ముని, కాంచన, గంగ అంటూ జనాల్ని భయపెట్టి, వరుసగా విజయాలు అందుకున్నాడు లారెన్స్. అదే సిరీస్ కొనసాగింపుగా నాలుగోభాగం తీస్తా అంటూ ప్రకటించాడు. ఈ సినిమాకు తెలుగు వెర్షన్ భాగస్వామిగా నిర్మాత బండ్ల గణేష్ జాయిన్ అయ్యాడు. కానీ ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఏమిటంటే, ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని.
నిన్నటికి నిన్న లారెన్స్-పి వాసు కాంబినేషన్ లో కొత్త సినిమా ప్రారంభమైంది. తన సిరీస్ సినిమాను పక్కన పెట్టినందునే లారెన్స్ ఈ ప్రాజెక్టు ఓకె చేసారని తెలుస్తోంది. ఇదిలా వుంటే లారెన్స్ ఆ సినిమాను పక్కన పెట్టడానికి కారణం, దాని బడ్జెట్ అని తెలుస్తోంది. సుమారు ముఫై కోట్లకు పైగా బడ్జెట్ తో ఆ సినిమాను రూపొందించాలనుకున్నాడు.
ఒక్క తెలుగు వెర్షన్ నే ఇరవై కోట్ల దగ్గర అమ్మాలని కూడా భావించినట్లు తెలుస్తోంది. అంతకు ముందు అదే సిరీస్ లో మూడు సినిమాలు భయంకరంగా పే చేసాయి కానీ, అవన్నీ తక్కువ బడ్జెట్ లో తెరకెక్కినవే. కానీ ముందుగానే అంత బడ్జెట్ పెట్టడం సరైన నిర్ణయమా కాదా అన్న మీమాంసలో ఆ ప్రాజెక్టు ఆగినట్లు టాక్.