''ఒరేయ్ అనంతూ, ఇందాక హోటల్లో కాఫీకి వెళ్ళినప్పుడు అక్కడ సుమన, అదే సుమనోహరి కనబడిందిరా'' అంటూ అరిచేడు రాంపండు గదిలోకి వస్తూ. అతడి ఉత్సాహం పట్టరాకుండా ఉంది.
భోజనానంతరం కునుకు తీస్తున్న అనంత్ విసుక్కున్నాడు. ''ఒరేయ్, నీ పగటి కలలు ఆపు. సుమనోహరి ఈ ఊరెందుకు వస్తుందిరా'' అని.
''అదే నేనూ అనుకున్నాను. తనకి రాయవరంలో పనేముంటుందా అని. కానీ ముమ్మూర్తులా తనలాగే ఉంది. నేను డైనింగ్‌హాల్లోకి వెళుతుంటే తను వేరే గుమ్మంలోంచి వెళ్ళిపోతోంది.''
''నాయనా రాంపండూ, పేకాటలో డబ్బు పోయి, పోయి నీ మతి పోయింది. తనకి ఇంత చిన్న ఊళ్ళో పనేముంటుందిరా? నీకూ, నాకూ అయితే పేకాట యాగం ఉందిగానీ…'' అని నచ్చజెప్పబోయాడు అనంత్.
అనంత్ (అచలపతితో సహా), రాంపండు ఆ ఊరికి వచ్చింది పేకాట సప్తాహంలో పాల్గొనడానికి. అఖండ నామస్మరణ అంటూ రోజులపాటు కొందరు భజనలు చేస్తుండగా లేనిది ఓ వారం పాటు నిర్విరామంగా పేకాట ఎందుకు ఆడకూడదు? అన్న ఐడియా వచ్చింది వాళ్ళ మిత్రబృందంలో ఒకడికి. అందుకే పదిమంది ఫ్రెండ్స్‌ని పిలిచి రాయవరంలో వాళ్ళ ఔట్‌హౌస్‌లోనే బస ఏర్పాటు చేసి పేకాట క్రతువుని నిర్వహిస్తున్నాడు.ఆరోజే ఆఖరి రోజు. యజ్ఞఫలంలో అనంత్‌కీ, రాంపండుకి పెద్దగా వాటాలు దక్కలేదు. ఇద్దరూ మధ్యాహ్నానికే డ్రాప్ అవుట్ అయిపోయారు. అనంత్ రూమ్‌కొచ్చి పడుకుంటే రాంపండు ఊళ్ళో తిరగబోయాడు.
మిగతా విషయాల్లో ఎలా ఉన్నా ప్రేమ విషయాల్లో మాత్రం రాంపండు పట్టువదలని విక్రమార్కుడు. సుమనోహరితో అతని స్నేహం బలపడి ఆమెను సుమన అని పిలిచేదాకా వచ్చింది. పేకాటయాగం గురించి చెప్తే ఆమె ఏమైనా అనుకుంటుందేమోనని చెప్పకుండా వచ్చేశాడు. తీరా చూస్తే ఇక్కడా ఆమె కనబడింది. ప్రియురాలిని వెంటేసుకుని పైరుల మధ్య, కాలవగట్లవిూద తిరగడంలో మజాయే వేరు. ఆ అదృష్టం పొగొట్టుకోదలుచుకోలేదు రాంపండు. అందుకే ఆమె కనబడిన హోటల్ దారి పట్టాడు.
ఆ హోటల్‌లో లాడ్జింగ్ సౌకర్యం కూడా ఉంది. వాకబు చేస్తే సుమనోహరి పేర రూమ్ బుక్ అయి ఉంది. వెళ్ళి తలుపు తడితే సాక్షాత్తూ సుమనోహరే తలుపు తీసింది. ఇద్దరూ కాసేపు ఆశ్చర్యాంబుధిలో ఈతలు కొట్టాక సుమనోహరి ఎనౌన్స్ చేసింది-
''మనం ఇవాళ మేట్ని సినిమా చూడబోతున్నాం. ఆ తర్వాత ఇక్కణ్ణించి దగ్గర్లో ఉన్న టౌనుకెళ్ళి మంచి హోటల్లో డిన్నర్ చేద్దాం''.
రాంపండు ఈసారి ఆనందాంబుధిలో తలమునకలైపోయాడు. ''ఓ దేవతా! నాతో షికార్లు కొట్టడానికేనా ఇక్కడ ప్రత్యక్షమయ్యేవ్'' అని అడిగేశాడు.
సుమనోహరి మనోహరంగా నవ్వింది. ''అదేంకాదులే. మా కజిన్ రుక్మిణి ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో టెన్త్‌క్లాస్ చదువుతోంది. వాళ్ళ అమ్మా, నాన్న ఢిల్లీలో ఉన్నారు. ఇవాళ దాని పుట్టినరోజు. ఒంటరితనం ఫీలవుతుందని పలకరించడానికి వచ్చా. ఆ స్కూల్లో చాలా స్ట్రిక్టు. హాస్టల్లో బంధువులను ఉండనివ్వరు. అందుకే ఇక్కడ రూము తీసుకున్నా''.
''ఇక్కడ రూము తీసుకోబట్టే నా కంటబడ్డావ్. నన్ను కరుణించావ్''.
''అంత వద్దులే. నేను రాత్రికి ఊరికి తిరిగి వెళ్ళిపోవాలి''.
''పోన్లే. అయితే ఏ సినిమాకెళ్దాం? 'వగలాడి వలలు' ఆడుతోంది ఊళ్ళో''.
''ఛా,ఛా, చిన్న పిల్లలకు అలాటి సినిమాలు చూపిస్తే బావుండదు''.
''చిన్నపిల్లలెవరు?'' రాంపండు అయోమయంగా అడిగాడు.
''ఇంకెవరు? రుక్మిణి! పుట్టినరోజుపూట దాన్ని ఉసూరు మనిపించకూడదనే కదా ఇంత దూరం వచ్చింది''.
రుక్మిణి మాట ఎలా ఉన్నా రాంపండు ఉసూరుమన్నాడు. బలవంతపు నవ్వొకటి ముఖాన పులుముకుని ''ష్యూర్, ష్యూర్'' అన్నాడు. ''పోనీ 'సాయి మహిమలు' కే వెళదాంలే, టిక్కెట్లు తీసుకుని హాలు దగ్గర వెయిట్ చెయ్యనా?''
''బొత్తిగా 'సాయి మహిమలు' కాదుగానీ మరో సినిమా చూద్దాం. ఆ తర్వాత డిన్నర్‌కి వస్తుంది.''
''డిన్నర్‌కి కూడానా?'' రాంపండు దిగాలు పడ్డాడు. ''బాగా చీకటి పడిపోతుంది. టౌను నుంచి తిరిగిరావడం లేటయిపోదూ? అంత చీకట్లో చిన్నపిల్ల…'' రాంపండు నచ్చజెప్పబోయాడు.
''అందుకే డిన్నర్ తర్వాత రుక్మిణిని స్కూల్‌కి తీసుకెళ్ళి దింపే భారం నీకు అప్పగిస్తున్నాను. ఏంలేదు, వెంటబెట్టుకెళ్ళి ఫ్రంట్‌డోర్ బెల్లు కొట్టడం, రుక్మిణిని వార్డన్‌కి అప్పజెప్పడం – అంతే!''
**********
రాంపండు బెదిరాడు కానీ రుక్మిణిని చూసాక ఫర్వాలేదనిపించింది. ఆ పిల్ల బుద్ధిమంతురాల్లాగానే అనిపించింది. సినిమాహాల్లో బుద్ధిగా ఓ చివర్లో కూచుంది. డిన్నర్ తీసుకుంటూ అవి కావాలి, ఇవి కావాలి అని డిమాండ్ చేయలేదు.
ముగ్గురూ కలిసి రాయవరం వచ్చేసరికి రాత్రి తొమ్మిదిన్నర దాటింది. లాడ్జ్ దగ్గరపడుతుంటే సుమనోహరి గొంతు సవరించుకుంది- ''మై డియర్ రాంపండూ! నేను సామాను సర్దుకుని బస్సెక్కేస్తాను, నువ్వు రుక్మిణిని హాస్టల్లో దింపే విషయం జాగత్త్రగా హేండిల్ చేసేయ్. ఐ నో, నువ్వు చాకచక్యంగా చేయగలుగుతావ్…''
అప్పటిదాకా ఆకాశవీధిలో విహరిస్తున్న రాంపండు ఒక్కసారి ఆ వీధిగతుకుల్లో పడ్డాడు. 'ఇందులో హేండిల్ చేయడాని కేముంది? అని అడిగాడు.
సుమనోహరి మొహం కాస్త అదోలా పెట్టింది. ''ఇందాకా హడావిడిలో చెప్పడం మర్చిపోయాను. రుక్మిణి వాళ్ళ స్కూల్లో చెప్పి రాలేదు..''
''చెప్పి రాకపోవడమా? అసలే ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళు మహా స్ట్రిక్ కదా! జైళ్ళే నయం అనిపిస్తాయి. ముఖ్యంగా రుక్మిణి చదువుతున్న 'చండికా విద్యాలయం' మరీనూ. మన అనంత్ వాళ్ళ అత్తయ్య లేదూ, – మాంకాళి అత్తయ్య… అవిడ ఫ్రెండే ఈ స్కూల్ నడిపే చండికమ్మగారు. రాయవరం వచ్చినప్పుడల్లా ఆవిణ్ణి కలవాలని మాంకాళి అత్తయ్య ఆర్డరు. కలవాలంటే మనవాడికి అడల్. అందుకే ఊరికి వచ్చినా బయట తిరగటం లేదు''.
''ఇప్పుడీ అనంత్ గొడవెందుకు?'' విసుగ్గా అడిగింది సుమనోహరి.
''అబ్బె, అనంత్ గురించి కాదు; చండికా విద్యాలయం సంగతి చెప్తున్నా. వాళ్ళు పిల్లల్ని బయటకు వదలరు అని చెప్తున్నా'' రాంపండు గుటకలు మింగాడు.
''ఇప్పుడు మాత్రం రుక్మిణిని వదిలారనుకుంటున్నావా? చెప్పకుండా చెక్కేసొచ్చింది. తన రూమ్‌లోంచి బయటకు కదలకూడదని ఆర్డరేసింది వాళ్ళ మేడమ్''
''అదేమిటి? పుట్టిన రోజుపూట కూడా అంత స్ట్రిక్టా?''
''పనిష్మెంటులే, పాపం రుక్మిణి ఓ చిన్న ప్రయోగం చేసింది. వాళ్ళ టీచరు ఇంకుపెన్నులో కాస్త కోక్ కలిపి చూసిందట. పెన్ను కదిపినప్పుడు ఇంకు బుసబుసా పైకి వస్తుందా రాదా చూద్దామని. ఆ మాత్రానికే పనిష్మెంటు. పుట్టినరోజు అనైనా చూడటం లేదు. ఏం టీచర్లో, ఏమో'' నిట్టూర్చింది సుమనోహరి.
రాంపండు రుక్మిణికేసి తేరిపార చూశాడు. రుక్మిణి అని పేరు పెట్టుకుని, ఇంత అమాయకంగా కనిపించే పిల్ల బ్రెయిన్‌లో ఇంత జిజ్ఞాస దాగి ఉందా అని. చెప్పా పెట్టకుండా హాస్టలు కిటికీలోంచి కొట్టుకొచ్చేసిన ఈ పిల్లను మళ్ళీ వాళ్ళకు అప్పచెప్పడం ఎలా? అదే అడిగాడు సుమనోహరిని.
''దానికి అయిడియా వుంది నాదగ్గర. నిజానికి నేనూ ఈ స్కూల్లోనే చదివాను. అప్పుడూ ఇలాటి సందర్భాలు ఎదురయినప్పుడు మేమో ట్రిక్ వేసేవాళ్ళం. ఇప్పుడూ నువ్వూ అదే చెయ్'' అంది చులాగ్గా.
దాని ప్రకారం రాంపండు రుక్మిణిని హాస్టలు మెయిన్‌గేటు దగ్గర నిలబెట్టి బెల్లు కొట్టే ముందు చేయవలసిన పని ఒకటి ఉంది. బిల్డింగ్ వెనకాల ఉన్న తోటలోకి దొంగతనంగా దూరి పూలకుండి ఒకటి పట్టుకుని చెట్టు ఎక్కాలి. ఆ చెట్టు కొమ్మల్లో ఓ కొమ్మ మొక్కలు పెట్టే అద్దాల షేడ్ మీదకు వంగి వుంది. ఓ తాడు పెట్టి పూలకుండీని కొమ్మకు కట్టివేసి కిందకు దిగాలి. ఫ్రంట్ డోర్ బెల్లు కొట్టగానే ఎవరో ఆయా వచ్చి తలుపు తీస్తారు. సరిగ్గా అదే టైముకి తోటలోకి దూరి ఆ తాడు లాగాలి. దెబ్బకి పూలకుండీ అద్దాల కప్పుమీద పడి భళ్ళుమని శబ్దం వస్తుంది. ఫ్రంట్ డోర్ తీసిన ఆయా గబగబా తోటలోకి పరిగెత్తుకు వస్తుంది. చీకట్లో నిక్కిన రుక్మిణి, చటుక్కున హాస్టల్లోకి చల్లగా దూరుతుంది.
ఈ పథకం వినగానే రాంపండుకి బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. అది రెండు భాగాలు. మొదటిది తను, సుమనోహరితో కలిసి ఊరెళ్ళిపోవడం, రెండు ఈ రుక్మిణిని హాస్టల్లోకి తోసేపని అనంత్‌కి అప్పజెప్పడం.
*********
మామూలు పరిస్థితుల్లో అనంత్ ఈ ఉపకారం చేయడానికి ఒప్పుకునేవాడుకాదు. ఈ సుమనోహరి ఏదో ఒక రూపంగా తలకాయనొప్పి తెచ్చిపెడుతోందని అతనెప్పుడో గ్రహించాడు. పైగా ఆ స్కూలు మరోటీ, మరోటీ కాదు సాక్షాత్తూ తన మేనత్త ఫ్రెండుది. ఏదైనా అడ్డం తిరిగితే విషయం బయటకు పొక్కుతుంది. ఊళ్ళోకి వెళ్ళినా తన ఫ్రెండుని పలకరించనందుకు అత్తయ్య క్లాసు తీసుకుంటుంది. అసలు ఊరెళ్ళడానికి కారణం పేకాటయాగం అని తెలిస్తే ఎక్‌స్ట్రా క్లాసు తీసుకుంటుంది.
కానీ అనంత్ సై అన్నాడు. దానికో కారణం ఉంది. అంతకు అరగంట క్రితమే అనంత్ కొత్తగా కొన్న నైట్‌డ్రస్సు మీద అచలపతి తన అభిప్రాయాన్ని ఘాటుగా చెప్పి వున్నాడు.
అడ్డమైన దానికీ తను అచలపతి సలహాపై ఆధారపడడం వల్లనే అతనికింత తెగింపు వస్తోందనుకున్నాడు అనంత్. స్వతంత్రంగా ఏదో ఒకటి చేసి చూపి అచలపతి అహాన్ని అణచాలని కంకణం కట్టుకున్న కాస్సేపటికే రాంపండు ఆఫర్ వచ్చింది.
''సరేరా, ఈ రుక్మిణి విషయం నా కొదిలేయ్. నువ్వు హాయిగా రైలెక్కేయ్'' అని రాంపండుని పంపేసి అచలపతికేసి తిరిగి ఓ చిరునవ్వు నవ్వాడు.
''విన్నావుగా అచలపతీ, ప్లానంతా వింటే నీకు గందరగోళంగా అనిపించవచ్చు కానీ నాలాటివాడు ఎడం చేెత్తో చేసేస్తాడు….''
''సర్, నా దగ్గర ఇంతకంటే సులభమయిన ప్లాన్ వుంది''. అన్నాడు. అచలపతి హుందాగా తలవంచి.
''నీ ప్లాను నీ దగ్గరే అట్టిపెట్టుకో. నాకక్కరలేదు. నాకు కావలసినదల్లా ఓ పెద్దతాడు. ఐదు నిమిషాల్లో అది తీసుకుని నాతో రా. చండికా స్కూలు ఫ్రంట్‌డోర్ దగ్గరకు రుక్మిణిని తీసుకుని వెళ్ళు. నేను వెనకనుంచి తోటలోకి వెళ్ళి పూలకుండీ కట్టేసాక వచ్చి నీకు సిగ్నల్ ఇస్తాను. అప్పుడు డోర్‌బెల్ మోగిద్దువుగాని'' అంటూ సేనాధిపతిలా ఆదేశాలు గుప్పించాడు అనంత్.
''మీరు చెప్పినట్లే చేస్తాను సర్'' అన్నదొక్కటే ఆచలపతి పెదాలనుంచి వచ్చింది.
ఆచలపతి మీద కోపం కొద్దీ రాంపండు ప్లాను సరేననేశానని అనుకుంటూనే అనంత్ గోడదూకి తోటలోకి దూరాడు. తనను తాను తిట్టుకుంటూనే పూలకుండీ వెతికాడు. జన్మలో సుమనోహరి అయిడియాలు వినకూడదని ఒట్టు వేసుకుంటూనే చెట్టెక్కాడు, కొమ్మల విూదనుంచి పాకాడు. అద్దాల కప్పుమీదకు వాలిన కొమ్మ మీదకు వచ్చి పూలకుండీిని తాడుపెట్టి బాలన్స్ చేస్తూ కట్టాడు. తాడు కొసను కిందకు వదిలిపెడుతూండగానే కేక వినబడింది.
''హేయ్‌ఁ''
కిందచూస్తే పోలీసు కానిస్టేబుల్. బాటరీలైట్‌తో సహా.
''హేయ్ కిందకు దిగరా నాకొడకా''
పోలీసు వాళ్ళతో అనంత్‌కు కొన్ని పాత అనుభవాలున్నాయి కానీ ఇది బొత్తిగా హద్దులు మీరేట్టు ఉందనిపించింది. తనెంత పెద్దమనిషో తెలిసాక పోలీసు నాలిక కరుచుకోక తప్పదు కదాని జాలివేసింది.
''ఏయ్, వినబడలేదేమిట్రా?''
అరుపులకు చండికాదేవిగారు లేస్తుందేమోనన్న బెంగవేసింది అనంత్‌కి.
''ష్, ఏం ఫరవాలేదు లేవయ్యా బాబూ'' అన్నాడు కిందకు చూస్తూ. ''ఫరవాలేదా? ఎవరికి? నువ్వక్కడ ఏం చేస్తున్నావో చెబితే ఫరవా ఉందో లేదో నేను చెబుతా'' అన్నాడు పోలీసు కటువుగా.
''ఎవరు? నేనా?''
''అవును. నువ్వే''.
''ఏం చేయటం లేదే!''
''తాడిచెట్టు ఎందుకెక్కావురా అంటే కనీసం దూడగడ్డి కోసమనైనా చెప్పాలి. ఏమీ లేదంటే ఎలా?''
''లేదు కాబట్టి లేదంటున్నాను'' అనంత్ మొండికేశాడు.
తలెత్తి సంభాషించడం పోలీసుకి దుర్భరంగా తోచినట్టుంది. ''నువ్వసలు కిందకు దిగిరా'' అని ఆర్డరేశాడు.
సాధ్యమైనంత నెమ్మదిగా చెట్టుదిగుతూ అనంత్ అనేక రకాలుగా ఆలోచించాడు కానీ సరైన సమాధానం ఏం చెప్పాలో తెలియలేదు. కానీ పోలీసు అతని కష్టాన్ని గుర్తించినట్టున్నాడు. ఆలోచించడానికి మరింత వ్యవధి ఇద్దామనుకున్నాడు కాబోలు, చెట్టు దిగిన అనంత్ భుజాన చేయివేసి ''స్టేషన్‌కి పద ఏం చెప్పుకుంటావో అక్కడే చెప్పుకుందువుగానీ'' అన్నాడు.
సుమనోహరి మాట విన్నందుకు ఓసారి, అచలపతి మాట విననందుకు ఒకసారి తననుతాను తిట్టుకుంటూండగా అచలపతి కంఠం వినబడింది:
''హమ్మయ్య, దొరికారన్నమాట! అరే అనంత్‌గారు!''
ఈసారి పోలీసువాడి బాటరీ లైటు అచలపతి మొఖం మీద పడింది.
''నువ్వెవడివి?''
''నేను. అనంత్ గారి అసిస్టెంటుని''
''అనంత్ ఎవరు?''
''అయనే''
''ఈయన పేరు అనంత్. నువ్వాయన అసిస్టెంటువి. అంటే తోడుదొంగవా? ఈ వేేళప్పుడు ఇక్కడేం చేస్తున్నావ్?''.
''చండికమ్మగారు పంపితే వచ్చాను. తోటలో దూరిన దొంగల్ని అనంత్‌గారు పట్టుకున్నారో లేదో చూడమన్నారావిడ''.
''దొంగలెవరు?''
''అనంత్‌గారూ, నేనూ చండికా మేడమ్‌ను పలకరిద్దామని వస్తుంటే తోటలో కనపడ్డవారు''.
''సరిగ్గా చెప్పిచావు''. పోలీసు విసుక్కున్నాడు.
''చండికా మేడమ్ మా అనంత్ గారి ఫ్యామిలీ ఫ్రెండ్. అవిణ్ణి పలకరిద్దామని ఆయనా, ఆయన వెనుక నేనూ వస్తూ ఉంటే తోటలో ఎవరో మనుష్యుల అలికిడి వినబడింది. ''వాళ్ళ సంగతి నేను చూస్తాను. నువ్వెళ్ళి ఆవిడకీ విషయం చెప్పు'' అని మా అనంత్‌గారు నన్ను ఆవిడ దగ్గరికి పంపి ఆయన స్వయంగా తోటలోకి ప్రవేశించి…''
''…. నేను చూసేటప్పటికీ ఆయన చెట్టుమీదున్నాడు''
''దొంగలెక్కడున్నారో కనిపెట్టాలంటే చెట్టెక్కి చూడకపోతే ఎలా?'' అడిగాడు అచలపతి.
పోలీసు కానిస్టేబుల్ తల విదిలించాడు. ''ఈ కట్టుకథలో ఒక్క అక్షరం కూడా నేను నమ్మటం లేదు. ఇక్కడెవరో మసలుతున్నారని ఆ ఎదురింటాయన స్టేషన్‌కి ఫోన్ చేశాడు. వచ్చిచూస్తే చెట్టుమీద వీడున్నాడు. నువ్వొచ్చి ఏవేవో కథలు చెప్తున్నావు. అసలు మీ ఇద్దరూ తోడుదొంగలని నా అనుమానం''.
''పోనీ మీరు చండికా మేడమ్ దగ్గరికి వచ్చి అడిగితే!'' అచలపతి మాట విని అనంత్ ఉలిక్కిపడ్డాడు. తనమీద కసి తీర్చుకోడానికి ఇంతకంటే మంచి స్కీము దొరకలేదాని అడుగుదామనుకున్నాడు విడిగా దొరికితే.
కానీ అలా చూస్తుండగానే అందరూ కలిసి చండికగారి దగ్గరిక చేరడం జరిగింది. ఆవిడ అనంత్‌ను చూసి ''దొంగలు దొరకలేదా అనంత్?'' అని పలకరించింది. ఆ ప్రశ్నకు అనంత్ కంటే పోలీసు ఎక్కువ ఆశ్చర్యపడ్డాడు.
''అంటే – అంటే… మీరితన్ని గుర్తు పడతారా మేడమ్?''
చండికమ్మగారు మండిపడింది. ''అసలు నువ్వెందుకు వచ్చావ్?''
అచలపతి టూకీగా చెప్పాడు. ''ఈ పోలీసాయన అనంత్‌గార్ని చూసి దొంగనుకుంటున్నాడు మేడమ్''.
''ఏడిసినట్టుంది. దొంగతనం చేయడానికి అతనికేం ఖర్మ? బోల్డంత డబ్బుంటేనూ! నాకు హెల్ప్ చేయబోతుంటే పాపం….''
''ఆ ముక్కే నేను చెప్పబోతే వినిపించుకోలేదు మేడమ్…'' అచలపతి కాస్త ఎగదోసాడు.
''వీడో చవట. చిన్నప్పట్నించీ అంతే! మా స్కూల్లోనేగా చదివాడు. నాకు బాగా తెలుసు వీడి సంగతి'' అంది చండిక ఘాటుగా.
పోలీసువాడి మొహం మాడిపోయింది. ''మరీ బావుంది మేడమ్, అర్ధరాత్రి పూట చెట్టెక్కిన పెద్దమనిషిని దొంగనుకోక…''
ఇంతలోనే గాలికి కాబోలు కొమ్మమీద పెట్టిన పూలకుండీ అద్దాలకప్పుమీద పడి భళ్ళున శబ్దమయ్యింది.అందరూ ఉలిక్కిపడ్డారు. ముందుగా తేరుకున్నది చండికమ్మే.
''అ దొంగల్లో ఓ వెధవ జారిపడ్డాడులావుంది. వాణ్ని వదిలేసి మా అనంత్‌ను పట్టుకున్నాడు వీడు. వీడిలాటి వాళ్ళ జీతాల కోసం మన దగ్గర పన్నులు వసూలు చేస్తోంది ప్రభుత్వం! ఏం చేస్తాం!'' అంటూ విరుచుకుపడింది చండిక.
ఈ తిట్లు వినలేక, దొంగాణ్ని పట్టుకుంటానంటూ పోలీసు పారిపోయాడు. చండికమ్మ పొగడ్తలు విని, విని నెమరేసుకుంటూ ఇంటికి నడిచివచ్చేయడంలో అనంత్‌కు వళ్ళు తెలియలేదు. వచ్చాక అప్పుడు సడన్‌గా గుర్తొచ్చింది. ''అవును అచలపతీ, మన కథానాయిక రుక్మిణి ఏమయినట్టు?'' అన్నాడు ఉలిక్కిపడుతూ.
అచలపతి మెల్లగా, మెత్తగా దగ్గాడు ''సర్, మీరు వద్దంటున్నా నేను అనుకున్న సులభమైన ప్లాను అమలులో పెట్టాను సర్''.
''అదేమిటి?''
''ఏమీ లేదు. నేను హాస్టలు తలుపు కొట్టి అనంత్ గారి దగ్గర పని చేస్తున్నానని, చండిక గారికి ఓ కబురు చెప్పాలని వచ్చాననీ చెప్పాను. ఆవిడ్ని పిలవడానికి ఆయా అలా వెళ్ళగానే రుక్మిణి ఇలా లోపలికి దూరిపోయింది''.
''ఇంత సులభమైన ప్లానా? మరి సుమనోహరి అంత కష్టమైన ప్లాను చెప్పిందేం? నాకు గానీ, రాంపండుకి గానీ ఇదెందుకు తట్టలేదు?''
అచలపతి కొనసాగించాడు – ''రుక్మిణిని లోపలకు పంపించేస్తూండగానే ఓ పోలీసు తోటవైపు వెళ్ళడం కనబడింది. అక్కడ ఏం జరుగుతుందో ఊహించి, నేను చొరవతీసుకుని చండికగారి దగ్గరకెళ్ళి మీరు దొంగల్ని పట్టుకోవడానికి వెళ్ళారని చెప్పాను. ఆ తర్వాత కథ మీకు తెలిసిందే''.
''తెలిసింది. తెలిసింది… ఇంకెప్పుడూ సుమనోహరితో జోక్యం పెట్టుకోకూడదని తెలిసివచ్చింది. తెలియనిదల్లా ఒకటే! నీకిన్ని తెలివితేటలు ఎక్కణ్ణించి వస్తాయని!'' అన్నాడు అనంత్
అచలపతి తలపంకించి ఊరుకున్నాడు.
(పిజి ఉడ్‌హౌస్ రచన Jeeves and the Kid Clementina ఆధారంగా)
('హాసం' హాస్య – సంగీత పత్రికలో అక్టోబరు 2002లో ప్రచురితం)
– ఎమ్బీయస్ ప్రసాద్