సుకుమార్-మైత్రీ కాంబినేషన్ లో రామ్ చరణ్ సినిమా పట్టాలు ఎక్కాల్సి వుంది. కాస్త లేటయినా స్టార్ట్ అవడం ఖాయం. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ లోనే బోలెడు మల్లగుల్లాలు జరిగిపోతున్నాయని, జరిగాయని తెలుస్తోంది. టెక్నీషియన్ల సెలక్షన్ లో సుకుమార్ ఛాయిస్ ను పూర్తిగా పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్ పేరు చెప్పి, ఆయన మనుషులు వాళ్లే కావాలి, చరణ్ బాబు వాళ్లనే పెట్టమన్నారు అంటూ డైరక్టర్ సుకుమార్ ను డైరక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సుకుమార్ కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్లు వినికిడి. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు అంటే సుకుమార్ మనిషే. కానీ ఈ సినిమాకు కాస్త చేంజ్ చేద్దామని సుకుమార్ అనుకున్నట్లు తెలుస్తోంది.
మరి ఇంతలో ఏం జరిగిందో చరణ్ బాబు చెప్పమన్నారు, రత్నవేలునే తీసుకోమన్నారు అని సుకుమార్ చెవిన వేసారట. అలాగే నాన్నకు ప్రేమతో చేసిన ఆర్ట్ డైరక్టర్ రవీందర్ ను తీసుకోవాలని సుకుమార్ ఫిక్స్ అయ్యారు. నిర్మాతలు తమకు ప్రకాష్ కావాలని అడిగినా, లేదు రవీందర్ నే కావాలని సుకుమార్ ఒప్పించారు.
కానీ వన్ ఫైన్ మార్నింగ్ మళ్లీ చరణ్ జనాలు వచ్చి, బాబు ఈ సినిమాకు తోట తరణిని తీసుకోమంటున్నారు అన్నారట. దాంతో సుకుమార్ మరేం మాట్లాడలేదని తెలుస్తోంది. ఈ సినిమాకు హీరోయిన్ గా రాశీఖన్నాకు టెస్ట్ షూట్ అన్నపూర్ణలో చేసారు. కానీ ఆమెను కూడా ఇప్పుడు పక్కన పెట్టారని వినికిడి. మొత్తం మీద సుకుమార్-చెర్రీ కాంబినేషన్ సినిమా విడుదలకు ముందే ఇండస్ట్రీలో మాంచి కబుర్లు పుట్టిస్తోంది.