సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం విదితమే. సినీ రంగంలో ఇటు నందమూరి అభిమానులకీ, అటు మెగా అభిమానులకీ మధ్య ఆధిపత్య పోరు అయితే చాలాకాలంగా వుంది. కానీ, చిరంజీవిగానీ బాలకృష్ణగానూ సినీ రంగం పరంగా ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోలేదు. ఎప్పుడన్నా ఎలాంటి వివాదాలన్నా వచ్చినా.. ఇద్దరూ ఆయా వివాదాల్ని సద్దుమణిగేలా చేసేసేవారు. 'మేం కలిసే వున్నాం.. మీరెందుకు కొట్టుకుంటారు.?' అని బాహాటంగానే ఆయా హీరోలు వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి.
ఇప్పుడేమో, కొందరు పనిగట్టుకుని పవన్‌కళ్యాణ్‌కీ – బాలకృష్ణకీ మధ్య వివాదం రాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అనంతపురం జిల్లాలో పవన్‌కళ్యాణ్ త్వరలో ప్రత్యేక హోదా కోసం బహిరంగ సభ నిర్వహించనున్న విషయం విదితమే. ఈ సభని బాలకృష్ణకి వ్యతిరేకంగా.. అనే కలర్ ఇచ్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో హిందూపురం అనేది ఓ నియోజకవర్గం మాత్రమే. అంతమాత్రాన, బాలయ్యకు వ్యతిరేకంగా పవన్ సభ పెడుతున్నాడంటే ఎలా.?
ఇంతవరకూ చంద్రబాబునే పవన్‌కళ్యాణ్ రాజకీయంగా విమర్శించిన దాఖలాల్లేవు. అనంతపురంలో అయినా పవన్‌కళ్యాణ్, టీడీపీని విమర్శిస్తారా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ముందస్తుగా బాలకృష్ణ అభిమానుల్ని, పవన్‌కళ్యాణ్ సభపైకి ఉసిగొల్పే ప్రయత్నాలైతే గట్టిగానే జరుగుతున్నాయన్నది నిర్వివాదాంశం. మరి, ఈ వివాదం చినికి చినికి గాలి వాన అవుతుందా.? నిప్పు రాజేసి చోద్యం చూడాలనే ఆ 'కొందరి' పైత్యం వికటిస్తుందా.? పనిచేస్తుందా.? వేచి చూడాల్సిందే.