500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసినట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించి, 24 గంటలు పూర్తయ్యింది. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అప్పటికే దేశ ప్రజానీకం అంతా 'పానిక్' అయ్యారు. 'సేఫ్ జోన్'లో వున్నవాళ్ళేమో, హ్యాపీ హ్యాపీగా నరేంద్రమోడీ నిర్ణయాన్ని అభినందించేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల మోజులో పడి, మన మీడియా పండగ చేసుకుంది. జనం పాట్లు ఎవరిక్కావాలి.!
అసలు, ఈ 24 గంటల్లో ఏం జరిగింది.?
– పొద్దునే పాల ప్యాకెట్ కొనడం దగ్గర్నుంచి, సాయంత్రం నిద్రపోయేదాకా సామాన్యుడు నరకం చూసేశాడు.
– అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్ళాల్సి వచ్చినా, అంతకు ముందే సిద్ధం చేసుకున్న వెయ్యి, ఐదు వందల నోట్ల కట్టలు చెల్లవని తెలిసి, ఆసుపత్రి పనుల్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో బాధిత కుటుంబాలు అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు.
– చేతిలో 500, 1000 రూపాయల నోట్లు పట్టుకుని, చిల్లర కోసం నానా పాట్లు పడ్తున్నవారిని వంచించేందుకు 'మాఫియా' రంగంలోకి దిగింది. 500 రూపాయల నోటుకి 300 నుంచి 400 వరకూ ఇచ్చారు. అదే వెయ్యి రూపాయలకి అయితే 600 నుంచి 800 వరకూ ఇచ్చారు. తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్ళిన భక్తులు, ఈ క్షవరానికి బాగా బుక్కయిపోవాల్సి వచ్చింది.
– 300 రూపాయలు ఖర్చయ్యే పనికి, 500 నోటు ఇచ్చి ఊస్సూరుమంటూ వెనక్కి రావాల్సిన దుస్థితి. ఈ దుస్థితిని ఎదుర్కొన్నవారిలో సొంత ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళినవారే ఎక్కువమంది వున్నారు.
– డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేవారు సైతం, పరిస్థితిని బాగా క్యాష్ చేసుకున్నారు.
– ఇక పాత నోట్లు ఎక్కడా మారవేమోనన్న భయంతో పెద్ద మొత్తాల్లో ఆ నోట్లను కలిగి వున్నవారు సైతం, అక్రమార్కుల చేతిలో చిక్కుకుని 'చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం..' అంటూ ఉస్సూరుమన్నారు.
ఇదీ తొలి 24 గంటల్లో పరిస్థితి. నేరాలు ఘోరాల్లో ఇవి కొన్ని మాత్రమే.. రేపు బ్యాంకులు పనిచేస్తాయి. ఆ తర్వాత కథేంటన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. బ్యాంకుల్లో సొమ్ములు మార్చుకున్నా ముందుగా ఇచ్చే మొత్తం కేవలం 4 వేల రూపాయలేనట. ఆ 4 వేల రూపాయలతో అవసరాలు ఎలా తీరతాయో.! మళ్ళీ సమస్య మొదటికి. ముందస్తుగా 100 రూపాయల నోట్లను పెద్దమొత్తంలో అందుబాటులో వుంచి వుంటే ఈ పరిస్థితి వచ్చి వుండేది కాదేమో.