బాలయ్య ఆర్డర్ – రీషూట్ శాతకర్ణి

గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా హీరో బాలకృష్ణకు వందో సినిమా మాత్రమే కాదు, అంతకు మించి. ఎందుకంటే వందో సినిమాగా మామూలు జోనర్ సినిమా ఏదో ఒకటి చేసి వుంటే పెద్ద సమస్య లేదు.…

గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా హీరో బాలకృష్ణకు వందో సినిమా మాత్రమే కాదు, అంతకు మించి. ఎందుకంటే వందో సినిమాగా మామూలు జోనర్ సినిమా ఏదో ఒకటి చేసి వుంటే పెద్ద సమస్య లేదు. కానీ ఇలాంటి చారిత్రక సినిమాను ఎంచుకోవడంతోనే కత్తిమీద సవాల్ మొదలైంది. నిజానికి ఇలాంటి సినిమానే వందో సినిమా అనే మైలురాయిగా వుండాల్సింది. పైగా బాలయ్య లాంటి కొద్దిమంది మాత్రమే ఇలాంటి సినిమా చేయగలరు. 

కానీ ఇక్కడ క్రిష్ తో సమస్య వుంది. ఇలాంటి చారిత్రక, జానపద సినిమాల్లో ఎమోషన్ పీక్స్ లో వుండాలి. కామన్ ప్రేక్షకుడు కూడా లేచి ఈల వేయాలి. అలాంటి టాలెంట్ రాజమౌళి దగ్గర వున్నంతగా క్రిష్ దగ్గర లేదన్నది వాస్తవం. క్రిష్ వ్యవహారం అంతా మానవ సంబంధాలు, భావోద్వేగాలు, సున్నిత సంబంధాల చుట్టూ తిరుగుతుంది. ఇలాంటివి మల్టీఫ్లెక్స్ ఆడియన్స్ కు నచ్చినంతగా బిసి సెంటర్ ఆడియన్స్ కు నచ్చవు.

బిసి సెంటర్ల హీరో బాలయ్య, మల్టీ ఫ్లెక్స్ డైరక్టర్ క్రిష్ కలిస్తే ఎలా వుంటుంది? అదే ఇప్పుడు శాతకర్ణికి సమస్య అవుతోందని వినికిడి. క్రిష్ తీసిన కొన్ని యుద్ధ సన్నివేశాలు, కొన్ని మామూలు సీన్లు ఓ రేంజ్  మేరకు రాలేదని హీరో బాలయ్య అభిప్రాయపడుతున్నారట. ఈ విషయం కొన్నాళ్ల క్రితమే దర్శకుడికి చెప్పారట. ఆయన చూద్దాం..ఫరవాలేదు అని సర్ది చెప్పినట్లు తెలిసింది. ఇప్పుడు బాలయ్య క్వాలిటీ విషయంలో రాజీ పడ్డానికి వీలు లేదు, ఇది ప్రెస్టీజియస్ వందో సినిమా అని క్లియర్ గా చెప్పి, పట్టుపట్టడంతో పది రోజులు రీ షూట్ కు ప్లాన్ చేస్తునట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటిలో భాగంగా సీనియర్ నటి హేమమాలిని డేట్లు రెండు రోజులు పొడిగించినట్లు తెలుస్తోంది. 

ఏం చేసినా క్వాలిటీ కోసం కాబట్టి, తప్పులేదు. విడుదలయ్యాక, అయ్యో అనుకునే బదులు, ముందు ఏం చేసినా ఓకెనే.