దేశ వ్యాప్తంగా సంచలనం సష్టించిన పెద్దనోట్ల రద్దు వ్యవహారం క్రమేపీ ప్రహసంగా మారుతోంది. తొలుత ఇదేదో అద్భుతం అనుకున్న సామాన్యులు ఇదంతా తమపై జరుగుతున్న దాడిగా వారు భావించే పరిస్థితి ఏర్పడింది. నల్లధనం, అవినీతిని అంతం చేయడానికే ప్రధాని మోదీ ఈ చర్యలు చేపడితే సంతోషమే. కాని మరి రాజకీయ అవినీతిపై ఆయన ఏ మేరకు చొరవ తీసుకుంటున్నారన్న ప్రశ్న కూడా వస్తుంది. ఈ సందర్భంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తావించాలి. అవినీతిని, మోసాన్ని ఇంకా కొనసాగించాలా అని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. మంచి ప్రశ్నే వేశారు. విపక్షాలను ఉద్ధేశించి ఆయన మాట్లాడి ఉండవచ్చు కాని ఇది ఎవరికైనా వర్తిస్తుంది.
కచ్చితంగా దేశంలో అవినీతి, మోసాలను అరికట్టడానికి మోదీ చర్య తీసుకుంటే అభినందించాలి. అంతా సహకరించాలి. అవినీతి అంటే కేవలం ఆర్థిక అవినీతి మాత్రమేనా? లేక రాజకీయ అవినీతి కూడా వస్తుందా అన్నదానిపై క్లారిటీ ఇవ్వాలి. విపక్షాలు నోట్ల రద్దుకు సంబంధించి ఇప్పటికే పలు ఆరోపణలు సంధిస్తున్నాయి. వాటిలో ఏ ఒక్కదానికి ఆధారం ఉన్నా మోదీ చేసిన ఈ ప్రకటనలకు అర్థం లేకుండా పోతుంది. ముందుగా ఆ విషయంలో ఆయన స్పష్టత ఇవ్వవలసి ఉంటుంది. దేశంలో దాదాపు ఏడాదిపాటు స్వచ్చంద నల్లధనం వెల్లడి పథకం అమలులో ఉంది. అందులో సుమారు అరవై వేల మంది అరవై ఐదువేల కోట్ల రూపాయల మేర నల్లదనం ప్రకటించారు. వారి పేర్లను కూడా రహస్యంగా ఉంచారు.
చట్టప్రకారం, బిల్లును ఆమోదించే చేశాం కదా అని బీజేపీ నేతలు సమర్ధించుకోవచ్చు. ఇక్కడ నైతిక ప్రశ్న కూడా వస్తుంది. వారిలో కొందరు నోట్ల రద్దుపై కూడా ఊహించి ఆ స్కీములో చేరలేదని అనుకోనవసరం లేదు. అయినా ఫర్వాలేదు. ప్రభుత్వం నిజంగానే అవినీతిపై పోరాడుతుంటే వందల, వేలకోట్లు దాచుకునేవారికి ఎందుకు క్లీన్ సర్టిఫికెట్ ఇస్తోంది? వారు అవినీతితో సంపాదించిన సొమ్మా? లేక మోదీ చెబుతున్నట్లు డ్బ్బై ఏళ్లుగా దోపిడీ చేసినవారిలో వీరు ఉంటారా? ఉండరా? ప్రభుత్వానికి తమ నల్లధనంపై పన్ను కడితే అవినీతి నీతి అయిపోతుందా? అన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా? అలాంటప్పుడు మధ్య తరగతి వారిని ఇప్పుడు దోషులుగా చూడడం సరైనదే అవుతుందా? అన్నది కూడా ఆలోచించాలి.
తాము చేయని తప్పుకు కోట్లాది జనాన్ని రోడ్డున పడవేయడం దర్మమేనా అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. సినిమాహాల్కు వెళ్లినప్పుడు క్యూలో నిలబడడం లేదా అని కొందరు అడుగుతున్నారు. అది వారి ఇష్టం. కాని మీరు మమ్ములను ఎన్నుకున్నందుకు మీరు రోడ్డుపై క్యూలో నిలబడాల్సిందే అని శాసించే హక్కు ప్రభువులకు ఉంటుందనుకుంటే అది నియంతత్వమే అవుతుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటివాటిని చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేది. ఈ మాట చెబుతున్నంత మాత్రాన నల్లదనానికి మద్ధతు ఇస్తున్నట్లు కాదు. కొందరు కోటీశ్వరులకు మాత్రమే నల్లధనాన్ని తెల్లదనంగా మార్చుకునే అవకాశం ఇవ్వడం కాకుండా, సామాన్యులు, మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులపాలు చేయకుండా నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంటే మోదీకి మంచి పేరు వచ్చేది.
క్యూలలో నిలబడలేక, గుండెపోటుకు గురైకాని, ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల కాని ఇప్పటికే ముప్పై మంది వరకు దేశ వ్యాప్తంగా మరణించారని వార్తలు వచ్చాయి. ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహించాలి? రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకోలేక నానా పాట్లు పడుతున్నారు. రైతులు తమ పొలాలను అమ్ముకోవడం ద్వారా వచ్చిన డబ్బును మోదీ ప్రభుత్వం నల్లధనం అంటుంటే తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి సమస్యలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో కొందరు పెద్దలనండి, నేతలనండి, వ్యాపారవేత్తలనండి తమ వద్ద ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి అనేక పద్ధతులు పాటిస్తున్నారు.
కేంద్రం కూడా తను చేసిన తప్పులను సర్దుకునే పనిలో రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఎప్పటికప్పుడు పాతనోట్ల గడువు పెంచుతూ పోతోంది. ఇక్కడే వారి వైపల్యం స్పష్టంగా కనిపిస్తోంది. రకరకాల సడలింపులు ఇవ్వక తప్పలేదు. ప్రత్యామ్నాయాలు చూసుకోకుండా స్పైడర్ మ్యాన్, లేదా సూపర్ మ్యాన్ అనిపించుకోవాలనుకున్న మోదీ నిర్ణయం వల్ల ఇన్ని సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇవన్ని ఇలా ఉంటే రాజకీయ అవినీతి గురించి చూద్దాం. అవినీతిని నిర్మూలిస్తానని చెబుతున్న మోదీ అరుణాచల్ ప్రదేశ్లో ఏకంగా ప్రభుత్వాన్నే మార్చేయడంలో బీజేపీ పాత్ర లేదని నిజాయితీగా చెప్పగలరా?
సుప్రీంకోర్టు ఫిరాయింపులను అభిశంసిస్తే, తిరిగి అక్కడ బీజేపీ చేసింది నిజాయీతీతో కూడినదేనా? వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఇలా జరిగిన ఘట్టాలు ఉన్నాయా? ఉత్తరాఖండ్లో జరిగిన బాగోతంలో బీజేపీ పాత్ర లేదని నిజాయితీగా చెప్పగలరా? అవన్ని ఎందుకు ఏపీలో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఒక పార్టీ తరపున ఎన్నికైన మరుసటి రోజే పార్టీ ఫిరాయిస్తే దానిపై ఫిర్యాదు చేస్తే ఎందుకు అనర్హత వేటుకు స్పీకర్ పరిశీలించడం లేదు. అలాగే ఏపీ, తెలంగాణలలో జరిగిన ఫిరాయింపులను కనీసం పట్టించుకున్నారా? వీటన్నిటి వెనుకాల ఆర్ధిక అవినీతి లేదని మోదీగారు నమ్ముతున్నారు.
నోట్లరద్దు తర్వాత కొత్తగా రెండువేల నోట్లు రావడంతో పలువురు డబ్బున్న ఆసాములు, రాజకీయ నేతలు టీములుగా మనుషుల్ని పెట్టుకుని మళ్లీ బ్లాక్ మనీకి రంగం సిద్ధం చేసుకోవడం లేదా? ఇలాంటి లోటుపాట్లన్నిటిని సరి చేసి, ఒక నిజాయితీతో కూడిన సమాజం నిర్మించాలనుకుంటే మీరు చేయాల్సింది రాజకీయాలకు అతీతంగా మాట్లాడడం, ప్రభుత్వానికి, పార్టీకి మధ్య ఉన్న రేఖను గమనించి వ్యవహరించడం. అంతేకాదు. దేశ ప్రధానికే ప్రాణహాని ఉందన్న సంకేతం ఇస్తే మరి సామాన్యుడి పరిస్థితి ఏమిటి? మోదీని జనం ఇంకా నిజాయితీ పరుడుగానే భావిస్తున్నారు. ఆయన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి.
కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్