తెలంగాణలో ఘట్‌కేసర్ ఘటనలో బీఫార్మసీ విద్యార్థిని కట్టు కథను మరిచిపోకనే, అలాంటిదే మరో కథ ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఈ ఘటనలో డిగ్రీ విద్యార్థిని కట్టుకథ సూత్రధారి కావడం గమనార్హం. రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లో కాళ్లు, చేతులను చున్నీతో కట్టేసి, అపస్మారక స్థితిలో పడి ఉన్న ఓ విద్యార్థిని పడి ఉండడాన్ని రెండు రోజుల క్రితం పోలీసుల గుర్తించారు. అయితే చున్నీతో కట్టేయడం అంతా ‘కట్టు’ కథనే అని పోలీసులు తేల్చేశారు.
విజయనగరం జిల్లాలో గుర్ల వద్ద ఓ డిగ్రీ విద్యార్థిని కాళ్లు, చేతులు కట్టేసి తుప్పల్లో పడేసి ఉండడంపై మూడు రోజుల క్రితం కేసు నమోదైంది. ఈ కేసు మిస్టరీని ఛేదించేందుకు విజయనగరం ఎస్పీ రాజకుమారి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. ఈ టీంలో విజయనగరం డీఎస్పీ పి.అనిల్ కుమార్, దిశ మహిళా పీఎస్ డీఎస్పీ టి. త్రినాథ్, విజయనగరం రూరల్ సీఐ ఎస్.మంగ వేణి, గుర్ల ఎస్ఐ నీలావతి, విజయనగరం రూరల్ ఎస్ఐ పి.నారాయణరావు ఉన్నారు.
విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. తన కుటుంబసభ్యులను నమ్మించేందుకు ఆ విద్యార్థిని ‘కట్టు’కథ అల్లినట్లు తేలింది. స్నేహితులతో బయటకు వెళ్లినట్లు ఇంట్లో తెలిసిపోతుందనే భయంతో విద్యార్థిని నాటకానికి తెరదీసింది. అసలు ఏం జరిగిందో పోలీసులకు కళ్లకు కట్టినట్టు విద్యార్థిని చెప్పడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. విచారణలో తేలిన వాస్తవాలను ఎస్పీ రాజకుమారి ఓ ప్రకటనలో మీడియాకు తెలిపారు.
గత నెల 27న బాబాయ్ దగ్గరకు వెళ్తానని చెప్పి డిగ్రీ విద్యార్థిని హాస్టల్‌లో పర్మిషన్ తీసుకుంది. అనంతరం తన స్నేహితుడిని కలిసేందుకు విద్యార్థిని బయటకు వెళ్లింది. ఇదే సమయంలో ఆమె సోదరుడు తన గురించి హాస్టల్‌లో వాకబు చేసినట్లు తెలుసు కుంది. దీన్ని ఎలాగైనా కప్పిపెట్టాలని సీరియస్‌గా ఆలోచించింది.
స్నేహితుడిని కలిసిన తర్వాత పాలకొల్లు నుంచి పాలకొండ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కింది. గుర్ల దాటిన తర్వాత బస్సు దిగిన యువతి.. రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లోకి వెళ్లింది. తనకు తానుగా కాళ్లు, చేతులను చున్నీతో కట్టుకుని అపస్మా రక స్థితిలో పడి ఉన్నట్లుగా నటించింది. చివరికి విచారణలో అంతా నాటకమని విద్యార్థిని అంగీకరించింది. 48 గంటల్లో కేసు మిస్టరీని ఛేదించిన విచారణ బృందాన్ని ఎస్పీ అభినందించారు.