పెళ్లి పేరుతో నమ్మించి, సహజీవనం చేసి, అనంతరం మోసగించాడని సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడిపై నటి శ్రీసుధ గత కొన్ని నెలలుగా చేస్తున్న పోరాటం…. ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఫోర్జరీ డాక్యుమెంట్స్‌తో బెయిల్ పొందాడని, దాన్ని రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో శ్రీసుధ కేసు వేసింది. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం నెలరోజుల్లో సమాధానం ఇవ్వాలని శ్యామ్ కె.నాయుడికి తాజాగా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
శ్యామ్ కే నాయుడిపై సినీనటి శ్రీసుధ గతంలో హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదేళ్లు సహజీవనం చేసిన అనంతరం శ్యామ్ కే నాయుడు తనను మోసం చేశాడని శ్రీసుధ ఎస్సార్ నగర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. అనంతరం శ్యామ్ కె.నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతరం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజీ అయ్యినట్టు నకిలీ డాక్యుమెంట్లు, చెక్కులు , డీడీలు రూపంలో 50 లక్షలు ఇచ్చినట్లు శ్యామ్ కె నాయుడు కోర్టుకు సమర్పించాడు. డాక్యుమెంట్లు చూసి శ్యామ్ కె నాయుడుకి నాంపల్లి సెషన్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీసుధ తాను అసలు రాజీ పడలేదని, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి న్యాయస్థానాన్ని పక్కదారి పట్టించాడని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో శ్యామ్ కె నాయుడుకి బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో శ్రీసుధ పిటిషన్ వేశారు. తనను ఇటీవల చంపేందుకు కుట్ర చేసి, విజయవాడలో కారు ఆక్సిడెంట్ చేశారంటూ సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి ఆమె తీసుకెళ్లారు. అలాగే ఈ కేసులో శ్యామ్ కె నాయుడుతో పాటు ఆయన సోదరుడు చోటకే నాయుడు కూడా బెదిరింపులకు దిగుతున్నట్లు శ్రీసుధ ఆరోపించారు.
పిటిషన్‌లోని అంశాలను పరిశీలించిన న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వానికి , శ్యామ్ కె నాయుడుకు నోటీసులు జారీ చేసింది. నెలరోజుల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో మరోసారి శ్యామ్ కె.నాయుడు, శ్రీసుధ సహజీవనం, మనస్పర్థల గురించి టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.