటున్న స్థాయికి వెళ్లిన ఈ రచయిత నుంచి ఆ మాత్రం హుందా తనాన్ని ఆశించడం  తప్పేం కాదు. తను చదివిన గొప్ప సాహిత్యం నుంచి కథలను కాపీ కొడతాడా.. లేక తను చూసిన గొప్ప సినిమాల నుంచి సీన్లను తెస్తాడా? అనే సంగతి తర్వాత.. ఎక్కడి నుంచి తెచ్చినా,  ఏం చేసినా.. వాటి అసలు యజమానులను  ఒక్కసారి ప్రస్తావిస్తే.. త్రివిక్రమ్ తన స్థాయిని మరో మెట్టు ఎక్కించినట్టే అవుతుంది. అలా కాదు.. కాపీ కొడతాం, క్రెడిట్ ఇవ్వం, ఆ తర్వాత మొహం చాటేస్తాం.. అంటే దానికీ ఎవరూ ఏం చేయలేరు! ‘విలువలే ఆస్తి’ అంటూ సినిమాకు క్యాప్షన్లు పెడుతూ.. వాటికి న్యాయం చేయలేకపోతే రచయితగా ఏమో కానీ మరోరకంగా మాత్రం ఫెయిలయినట్టే!