రవితేజ కథ మళ్లీ మొదటికి

ఖాళీగా అయినా వుంటా కానీ పారితోషికం విషయంలో తగ్గేదే లేదంటున్నాడు మాస్‌ మహారాజా రవితేజ. అందుకే ఏడాదిగా అతని సినిమా ఏదీ పట్టాలెక్కలేదు. దిల్‌ రాజు దగ్గర్నుంచి చాలా మంది నిర్మాతలు రవితేజకో నమస్కారం…

ఖాళీగా అయినా వుంటా కానీ పారితోషికం విషయంలో తగ్గేదే లేదంటున్నాడు మాస్‌ మహారాజా రవితేజ. అందుకే ఏడాదిగా అతని సినిమా ఏదీ పట్టాలెక్కలేదు. దిల్‌ రాజు దగ్గర్నుంచి చాలా మంది నిర్మాతలు రవితేజకో నమస్కారం పెట్టేసి తప్పుకున్నారు. అతను అడిగే పారితోషికం ఏమాత్రం రీజనబుల్‌గా లేదనేది నిర్మాతల భావన.

కానీ రవితేజ మాత్రం తానెక్కిన చెట్టు దిగేదే లేదంటున్నాడు. ఎవరైతే చెట్టెక్కి తనని అందుకుంటారో వారితోనే సినిమా అంటున్నాడు. ఇండస్ట్రీతో అంతగా సంబంధాలు లేని పారిశ్రామికవేత్తలని రంగంలోకి దించాలని ట్రై చేస్తున్నాడు. అయితే గుడ్డిగా రవితేజ సినిమాపై పెట్టుబడి పెట్టడానికి ఎవరూ అమాయకులు కాదుగా.

బాబీ డైరెక్షన్‌లో రవితేజ చేద్దామనుకున్న సినిమాకి అన్నీ ఓకే అనుకున్నారు. కథ మొత్తం రెడీ అయిపోయింది. కానీ బడ్జెట్‌ లెక్క వేసేసరికి నిర్మాత గుడ్లు తేలేసాడట. పారితోషికాలతో కలిపి నలభై అయిదు కోట్లపైనే అవుతుందంటే, ఏమాత్రం ఖర్చు పెరిగినా యాభై దాటేస్తుంది. రవితేజ సినిమాపై పాతిక తిరిగొస్తే అమోఘం అన్నట్టుంది పరిస్థితి. ఈ నేపథ్యంలో పాతికకి టోపీ పెట్టించుకునేదెవరు? అందుకే రవితేజ సినిమా కథ మళ్లీ మొదటికి వచ్చేసింది.