నిఖిల్‌రెడ్డి.. పరిచయం అక్కర్లేని పేరిది. ఎత్తు పెరగాలన్న కోరికతో, ఎంచక్కా వున్న కాళ్ళను నరికించేసుకున్నాడు. అవును నమ్మలేని నిజమిది. రెండు కాళ్ళనీ నరికేసి, వాటికి స్క్రూలు బిగించేసి.. వాటి సాయంతో హైట్ పెంచేస్తామని డాక్టర్లు చెప్పగానే, ఎగిరి గంతేశాడు. ఇప్పుడు నడవలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ దారుణానికి పాల్పడిన వైద్యుడు చంద్రభూషణ్ని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రెండేళ్ళ ప్రాక్టీస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం విదితమే.
'మా ఆసుపత్రిపై కేసులు వేస్తారా.? మా డాక్టర్ని సస్పెండ్ చేయిస్తారా.?' అంటూ ఆగ్రహావేశాలతో ఊగిపోయిన ఓ కార్పొరేట్ ఆసుపత్రి (ఇందులోనే నిఖిల్‌కి సర్జరీ జరిగింది), నిఖిల్‌కి వైద్యాన్ని నిలిపేసింది. నిఖిల్ సర్జరీపై జరిగిన రచ్చ నేపథ్యంలో, నిఖిల్‌కి ఇంటివద్దే వైద్య చికిత్స అందించేందుకు ముందుగా సదరు కార్పొరేట్ ఆసుపత్రి అంగీకరించినా, ఇప్పుడు 'మాకేంటి సంబంధం.?' అంటూ చేతులు దులిపేసుకుంది.
కాళ్ళలోని ఐరన్ ప్లేట్స్ ఇంకా అలాగే వుండడం, వాటికి తరచూ ఇన్ఫెక్షన్ సోకుతుండడంతో ఎప్పటికప్పుడు డ్రెస్సింగ్ చేయించుకుంటుండాల్సిందే. సర్జరీ చేసిన వైద్యుడి పర్యవేక్షణలోనే ఇదంతా జరగాలి. లేదా, సర్జరీ చేసిన ఆసుపత్రే ఆ బాధ్యతను తీసుకోవాలి. కానీ, ఇక్కడ అలాంటిదేమీ జరగడంలేదని నిఖిల్ తల్లిదండ్రులు వాపోతున్నారు. చేసిన తప్పు తెలుసుకుని నిఖిల్ కుమిలిపోతుంటే, అతని దీనావస్థని చూసి అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతుండడం అత్యంత బాధాకరం.
ఇంతా జరుగుతున్నా, వైద్యుడి మీద చర్యలు తీసుకోవడం.. అది కూడా రెండేళ్ళ సస్పెన్షన్‌తో సరిపెట్టారే తప్ప, సదరు కార్పొరేట్ ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోలేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక్కటి మాత్రం నిజం. నిఖిల్‌రెడ్డి చాలామందికి పెద్ద గుణపాఠం. ఆయనే ఈ విషయాన్ని చెబుతున్నాడు. అదే సమయంలో, వైద్య రంగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన తక్షణావసరం ఏర్పడిందిప్పుడు. కానీ, పాలకులు ఆ పనిని చిత్తశుద్ధితో చేస్తారా.? నిఖిల్‌రెడ్డికి కాళ్ళు పోయాయి.. చాలామందికి ప్రాణాలు పోతున్నాయ్.. వైద్యుడంటే దేవుడు కాదు.. వైద్యుడంటే రాక్షసుడు.. ఇది అందరి విషయంలోనూ కాకపోయినా, చాలామంది విషయంలో నూటికి నూరుపాళ్ళూ నిజం.