టాలీవుడ్ లో అంత డబ్బు లేదా?

మోడీ సడెన్ గా పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో టాలీవుడ్ జనాలకు పెద్ద ఇబ్బంది అన్నది టాక్. అయితే ఇప్పటికిప్పుడు టాలీవుడ్ జనాలకు పెద్దగా ఇబ్బంది వుండదని, కానీ సినిమాల విడుదల, అమ్మకాలు, వంటి…

మోడీ సడెన్ గా పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో టాలీవుడ్ జనాలకు పెద్ద ఇబ్బంది అన్నది టాక్. అయితే ఇప్పటికిప్పుడు టాలీవుడ్ జనాలకు పెద్దగా ఇబ్బంది వుండదని, కానీ సినిమాల విడుదల, అమ్మకాలు, వంటి విషయాల్లో మాత్రం ఇబ్బంది వుంటుందని టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం మరేమీ కాదు. టాలీవుడ్ లో ఇప్పుడు లిక్విడ్ క్యాష్ అన్నది బాగా తగ్గిపోయిందట. 

ఎప్పటికి అప్పుడు అడ్జెస్ట్ మెంట్ కోసం డబ్బులు తెచ్చి ఖర్చు చేయడమే తప్ప, నిర్మాతలు ఎవరి దగ్గరా అంత మనీ స్టాక్ మాత్రం లేదట. అందువల్ల భారీ మొత్తంలో పెద్ద నోట్లు వుండిపోయాయి, ఎలా మార్చుకోవడం అన్న సమస్య లేదట. ఒక వేళ వున్నా, ఒక సినిమాపై ఆధారపడి కనీసం వెయ్యి మంది వరకు వుంటారని, ఒక్కొక్కరికి పది వేలు పేమెంట్ చేసినా పది కోట్ల వరకు ఖాళీ అయిపోతాయని, అయినా అంత సీన్ ఇప్పుడు టాలీవుడ్ ప్రొడ్యూసర్ల దగ్గర లేదని వినిపిస్తోంది. 

ఇప్పటికిప్పుడు పది వేల లాంటి చిన్న మొత్తం ఎవరికి ఇచ్చినా ఇబ్బంది రాదని, డిసెంబర్ 30 లోగా మార్చేసుకుంటారని, అందువల్ల సినిమా జనాల దగ్గర ఒకటికి వందసార్లు లెక్క పెట్టినా, వంద కోట్లు వున్నా, డిసెంబర్ 30 లోగా చెల్లుబాటు అయిపోతుందని అంటున్నారు. 

పేరుకు భారీ నిర్మాతలు వున్నారు కానీ, 99శాతం మంది ఫైనాన్స్, బ్యాంకు రుణాలపైనే వున్నారని, ఎవరి దగ్గరా మహా అయితే లక్షల్లో పెద్ద నోట్లు వుండాలి కానీ, కోట్లలో వుండదని అంటున్నారు. అది కూడా ఒకరిద్దరు నిర్మాతల దగ్గరే వుంటుంది తప్ప మిగిలిన వారి దగ్గర వుండదని టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ వ్యవహారం అంతా పైకి షో నే తప్ప, వాస్తవంలో అంత సీన్ లేదంటున్నారు. 

ఇదిలా వుంటే టాలీవుడ్ లో ఈ రోజు చాలా మంది పాత పేమెంట్లు సెటిల్ చేసినట్లు తెలుస్తోంది. తమ దగ్గర వున్న లక్ష, రెండు లక్షలు కూడా మార్చుకునే బాధ కన్నా, ఎవరికి కచ్చితంగా ఇవ్వాలో గుర్తు చేసుకుని, పిలిచి మరీ చెల్లించేసినట్లు తెలుస్తోంది. వేలు అన్నది పెద్ద మొత్తం కాదు కనుక, టాలీవుడ్ లో ఈ రోజు అలాంటి చలామణీలు చాలా పెద్ద ఎత్తునే జరిగినట్లు తెలుస్తోంది.

అయితే భవిష్యత్ లో బ్లాక్ లో పేమెంట్లు తగ్గిపోతాయని, ఆ మేరకు సినిమా జనాలు కూడా అలవాటు పడతారని అంటున్నారు. హీరోలు, డైరక్టర్లకే భారీగా బ్లాక్ మనీ చేరుతుందని, ఇకపై వారు టాక్స్ కట్టేయడం అలవాటు చేసుకుంటారని, మహా అయితే డిమాండ్ వున్న హీరోలు టాక్స్ కూడా ఫీజుగా వసూలు చేసేస్తారని అంటున్నారు. ఇప్పటకే ఓ రేంజ్ హీరోల అగ్రిమెంట్ లు అలాగే వున్నాయని గుర్తు చేస్తున్నారు. కోటి రూపాయిలు పారితోషికం వుంటే, టాక్స్ కట్టేసి, కోటి నికరంగా వచ్చేలా ఇస్తున్నారని, పెద్ద హీరోలకు కూడా అలాగే చేస్తారని అంటున్నారు. దీనివల్ల నిర్మాతలు లెక్కలు పక్కా చూపించడం, టాక్స్ పే చేయడం ఒక్కటే సమస్య కావచ్చని టాక్. 

ఇప్పటికే కార్పొరేట్ సంస్కృతి మెలమెల్లగా టాలీవుడ్ లోకి వస్తోందని, రాను రాను ఇది పెరిగితే బ్లాక్ మనీ అన్నది తగ్గుతుందని, ఆన్ లైన్ టికెట్ బుకింగ్ అన్నది పూర్తి స్థాయిలో అమలు జరిగిపోతే, ఇక రెండు రకాల పద్దులు, వ్యవహారాలు వుండవని అంటున్నారు కొందరు నిర్మాతలు.