నల్లధనాన్ని నియంత్రించడానికి పెద్ద నోట్లను రద్దు చేయడం మంచి నిర్ణయమే. ఎందుకంటే పన్ను కట్టకుండా, బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురాకుండా డబ్బును నేలమాళిగల్లో, గోనెసంచుల్లో దాచుకుందా మనుకునేవారికి పెద్ద నోట్లు చాలా సౌకర్యంగా వుంటాయి. దేశంలో చలామణీలో వున్న డబ్బంతా బినామీల పేరో, సనామీల పేరో బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చినపుడే పాలకులు తీసుకునే ఆర్థికపరమైన విధాన నిర్ణయాలు సవ్యంగా అమలవుతాయి. తెల్లధనంతో సమానస్థాయిలో, సమాంతరంగా నల్లధనం ప్రవహిస్తూ వుంటే యీ విధానాలకు ఫలితాలు కానరావు. బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాని డబ్బు నోట్ల రూపంలోనే వుండదు. బంగారం, అసలు రేటు కన్న తక్కువ విలువ చూపే రియల్ ఎస్టేటు, విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు.. యిత్యాది రూపాల్లో కూడా వుంటుంది. స్విస్ బ్యాంకుల నుండి డబ్బు పట్టుకుని వచ్చి అందరి ఖాతాలకు పంచిపెట్టడం ఎన్నికల వాగ్దానమంత సులభం కాదని మోదీకి బోధపడినట్లుంది. దాని మాట ఎలా వున్నా, దేశంలో వున్న నల్లధనంపై దృష్టి పెట్టి ఓ స్కీము ప్రకటించి 'మేం మిమ్మల్ని పట్టుకోలేక పోతున్నాం, మీ అంతట మీరే వెల్లడించండి' అని నల్లధనికులను కోరితే వారి స్పందన అంతంతమాత్రంగా వుంది. అది విఫలమైంది కాబట్టే యీ రద్దు తలపెట్టారనడం సరికాదు. ఈ నిర్ణయం, యీ కసరత్తు ఆర్నెల్లగా సాగుతోందట. పెద్ద నోట్ల రద్దు ఒక్కదానితోనే వ్యవస్థ మారిపోదు. అనేక మార్గాల్లో యిది కూడా ఒకటి. దీన్ని ఒక పద్ధతిగా చేయాలి. టైమింగు చూసుకోవాలి. తక్కిన మార్గాలు మూసేసే జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. అవేమీ లేకుండా మోదీ సర్కారు నాటకీయ ఫక్కీలో చేయడం వలన అంతటా గందరగోళం నెలకొంది. ఈ రద్దు అమలవుతున్న పోకడలు చూస్తూ వుంటే ప్రజలకు యిబ్బంది కలగడం తప్ప అసలు లక్ష్యం నెరవేరకుండా కేవలం పబ్లిసిటీకే పనికి వస్తుందన్న భయం వేస్తోంది.
ప్రజల్లోంచే వచ్చిన మంత్రులకు, యిక్కడే చదువుకున్న అధికారులకు, భారతదేశం విశాల దేశమని తెలుసు, యిక్కడి ప్రజల అలవాట్లు, భయాందోళనలు తెలుసు, ప్రభుత్వ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో తెలుసు, ఇన్ఫ్లేషన్ ధర్మమాని యీ నాడు 500 రూ.ల నోటును 100 రూ.ల స్థాయిలో వాడుతున్నారనీ తెలుసు. ఇన్ని తెలిసి యిలాటి భారీ నిర్ణయం వలన ఎలాటి పరిణామాలు సంభవిస్తాయో వూహించలేకపోవడం వైఫల్యం కాక మరేమిటి? ఊహించలేదని ఎందుంటున్నానంటే పెట్రోలు బంకులు, ఆసుపత్రులు, ప్రభుత్వం ఆమోదించిన పాల బూతులు, రైలు, బస్సు, విమాన కౌంటర్లు, గవర్నమెంటు కన్స్యూమర్ స్టోర్లు, మందుల చీటీ చూపిస్తే మెడికల్ షాపుల వద్ద మాత్రమే పెద్ద నోట్లు చెల్లుతాయి అని మొదట్లో చెప్పారు. తెల్లవారగానే టోల్గేట్ల వద్ద కి.మీ.ల కొద్దీ వాహనాలు నిలిచిపోగానే వాళ్లకి వెసులుబాటు యిచ్చారు, ఆ మర్నాడు ప్రభుత్వ పన్నులు కట్టేటప్పుడు తీసుకుంటామన్నారు, యిప్పుడు చీటీ చూపకపోయినా మెడికల్ షాపులు కూడా తీసుకుంటాయట. ఇలా ఒక్కోటీ సడలిస్తూ పోవడం దేనికి? దేనిదేనికి యివ్వాలో ముందే చూసుకోవద్దా?
పెట్రోలు బంకుల్లో ఏం చేస్తున్నారు? నోటు తీసుకుంటాం కానీ చిల్లర యివ్వం అంటున్నారు. టూ వీలర్లో 500 రూ.ల పెట్రోలు పోయించుకోవాలంటే తరమా? ఇక ప్రయివేటు ఆసుపత్రుల్లో డబ్బు తీసుకోవటం లేదని అనేక కథనాలు వస్తున్నాయి. నిజమే, యిప్పటిదాకా క్యాష్తో వ్యవహారం నడిపేవాళ్లను హఠాత్తుగా అది కుదరదంటే ఎకౌంటింగ్ ఎలా చేయాలో వాళ్లూ తబ్బిబ్బు పడతారు. చికిత్స చేసే, టెస్టులు రాసే డాక్టర్ల వాటా దగ్గర్నుంచి, యిన్స్పెక్షన్కు వచ్చే అధికారుల లంచాల దగ్గర్నుంచి యిన్నాళ్లూ వాళ్లు డబ్బుతోనే డీల్ చేస్తూ వచ్చారు. అప్పుడు అది రద్దు అన్నారు. వీళ్ల దగ్గర్నుంచి డబ్బు తీసుకుని తమ ఖాతాలో జమ చేస్తే రేపు యిన్‌కమ్‌టాక్స్ వాళ్లు వచ్చి 'ఓహో, నీకు రోజుకి యిన్ని లక్షల వ్యాపారమవుతుందా? చెప్పనే లేదు' అంటూ పీడిస్తారని భయం. వ్యాపారం పోయినా ఫర్వాలేదు, వాళ్ల పాల పడకుండా వుంటే చాలని రోగులను వెనక్కి పంపేస్తున్నారు.
బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో నోట్లు మార్చవచ్చని ప్రకటించేముందు వాళ్ల వ్యవస్థ ఎలా వుందో, వారి సాధకబాధకాలు ఎలా వుంటాయో పాలకులు, అధికారులు ఆలోచించవద్దా? కొరియర్ వ్యవస్థ వచ్చాక, చెవి వున్నవాడి కల్లా కర్ణాభరణంలా సెల్‌ఫోన్ వచ్చి చేరాక ఉత్తరాలు, పార్శిళ్లు వ్యాపారం దెబ్బ తిని పోస్టాఫీసులు మూతపడుతున్నాయి. అక్కడ సిబ్బంది నియామకాలు ఆగిపోయాయి. మీ ప్రాంతంలో పోస్టాఫీసు ఎక్కడుందని అడిగితే చప్పున చెప్పలేని పరిస్థితి. పెళ్లి ఆహ్వానపత్రికలు గంపగుత్తగా పంపించడానికి మాత్రమే దాన్ని వెతుక్కుంటూ వెళుతున్నారు. అందుకని సిబ్బంది తగ్గిపోయారు. స్పీడు పోస్టు అయితే తప్ప, ఉత్తరాల బట్వాడా వారానికి రెండు, మూడు రోజులు జరుగుతోందంతే. ఇప్పుడు హఠాత్తుగా వందలాది మంది జనం వచ్చి పోస్టాఫీసులో ఖాతా తెరుస్తాం, డబ్బు కడతాం అంటే వాళ్ల దగ్గర స్టాఫ్ ఏరి?
ఇక బ్యాంకుల పరిస్థితీ అంతే. కంప్యూటరైజేషన్ జరిగాక స్టాఫ్ తగ్గించేశారు. ఉన్నవాళ్లను యిన్సూరెన్సు పాలసీలు అమ్ము, హోమ్ లోన్స్ అమ్ము అంటూ తిప్పుతున్నారు. పైగా కాష్లో పని చేయడం అందరికీ అలవాటుండదు. ఇప్పుడు హఠాత్తుగా కస్టమర్లు కానివాళ్లు కూడా నోట్లతో వెల్లువెత్తితే స్టాఫ్ పుట్టుకుని రారు కదా! శని, ఆదివారాలు పనిచేయాలి, సెలవులు తీసుకోకూడదు అంటే జరిగే పనేనా? ఎటిఎమ్‌లలో డబ్బు తీసుకోండి అంటున్నారు. మామూలుగానే 20% ఎటిఎమ్‌లు పనిచేయవు. ఓ కాబిన్లో రెండుంటే ఒకదానికి ఔట్ ఆఫ్ ఆర్డరు బోర్డు వేళ్లాడుతూ వుంటుంది. పనిచేసే వాటిల్లో చాలా వాటిల్లో క్యాష్ వుండదు. బాలన్సు ఎంత వుందో చెప్తుంది, దగ్గర్లోనే మా బ్యాంకుదే మరో ఏటిఎమ్ వుంది వెళ్లి వెతుక్కో అని చెప్తుంది. ఆదివారం సాయంత్రం చేతులెత్తేసే ఎటిఎమ్లెన్నో వున్నాయి. ఇప్పుడు కుప్పలుతిప్పలుగా జనం వచ్చిపడితే ఎటిఎమ్‌లలో డబ్బు నింపేవారు సరిపోతారా?
అబ్బే యిన్నీ తాత్కాలికమైన యిబ్బందులే, మూడు వారాల్లో అన్నీ సర్దుకుంటాయి అంటున్నారు ఆర్థికమంత్రి. ప్రభుత్వపు పని ఏదీ చెప్పిన కాలానికి పూర్తవదు. మూడు వారాల బదులు ఆరువారాలు కూడా కావచ్చు. ఈలోగా బతకడం ఎలా? ఇన్నాళ్లూ అన్నీ డబ్బుతో వ్యవహరించడానికే అలవాటు చేశారు ప్రభువులు. చెక్కులు, కార్డుల ద్వారా చెల్లింపు చేస్తానంటే బజార్లో బట్టలు, సూపర్ మార్కెట్లో తప్ప వేరే ఏ సరుకూ కొనలేవు. మామూలు షాపు వాణ్ని బిల్లు యిమ్మంటే పైన కొటేషన్ అని రాసిస్తాడు. ఒన్ ఇయర్ గ్యారంటీ అన్నావు కదా, బిల్లు కావద్దా అంటే, యిది చూపించినా చాలు అంటాడు. కార్డు వాడతానంటే కరంటు లేదంటాడు, నెట్ లేదంటాడు, మిషన్ పని చేయటం లేదంటాడు, 2% ఎక్కువ అంటాడు. పక్కనే ఎటిఎమ్ వుంది, క్యాష్ పట్టుకుని వచ్చి యివ్వండి అంటాడు. కార్డుని నమ్ముకుంటే మీ పిల్లాణ్ని డొనేషన్ యిచ్చి కార్పోరేట్ స్కూలులో చేర్చను కూడా చేర్చలేవు.
బ్రిటన్‌లో చూశాను – ఒక పౌండు ఖర్చుపెట్టినా కార్డుతో చెల్లింపు చేయవచ్చు. నగదు పంపిణీపై అదుపు సాధించాలంటే డెబిట్ లేదా క్రెడిట్ కార్డుతో పే చేస్తే 2% ఎక్కువ కాదు, 2% తక్కువ చెల్లించవచ్చు అని ప్రభుత్వం రూలు పాస్ చేయాలి. లక్షలు పెట్టి బంగారం కొన్నవాళ్లు కూడా పన్నులు చెల్లించం, బిల్లు అక్కరలేదు అని చెప్తే దుకాణదారు అమ్మయ్య అనుకుంటున్నాడు. బిల్లు లేకుండా సరుకు అమ్మితే దుకాణదారుణ్ని జైల్లో పెట్టాలి. చెక్ చేసేందుకు తగినంతమంది పన్ను అధికారులు లేరంటే వాళ్లను నియమించాలి. దుకాణాలు ఒకటే కాదు, డాక్టరు, లాయరు, ఆడిటరు ఎవరూ చెక్కుల నిష్టపడరు. అంతా క్యాష్, క్యాష్! నగదు కార్యకలాపాలను స్తంభింపచేయడానికి ఎంతమందిని కావాలంటే అంతమందిని వేయాలి. ఎటిఎమ్ లావాదేవీలకు చార్జి పెట్టిన తర్వాత మాటిమాటికి డబ్బు తీస్తే ఖర్చు పెరుగుతుంది కదాని ఒకేసారి తీసుకుని యింట్లో పెట్టుకుంటున్నాం. అంటే క్యాష్ చలామణీ పెరిగినట్లే కదా. ఆ చార్జీలు పెట్టేవాళ్లకు యీపాటి ఆలోచన రాదా? అవి ఎత్తేసి, యీ రద్దు గురించి ఆలోచించాలి. దేశం అంత వ్యయం చెల్లించలేదు అంటే నేను నమ్మను. ఈ నోట్లన్నీ రద్దు చేసి, మళ్లీ ముద్రించడానికి రూ. 15 వేల నుండి 20 వేల కోట్లు (చిదంబరం గారి లెక్క) ఖర్చు కావటం లేదా? కార్డు చెల్లింపులను ప్రోత్సహిస్తే నోట్ల ముద్రణ వ్యయంలో ఎంతో ఆదా! అయితే కార్డు వినియోగం పెరగాలంటే విద్యుత్, ఇంటర్నెట్ లేదా ఫోను సౌకర్యాలు నిరంతరాయంగా వుండేట్లు చేయాలి.
ఇలాటి పనులు చేయకుండా రద్దు చేస్తే ఏం లాభం? పైగా మళ్లీ 500, 1000 నోట్లు వేయడంతో బాటు 2000 నోటు కూడా తెచ్చారు. పెద్ద నోట్ల కారణంగానే దొంగడబ్బు పోగుపడుతోంది అన్నపుడు 2 వేలు వేయడం ఎంత మూర్ఖత్వం? వాటి కంటె కొత్త డినామినేషన్లు 200, 300ల్లో నోట్లు తెస్తే సరిపోయేది. అమెరికాలో అన్నిటికంటె పెద్ద నోటు 100 డాలర్లు, యుకెలో 100 పౌండ్లు. మనకి మాత్రం 2 వేలెందుకు? ఈ ఒక్క పాయింటుపైనే మోదీ చిత్తశుద్ధిని అందరూ శంకిస్తున్నారు. టీవీ చర్చల్లో బిజెపి సమర్థకులు జవాబు చెప్పుకోలేక ఉక్కిరిబిక్కిరై 'ఇది తాత్కాలికమే, దీన్నీ రద్దు చేస్తారు' అంటున్నారు. రద్దు చేస్తామని చెపితే ఆ నోటు ఎవడైనా తీసుకుంటాడా? విషయమేమిటి బాబూ అని మోదీని అడుగుదామంటే ఆయన యింకో విదేశానికి విజయం చేశారు. వెళ్లేముందు యిచ్చిన ఉపన్యాసంలో 'టెర్రరిజం వ్యాప్తి చేయడానికి పాకిస్తాన్ 500 రూ.ల దొంగనోట్లు చలామణీలో పెట్టింది. ఈ దెబ్బకి వాళ్ల ఖేల్ ఖతమ్' అన్నారు.
ఈ నకిలీ నోట్ల గురించి మనం కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలి. ఈ సమస్యపై ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం చేసి ప్రతి పది లక్షల నోట్లలో 250 మాత్రమే నకిలీవి అని 2016 జూన్‌లో చెప్పింది. దేశంలో రూ.400 కోట్ల నకిలీ నోట్లు చలామణీలో వుంటాయట. ఏటా 70 కోట్లు వచ్చి చేరుతూంటాయి. వాటిలో పోలీసులు పట్టుకునేవి మూడో వంతు మాత్రమే. ఇవన్నీ హోం శాఖ కూడా ఒప్పుకుంది. ఇక పాకిస్తాన్ నేపాల్ ద్వారా మన దేశంలో పంపిణీ చేసే దొంగ నోట్ల మాటకు వస్తే – మన ఆర్బిఐ రూ.29 ఖర్చు పెట్టి వెయ్యి రూపాయల నోటు వేస్తే పాకిస్తాన్ 39 రూ||లు ఖర్చు పెట్టి ఆ నోటు వేస్తుందట. దాన్ని రూ.350-400కి అమ్ముతుంది. 2010 నుంచి విదేశాల్లోంచి వచ్చి పడిన నకిలీ నోట్ల విలువ రూ.1600 కోట్లని మన యింటెలిజెన్సు వర్గాలు చెప్తున్నాయి. (మన దగ్గర తయారయ్యే నల్లధనికులు ఎగ్గొట్టే ఆదాయపు పన్ను వలన కలిగే ఆర్థిక నష్టంతో పోలిస్తే యీ 1600 కోట్లు ఒక లెక్కా?) ఈ దొంగనోట్లు యిప్పటికే వినియోగంలో వున్నాయి కాబట్టి మన జేబులో వున్నవాటిల్లో, మనకు ఎటిఎమ్లో వచ్చినవాటిల్లో కూడా అవి వుండవచ్చు. వాటిని మార్చుకోబోతే, బ్యాంకువాళ్లు కనిపెడితే (యీ హడావుడిలో ప్రతీ నోటూ చెక్ చేసే సమయం వారికెక్కడిది లెండి), నష్టపోయేది మనం! దొంగనోట్లను అరికట్టలేకపోవడం ప్రభుత్వవైఫల్యం. దండన మాత్రం మనకు! ఇప్పుడు వేస్తున్న కొత్త నోట్లకు మాత్రం నకిలీలు తయారవ్వవన్న గ్యారంటీ వుందా? క్రెడిట్ కార్డులకే క్లోనింగ్ చేసేస్తున్నారు. నెట్‌బ్యాంకింగ్‌లో మోసాలు జరుగుతున్నాయి. క్యాష్ అచ్చేయడం ఓ లెక్కా? మరి అప్పుడీ కసరత్తంతా ఎవరి కోసం?
నిజానికి నల్లధనం అరికట్టాలనే చిత్తశుద్ధే వుంటే రాజకీయ పార్టీలు తమకు విరాళాలు యిచ్చేవారి పేర్లు ప్రకటించాలి. వాళ్లు అది చేయరు. మనం మాత్రం త్యాగాలు చేయాలి. చంద్రబాబుగారు చూడండి. తనకు దీని గురించి ఉప్పు అందగానే (వెంకయ్యనాయుడు ద్వారా అంటున్నారు), యీ సూచన తనే యిస్తున్నట్లు అక్టోబరు 12 న బహిరంగంగా అందరికీ చెప్పారు. బయటకు చెప్పవలసిన పనేముంది? లేఖ రాసి వూరుకోవచ్చుగా! 'మీ దగ్గరున్న డబ్బును స్థలాల, బంగారం రూపంలో మార్చుకోండి' అని నల్లధనికులను హెచ్చరించడం కాకపోతే! టీవీ చర్చలో తెరాస నాయకుడు భానుప్రసాద్ చెప్పారు – వారం రోజులుగా రాజకీయ నాయకుల మధ్య యీ చర్చ జరుగుతోందని. ఆర్నెల్లగా దీని గురించి చర్యలు తీసుకుంటున్నపుడు ఎక్కడో అక్కడ సమాచారం లీకవడంలో వింతేముంది?
నల్లధనం దాచుకునేందుకు మంచి సాధనం – బంగారం! ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే, అక్కడ నగదు లావాదేవీలను నిషేధించాలి. షాపులపై, స్వర్ణకారులపై నిఘా వేసి, పది గ్రాముల బంగారమైనా సరే ఎవరెవరు కొంటున్నారో వివరాలు సేకరించాలి. అది జరిగిందా? ఇప్పుడు యీ రద్దు తర్వాత 10 గ్రా.ల బంగారం 50 వేల చొప్పున కొనేస్తున్నారట. ఈ నోట్లు తీసుకున్న బంగారం షాపుల వాళ్లందరూ వాటిని ఎలా ఎన్‌క్యాష్ చేసుకోగలరో తెలియటం లేదు. ఏదో ఒక మార్గం వుండే వుంటుంది. లేకపోతే ఎందుకు తీసుకుంటారు? ఇక స్థలాలు, యిళ్లు కొనేటప్పుడు యిష్టం లేకపోయినా నల్లధనం ప్రసక్తి వస్తుంది. దానికి కారణం – విపరీతమైన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు. అది రాష్ట్రప్రభుత్వ పరిధిలోని అంశమే కావచ్చు. కేంద్రం మరోలా పరిహారం యిచ్చి వాటిని అవి తగ్గిస్తే అసలు ధరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఆ డబ్బు ప్రధాన స్రవంతిలోకి వస్తుంది. బంగారు నగల కొనుగోళ్లపై పన్ను బాగా తగ్గించిన తర్వాతనే బిల్లు తీసుకోసాగారు చాలామంది. గతంలో అయితే బిల్లు వద్దు బాబోయ్ అనేవారు. అలాగే స్టాంపు డ్యూటీ తగ్గించి, రిజిస్ట్రేషన్లు చెక్కుల ద్వారా జరగాలని రూలు పెట్టాలి.
బంగారం, స్థలాలు కొనడం మధ్యతరగతి వాళ్లకు తెలిసున్న మార్గాలు. భారీ స్థాయిలో ధనికులు దాచుకునేది విదేశాలలో, పన్నులు లేని దేశాల్లో డబ్బు దాచుకోవడం, దాన్నే విదేశీ పెట్టుబడుల రూపంలో మళ్లీ దేశానికి తీసుకుని వచ్చి రాయితీలు పొందడం! ఆహా మా పాలనాసామర్థ్యం చూసి విదేశీయులు యిక్కడ పెట్టుబడి పెట్టేస్తున్నారని పాలకులు జబ్బలు చరుచుకోవడం. పేర్లు చూడబోతే అన్నీ భారతీయుల పేర్లే. ఇవన్నీ పాలకులకు తెలియదా? స్విస్ బ్యాంకులు ఇండియన్ ఖాతాదారుల పేర్లు చెప్పటం లేదు అని వాపోయే బదులు, తక్కిన దేశాల నుండి పెట్టుబడి పెట్టడానికి వచ్చిన భారతీయులను 'ఇక్కడ దాచుకోకుండా అక్కడెందుకు దాచుకున్నావ్?' అని అడగవద్దా? అలా డిపాజిట్ చేసే అవకాశం తీసిపారేస్తే ఆ డబ్బు దేశంలోనే వుంటుంది కదా. ప్రవాస భారతీయులు పెట్టుబడి పెడతానని వచ్చినా 'అసలు నీ ఆదాయమెంత? ఇంత ఎలా దాచుకున్నావ్? మా వాళ్లెవరైనా పట్టుకుని వచ్చి నీకిచ్చారా?' అని అడగవచ్చుగా. అతని ఆదాయానికి, యిక్కడ పెట్టే పెట్టుబడికి లంగరందక పోతే యిక్కడి బ్లాక్‌మనీయే రంగు మార్చుకుని ఆ రూపంలో వస్తోందని యిట్టే పట్టుకోవచ్చు. ఇలాటివి ఎన్నో చేసిన తర్వాత అప్పుడు నోట్ల రద్దు చేపడితే నల్లధనికులను అష్టదిగ్బంధం చేసినట్లయ్యేది. అప్పుడు వాళ్లు ఆ నోట్లను తగలెబట్టుకోవడమో ఏదో చేసేవారు.
అది చేయకుండా పబ్లిసిటీ కోసం చేసినట్లయింది యిది. ఈ హంగామాకు బదులు వెయ్యి రూపాయలను మొదటగా రద్దు చేసి చూడాల్సింది. అది కూడా హఠాత్తుగా చేయనక్కరలేదు, గడువు యివ్వవచ్చు. ఫలానా తేదీలోగా మీ బ్యాంకు ఖాతాల్లో వేసుకోండి, తర్వాత పని చేయదు అని చెప్పవచ్చు. ఆ తర్వాత 500 రూ.లను కూడా గడువిచ్చి రద్దు చేయవచ్చు. గడువిస్తే కొంప మునిగిపోతుంది అనే భయమే అక్కరలేదు. ఇప్పుడు డిసెంబరు 30 వరకు యిచ్చారుగా, (దాన్ని పొడిగించవచ్చు కూడా). యీ లోపున ఏం చేయడానికి సావకాశం వుందో గడువు తర్వాత రద్దు చేసినా అదే ఫలితం! బ్యాంకుల్లో ఎంతైనా డిపాజిట్ చేద్దామంటే కుదరదు. కెవైసి ఫారమ్ పూర్తి చేయకపోతే ఒక లిమిటుకి మించి డిపాజిట్ చేయడానికి లేదు. గడువు యిచ్చి రద్దు చేసి వుంటే యిలాటి కెవైసి వంటి లొసుగులు లేకుండా జనాలు జాగ్రత్తపడేవారు.
ఇలాటి కేసుల్లో నోట్ల మార్పిడీకి రకరకాల మార్గాలు పడతారు. ముంబై, కలకత్తాలో సూటుకేసు కంపెనీ వాళ్లు హైదరాబాదు వచ్చి పాతబస్తీ కేంద్రంగా హవాలా నడుపుతున్నారట. మీరిచ్చిన బ్లాక్‌మనీలో సగం భాగాన్ని వాళ్లు బంగారం, డాలర్లు రూపంలో తిరిగి యిస్తారట. తక్కిన 50% వాళ్లది. వాళ్లు కాగితాల మీద కంపెనీలు నడుపుతూంటారు. చేసే బిజినెస్ ఏదీ లేకపోయినా ఖాతాల్లో డబ్బు వేసినట్లు, తీసినట్లు అంకెలు చూపిస్తూ వుంటారు. ఈ నల్లడబ్బును తమ వ్యాపారంలో భాగంగా తీసుకున్నట్లు చూపిస్తారు. ప్రతీ ఏడూ ఇన్‌కమ్‌టాక్స్ కట్టేవేళ కొన్ని ట్రస్టులు కూడా వచ్చి యిలాటి ఆఫర్లు యిస్తాయి. వాళ్లకిచ్చే విరాళాలపై ఐటీ ఎంగ్జెప్షన్ వుంటుంది. మనం విరాళమిస్తే, తమ పేరు వాడుకొన్నందుకు కొంత వుంచుకుని మళ్లీ వెనక్కి యిచ్చేస్తారు. విరాళం మేరకు మనకు టాక్సులో రిబేటు వస్తుంది.
1972లో భూ సంస్కరణలు వచ్చినపుడు చూశాను – రాత్రికి రాత్రి మొగుడూ పెళ్లాం విడిపోయి, మేం వేర్వేరు కుటుంబాలని చూపుకున్నారు. పాలేర్ల, పనివాళ్ల, డ్రైవర్ల పేర ఎకరాల కెకరాలు రాసేశారు. ఇప్పుడూ అదే చేస్తారు. 'ఇదిగో పది వెయ్యి రూ.ల నోట్లు, బ్యాంకు కెళ్లి కూలీ నాలీ చేసి దాచుకున్నదని చెప్పు. కొత్త నోట్లు తీసుకో. 2500 నువ్వుంచుకో, తక్కినది నాకియ్యి' అంటాడు నల్లధనికుడు. అప్పనంగా రెండున్నర వేలు వస్తున్నందుకు పేదవాడు ఖుష్. నా అనుమానం జన్‌ధన్ యోజనా కింద తెరిచిన ఖాతాల్లో యిప్పుడు హఠాత్తుగా యాక్టివిటీస్ పెరిగిపోతాయని. మొన్నటిదాకా దాన్లో ఆపరేషన్స్ లేక, పై అధికారుల ఒత్తిడి తట్టుకోలేక బ్యాంకు అధికారులే రూపాయిరూపాయి చొప్పున వేశారు. ఇప్పుడా అవసరం పడదు. ఆ ఖాతా వున్నవాళ్లందర్నీ నల్లధనికులు వెతికి పట్టుకుని మార్పిడికి వాడుకుంటారు. దీన్ని అరికట్టడం ఎవడి తరం కాదు. వచ్చినవాళ్లను పరిశీలించి, పరీక్షించి, వివరాలు రాసుకుని కానీ నోట్లు మార్చవద్దు అని బ్యాంకు సిబ్బందికి చెప్పినా ఆచరణలో అది సాధ్యం కాదు. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర సర్వే చేపట్టినపుడు సర్వేయరు వంటింట్లోకి వెళ్లి ఎన్ని సిలండర్లు వున్నాయో కూడా లెక్క పెట్టి రాసుకుంటాడు, పెరట్లోకి వెళ్లి కోళ్లను లెక్కిస్తాడు అని చెప్పారు. ఆచరణకు వచ్చేసరికి వాళ్లు వంటింటికి కాదు కదా, యింటి గుమ్మంలోకైనా రాలేదు. ఓ కుర్రాడు వీధి చివర బల్ల వేసుకుని కూర్చుని మీరు చెప్పిందే రాసుకున్నాడు.
వ్యవస్థలో లోపాలు సవరించకుండా, తగినంతమంది సిబ్బందిని నియమించకుండా, మెరుపుదాడిలా నోట్ల రద్దు చేపట్టడం జరిగిందని తోస్తోంది. అందుచేత దీని ఫలితం పట్ల అందరికీ సందేహాలున్నాయి. పైన చెప్పిన దగుల్బాజీ మార్గాలు అనేకం వున్నాయి కాబట్టే పెద్ద నోట్ల రద్దు విఫలమౌతోంది. 1978లో జనతా ప్రభుత్వం రద్దు చేసిన తర్వాతి ప్రభుత్వాలన్నీ నల్లధనం అరికట్టడానికి యిది కిట్టుబాటు మార్గం కాదని తేల్చుకుని ఆగిపోయాయి. పెద్ద తలకాయలు ఎలాగో జాగ్రత్త పడి వుంటారు. దీని వలన మధ్యతరగతి, లంచాలు పట్టే ఉద్యోగివర్గం, పన్నులు ఎగ్గొట్టే వ్యాపార, వాణిజ్య వర్గాలు మనీలాండరింగ్ ఖర్చులు భరించాల్సి వస్తుంది కాబట్టి కొంతమేరకు నష్టపోతాయి. పూర్తిగా నష్టపోతాయని మాత్రం నమ్మబుద్ధి కావటం లేదు. బినామీల జోరు పెరిగి ఓ తరహాలో సంపద పంపిణీ జరుగుతుంది. అంటే పైన చెప్పిన ఉదాహరణలో గతంలో నల్లధనికుడి వద్ద పదివేల బ్లాక్‌మనీ వుంటే యిప్పుడది నల్లధనికుడి వద్ద ఏడున్నరవేలు, జన్‌ధన్ యోజనా ఖాతాదారుడి పేర రెండున్నర వేలు వైట్‌మనీగా మారుతుంది. ఈ రద్దు, మళ్లీ ముద్రణ కారణంగా పెద్ద నోట్ల చలామణీ, క్యాష్ వాడకం ఆగదు. నోటు సైజు మారుతోందంతే. ఇంకో ఆర్నెల్లు పోయేసరికి మళ్లీ నల్లధనం పోగుపడవచ్చు. నోట్లను కాకుండా, కాష్ ట్రాన్సాక్షన్లను రద్దు చేయకపోయినా, నియంత్రించినప్పుడే నల్లధనం అదుపులోకి వస్తుంది. ఇక టెర్రరిజాన్ని అరికట్టడానికి వుపయోగపడుతుందన్న వాదనకి వస్తే, నిఘా వ్యవస్థను మెరుగు పరచాలి తప్ప యీ రద్దు వలన టెర్రరిజం మాసిపోతుందంటే ఎలా నమ్మగలం? మనసుండాలే కానీ పాకిస్తాన్ ఉగ్రవాదులకు బంగారం రూపంలోనో, మరో రూపంలోనో నిధులు సమకూర్చలేదా? ఇవన్నీ లెక్క వేసి చూస్తే ప్రస్తుత చర్య పాలకుల పబ్లిసిటీకి, పబ్లిక్ అగచాట్లకూ మాత్రమే పనికి వస్తుందనిపిస్తోంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2016)