తెలుగు సినిమా సెలబ్రిటీ ఒకరు, విశాఖ జిల్లా వేంపాడు ప్రాంతంలో భారీగా భూములు కొన్నారన్న గ్యాసిప్ గుప్పుమంటోంది. విశాఖ జిల్లా నక్కపల్లికి సమీపంలో వేంపాడు వుంది. ఇది విశాఖకు 70 కిలోమీటర్ల దూరంలో వుంది. వేంపాడుకు బంగాళాఖాత తీరం బాగా దగ్గరే. ఈ వేంపాడుకు, బంగాళఖాత తీరానికి మధ్యలో సుమారు వంద ఎకరాల వరకు ఓ సినిమా సెలబ్రిటీ కొన్నారని టాక్ వినిపిస్తోంది.
సరే, సినిమా జనాలు డబ్బులుంటే భూములు కొనుక్కోవడం ఏమీ అబ్బురం కాదు. కానీ ఇలా భూములు ఇక్కడ సేకరించడం వెనుక భారీ స్కీమ్ వుందని టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ కు సంబంధించినంత వరకు ఇన్ ఫాస్ట్రక్చర్ అంతా హైదరాబాద్ లోనే వుంది. చెన్నయ్ నుంచి హైదరాబాద్ కు తరలి వచ్చాక, ప్రభుత్వం కల్పించిన రాయతీలు అందుకుని, ఇక్కడ సినిమా రంగానికి కావాల్సిన ఇన్ ఫాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేయగలిగారు కొందరు.
అయితే అలాంటి ఇన్ ఫాస్ట్రక్చర్ అంతా కొందరి చేతుల్లోనే, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, ఒక వర్గం చేతుల్లోనే వుండిపోయిందన్న గుసగుసలు తరుచు ఇండస్ట్రీలో వినిపిస్తుంటాయి. ఆంధ్ర ఎలాగూ విడిపోయింది కనుక విశాఖ ప్రాంతంలో సినిమా పరిశ్రమను మెలమెల్లగా అభివృద్ధి చేయాలని టాలీవుడ్ జనాలు కొందరికి వుంది.
అందులో భాగంగా కొంతమంది సినిమా, రాజకీయ ప్రముఖలు కలిసి, ముందస్తుగా విశాఖ ప్రాంతంలో సినిమా సంబంధిత వ్యవహారాల కోసం కొంత భూమి సేకరించి వుంచే పనిలో పడ్డారని వినికిడి. ఇందులో భాగంగానే విశాఖ కు చెందిన ఓ రాజకీయ ప్రముఖుడి అండతో ఓ సినిమా సెలబ్రిటీ ఈ వంద ఎకరాలు సేకరించారని టాక్.
అయితే ఈ వంద ఎకరాలు అతని పేరుమీదే వున్నాయా? లేక వేరే వాళ్ల పేరు మీద వున్నాయా అన్నది తెలియదు.ఇటీవల తన ఆదాయం అంతా ఈ భూముల మీద ఆ సెలబ్రిటీ పెట్టినట్లు తెలుస్తోంది. సాధారణంగా భూములు కొనుగోలు చేసారు అని వదంతులు వినిపిస్తాయి కానీ, ఈ వేంపాడు ప్రాంతంలో అని ఊరు పేరు కూడా ఇండస్ట్రీ జనాల గుసగుసల్లో వినిపించడం ఆశ్చర్యంగా వుంది మరి.