ఎమ్బీయస్‌ : మధ్యప్రదేశ్‌ బిజెపిలో అంతఃకలహాలు

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా శివరాజ్‌ చౌహాన్‌ 13 ఏళ్లగా ఏలుతూండడంతో ఆ పదవిపై ఆశ పెట్టుకున్నవాళ్లందరూ అతనంటే మండిపడడం సహజం. వ్యాపమ్‌ కుంభకోణమైనా ఒక కొలిక్కి వచ్చి అతను గద్దె దిగుతాడేమోననుకుంటే అదీ జరగలేదు. కొంతకాలం…

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా శివరాజ్‌ చౌహాన్‌ 13 ఏళ్లగా ఏలుతూండడంతో ఆ పదవిపై ఆశ పెట్టుకున్నవాళ్లందరూ అతనంటే మండిపడడం సహజం. వ్యాపమ్‌ కుంభకోణమైనా ఒక కొలిక్కి వచ్చి అతను గద్దె దిగుతాడేమోననుకుంటే అదీ జరగలేదు. కొంతకాలం ముఖ్యమంత్రిగా చేసి, యితని కాబినెట్‌లో హోం మంత్రిగా చేసిన బాబూలాల్‌ గౌర్‌ను 'నీకు 75 ఏళ్లు నిండాయి కాబట్టి, పదవి నుంచి తప్పుకో' అని దింపేస్తే అతను పళ్లు నూరుకోడూ? అదే కారణం మీద తీసేసిన పిడబ్ల్యుడి మంత్రి సర్తాజ్‌ సింగ్‌ ''పార్టీ, దాని నాయకులూ అందరూ మారిపోయారు. మేం పార్టీకి పునాదులు వేసినప్పుడు వీరెవ్వరూ లేరు.'' అని బహిరంగంగా వాపోయాడు. 

చౌహాన్‌ పాలనలోనే 2015 నవంబరులో రత్లామ్‌-ఝాబువా లోకసభ ఉపయెన్నిక జరిగింది. దిలీప్‌ సింగ్‌ భూరియా అనే బిజెపి ఎంపీ మరణిస్తే అతని కుమార్తె నిర్మలను బిజెపి అభ్యర్థిగా నిలబెట్టారు. కాంగ్రెస్‌ తరఫున రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కాంతిలాల్‌ భూరియా నిలబడ్డాడు. చౌహాన్‌ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని తను ప్రచారం చేయడమే కాక, 12 మంది కాబినెట్‌ మంత్రులను, 50 మంది ఎమ్మెల్యేలను రంగంలోకి దింపి, 27 ర్యాలీలు, నాలుగు రోడ్‌షోలు నిర్వహించాడు. ఇంత చేసినా కాంగ్రెసు అభ్యర్థి 88 వేల మెజారిటీతో గెలిచాడు. దీని తర్వాత డిసెంబరులో 8 స్థానికసంస్థల ఎన్నికలు జరిగాయి. వాటిలో 7 బిజెపికి, 1 కాంగ్రెసుకు వుండేవి. ఎన్నికల తర్వాత చూస్తే కాంగ్రెసుకు 5, బిజెపికి 3 వున్నాయి. 179 వార్డుల్లో 93 బిజెపి గెలవగా, కాంగ్రెసుకు 60 దక్కాయి. 2014 పార్లమెంటు ఎన్నికలలో చావుదెబ్బ తిన్న కాంగ్రెసు మళ్లీ బలం పుంజుకోవడానికి కారణం చౌహాన్‌ అసమర్థ పాలనే అని బిజెపిలో అతని వ్యతిరేకుల భావం. దాన్ని హైలైట్‌ చేయడానికి ప్రతిపక్షానికి అవకాశం యివ్వడం దేనికి, మనమే చేస్తే పోలేదా? అనుకున్నారు. ఇక అప్పణ్నుంచి బహిరంగంగా వ్యాఖ్యలు చేయసాగారు. వారిలో కొందరు పర్యవసానాలు కూడా అనుభవించారు.  వాటి వరస చూడబోతే – 

''వచ్చే ఎన్నికలలో బిజెపిని బిజెపియే ఓడిస్తుంది.'' – బిజెపి ఎమ్మేల్యే పన్నాలాల్‌ శాఖ్యా

''మావోయిస్టు ప్రభావిత బాలాఘాట్‌ ప్రాంతంలో ప్రభుత్వం అశాంతిని రగిలిస్తోంది. శాంతి నెలకొల్పుదామని ప్రయత్నిస్తున్న అక్కడి ఆరెస్సెస్‌ కార్యకర్తలపై వ్యవసాయమంత్రి గౌరీశంకర్‌ బిసెన్‌ పోలీసులచే దౌర్జన్యం చేయిస్తున్నారు. అక్కడి యదార్థ పరిస్థితిని సోషల్‌ మీడియాకు అందచేస్తున్న సురేశ్‌ యాదవ్‌ అనే అనే ఆరెస్సెస్‌ కార్యకర్తను పోలీసులు చావబాదారు. మంత్రి రాజీనామా చేయాలి.'' – బిజెపి ఎమ్మెల్యే సంజయ్‌ శర్మ, జాలమ్‌ సింగ్‌ పటేల్‌ల డిమాండ్‌. 

ఈ శాఖ్యా, శర్మ, పటేల్‌లకు శర్మకు రాష్ట్ర అధ్యక్షుడు నంద్‌ కుమార్‌ చౌహాన్‌ షోకాజ్‌ నోటీసు యిచ్చాడు. పనిలో పనిగా సురేశ్‌ యాదవ్‌ను కొట్టిన ఆరుగురు పోలీసువారిపై, ఒక ఎఎస్‌పిలపై సెక్షన్‌ 307 కింద కేసు పెట్టారు. 

''పార్టీ ద్వితీయశ్రేణి నాయకులను ఎదగనీయటం లేదు, అణచివేస్తోంది. బయటివాళ్లకు పదవులు కట్టబెడుతున్నారు.'' – బిజెపి వ్యాపారవిభాగం కన్వీనర్‌, అధికార ప్రతినిథి ప్రకాశ్‌ మీర్‌చందానీ

''వ్యాపమ్‌ కుంభకోణంలోని తప్పులకై పార్టీ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. రాబోయే ముఖ్యమంత్రి దళితుడే అని ప్రకటించాలి.'' – బిజెపి సాంస్కృతిక విభాగం కన్వీనర్‌ రాజేశ్‌ భదోరియా

మీర్‌చందానీ, భదోరియాలను పార్టీలోంచి సస్పెండ్‌ చేశారు. 

''బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో యిసుక మాఫియాను ప్రభుత్వమే కాపాడుతోంది.'' – బజెట్‌ సెషన్‌లో బిజెపి ఎమ్మెల్యే రామ్‌దయాళ్‌ ప్రజాపతి ఆరోపణ.

''బిజెపి కార్యకర్తల పరిస్థితి కాంగ్రెసు హయాంలో కంటె ఘోరంగా వుంది.'' – గ్రామీణాభివృద్ధి మంత్రి గోపాల్‌ భార్గవ 

ఈ ప్రకటనలు వెనక్కి తీసుకునేట్లా చేశారు.

…ఇప్పుడు యీ క్రింది వ్యాఖ్యలు చూడండి, ఇవన్నీ ఒకరు చేసినవే!

''కరంటు బిల్లు బకాయిలు మాఫీ చేయడం ప్రజలను ఆకర్షించడానికే తప్ప అది ప్రజలకు మంచి చేయదు. నాయకత్వం లోపించిన నాయకులే యిలాటి వాటికి దిగుతారు.'' – ఓ ఆధ్యాత్మిక సమావేశంలో ప్రసంగం.

''మేం చాలాకాలంగా అధికారంలో వున్నాం. సహజంగానే ప్రభుత్వంలో అవినీతి చొరబడింది. కానీ పోనుపోను అది బొత్తిగా తేటతెల్లంగా కనబడుతోంది. సరిదిద్దుకోకపోతే వచ్చే ఎన్నికలలో యిబ్బందే…'' – ఒక టీవీ యింటర్వ్యూలో అభిభాషణం.

''అవినీతి ఎప్పుడూ వుంది. కానీ మొదటి రెండు దఫాల బిజెపి ప్రభుత్వంలో అదుపులో వుండేది. ఇప్పుడు పెచ్చుమీరింది, ముఖ్యంగా క్రింది స్థాయిలో. అడ్డు చెప్పబోయిన పార్టీ కార్యకర్తలను అధికారులు పట్టించుకోవటం లేదు.'' – అదే యింటర్వ్యూలో..

''2007లో ముఖ్యమంత్రి, ఆయన భార్య యిరుక్కున్న డంపర్‌ స్కామ్‌ గురించిన అనేక డాక్యుమెంట్లు, ఆధారాలు అప్పట్లో ఉమాభారతితో పాటు భారతీయ జనశక్తి పార్టీలో వున్న ప్రహ్లాద్‌ పటేల్‌ (తర్వాత బిజెపిలో చేరి ఎంపీ అయ్యాడు)కు చిక్కాయి. అతను ఒక పత్రికా సమావేశంలో మాట్లాడబోతే 'కావాలంటే ముఖ్యమంత్రి గురించి మాట్లాడు కానీ ఆయన భార్య గురించి మాట్లాడవద్దు' అంటూ నేను రిక్వెస్టు చేశాను.'' – అదే యింటర్వ్యూలో… 

(ఈ కేసులో చౌహాన్‌, అతని భార్యకు క్లీన్‌ చిట్‌ లభించింది, కానీ యీయన దాని గురించి ప్రస్తావించాడు, యీ మాట నిజమే అని ప్రహ్లాద్‌ ధృవీకరించాడు)

''ఇండోర్‌లో మెట్రో రైలు తెస్తామని వాగ్దానం చేశాం. కానీ ప్రభుత్వపు పనుల్లో వేగం చూస్తూంటే మెట్రో కాదు కానీ, ఎద్దు బండి దక్కేట్టుంది.'' – ట్విట్టర్‌లో వ్యాఖ్య (తర్వాత దీన్ని సవరించుకుని అధికారులను తప్పుపట్టాడు)

ఈ వ్యాఖ్యలు చేసిన కైలాశ్‌ విజయవర్గియాపై మాత్రం బిజెపి అధిష్టానం ఏ చర్యా తీసుకోలేదు. పైగా 'ఇలాటి వ్యాఖ్యలు మానుకోండి, ఢిల్లీ వెళ్లిన తర్వాత మధ్యప్రదేశ్‌ గురించి మీ అవగాహన సన్నగిల్లినట్టుంది' అని సలహా యిచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు నంద్‌ కుమార్‌ చౌహాన్‌కు 'నీ స్థాయి తెలుసుకో. పార్టీ సంగతి చూసుకో, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి భట్రాజు పని మానుకో. పబ్లిక్‌ రిలేషన్స్‌ చూసేందుకు వేరేవాళ్లున్నారు' అని ఘాటుగా సమాధానం యిచ్చాడు. చివరకు నంద్‌ కుమార్‌ కైలాశ్‌ యింటికి వెళ్లి క్షమాపణ చెప్పుకోవలసి వచ్చిందంటే కైలాశ్‌ సత్తా ఏమిటో తెలుస్తుంది.

ఈ సత్తా అతనికి బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షాతో స్నేహం వలన కలిగింది. ఎబివిపి ద్వారా వెలుగులోకి వచ్చిన కైలాశ్‌  భారతీయ జనతా యువ మోర్చాలో చేరి జాతీయ జనరల్‌ సెక్రటరీ అయి 1993లో గుజరాత్‌కు యిన్‌చార్జిగా వెళ్లాడు. బహుశా అప్పుడు అమిత్‌ షాతో పరిచయం కలిగి క్రమేపీ దృఢపడి వుంటుంది. అతనికి మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవిపై కన్నుంది. ప్రస్తుతానికి అమిత్‌ అతన్ని జాతీయ జనరల్‌ సెక్రటరీ చేశాడు. మొన్నటి హరియాణా ఎన్నికలలో ఆ రాష్ట్రానికి యిన్‌చార్జి చేస్తే బిజెపి బలాన్ని 4 నుంచి 47కి పెంచి చూపించాడు కైలాశ్‌. అందుకని 2015లో బెంగాల్‌కు యిన్‌చార్జిగా చేశారు. ఈ వ్యక్తి ఏం మాట్లాడినా, చౌహాన్‌ను ముకుతాడు వేయాలని కాబోలు, అమిత్‌ మందలించడం లేదు. కానీ మధ్యలో పార్టీ నాశనమవుతోంది. పార్టీ నాయకులు ఎవరికి వాళ్లు చిత్తం వచ్చినట్లు ఒకరినొకరు పబ్లిగ్గా దూషించుకోవడం కాంగ్రెసు సంస్కృతిగా పేరుబడింది. ఇప్పుడు దాన్ని తను పుణికి పుచ్చుకుందని మధ్యప్రదేశ్‌ బిజెపి నిరూపించుకుంటోంది. (ఫోటో – కైలాశ్‌ విజయవర్గియా)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2016) 

mbsprasad@gmail,com