సినిమా సినిమాకు మాంచి గెటప్ సెట్ చేసుకోవడం హీరో నాగార్జునకు అలవాటు.మరి ఇప్పుడు చేయబోయే హర్రర్ థ్రిల్లర్ కు ఏ గెటప్? అదే అడిగారు మీడియా జనాలు ఓపెనింగ్ సందర్భంగా జరిగిన మీట్ లో. దానికి నాగ్ సమాధానం ఇస్తూ, నమో వెంకటేశాయ గెటప్ అయిపోయింది. ఇప్పుడు కుర్రాళ్లంతా గెడ్డాలతో కనిపిస్తున్నారు. నేనేం చేయాలో ఇంకా అనుకోలేదు. డైరక్టర్ ఓంకార్ మాత్రం ఓ గెటప్ స్కెచ్ చేయించి వుంచారు అని అన్నాడు.
అయితే విషయం ఏమిటంటే, ఓంకార్-నాగ్-పివిపి చేస్తున్న ఈ సినిమాకు మాతృక మలయాళీ సినిమా. అందులో నాగ్ వేస్తున్న పాత్ర కాస్త డిఫరెంట్ గా వుంటుంది. ఫ్రెచ్ కట్ లాంటి గెడ్డం, పైన నున్నటి గుండు అన్నమాట. ఒక విధంగా శివాజీలో రజనీ గుండు గెటప్ లాంటిదన్నమాట. మరి నాగ్ ధైర్యం చేసి, తను కూడా ఇలా గుండుతో కనిపిస్తాడా? లేదా మరేదైనా డిఫరెంట్ గా ట్రయ్ చేస్తాడా? అన్నది చూడాలి.