''కౌన్ బనేగా కరోడ్‌పతి చూస్తున్నావా అచలపతీ?'' అని అడిగేను ఆరోజు పొద్దున్నే తీరిగ్గా కూచుని. లక్షింపతి అవాళే వచ్చి పడతాడని నాకేం తెలుసు?
'చూస్తున్నా సర్! మనమెంత ఆశాపరులమో, అజ్ఞానులమో కళ్లక్కట్టినట్టు చూపే సజీవ ప్రదర్శనను చూడకపోవడంవల్ల మనమెంత కోల్పోతున్నామో మనమే తెలుసుకోలేని స్థితిలో ఉండడం సంభవిస్తుంది కదా' అన్నాడు ఆచలపతి వినయంగా కాస్త ఒంగి, మళ్లీ నిటారుగా నిలబడుతూ.
ఇదీ ఇతని మాట తీరు. 'కరోడ్‌పతి' గురించి అతనిచ్చిన సమాధానం అర్థం కాలేదు కానీ అతనికి ప్రోగ్రాంపై సదభిప్రాయం ఉన్నట్టు తోచలేదు. లక్షింపతికి ఆ విషయం తెలియదుగా! వస్తూనే అచలపతి గురించి అడిగేడు.
'ఒరేయ్ అనంత్! అచలపతి సహాయం కావాల్రా! కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రాంలో పాల్గొందా మనుకుంటున్నాను.''
నా కిదే చికాకు. మరీ చెట్టంత కాకపోయినా పెద్ద సైజు మొక్కంత మనిషిని, నన్నడగొచ్చుగా! అబ్బే! కర్ణాటకలో శివుడి కంటె అతని వాహనం నందీశ్వరుడికి భక్తులెక్కువట! అలాగే నా కంటే అచలపతికి అభిమానులు, ఆరాధకులు ఎక్కువ! అతనుండడం వల్లనే నేను బతికి బట్టకడుతున్నానని అనుకుంటారు గానీ అతను లేకపోతే నేను పట్టుబట్టలు కట్టించుకునే స్థితిలో ఉందునని గ్రహించరు.
నన్ను నేను నేను ప్రమోట్ చేసుకోవాల్సివచ్చిన దుస్థితి పట్టింది కదాని బాధపడుతూనే వాడికి కావల్సిన సహాయం ఏదో చెబితే నేనే చేసి పెడతానని లక్షింపతిని బతిమాలేను. హరిజనోద్ధరణ చేసేవాళ్లు కూడా కొట్టనంత పోజు కొట్టి వాడు 'సరేలే! ఎంత చెడ్డా క్లాస్మేట్వి కదా! నిన్నూ ఎంకరేజ్ చేయాలి. కరోడ్‌పతిలో ఛాన్సు వచ్చింది. రేపు పదిహేనున షూటింగ్. ఈ లోపున నన్ను కాస్త జీకేలో నిష్ణాతుణ్ని చేయ్'. అన్నాడు సోఫాలో కూచుని కాళ్లూపుతూ.
కరోడ్‌పతి ప్రోగ్రాం చూసినప్పుడల్లా అందులో వేసే సిల్లీ క్వశ్చన్స్ గురించి చాలాసార్లు జోకులేసుకున్నా, అక్కడికి వెళ్లి హాట్సీట్లో కూచునేటప్పటికి బుర్ర ఇగిరిపోయి, అన్ని ప్రశ్నలూ హఠాత్తుగా కష్టమయిపోతాయని నాకు తెలుసు. ఇందులో మనం చేయగలిగే సహాయం ఏదీ లేదు కాబట్టి, వాడి ఉత్సాహం మీద చన్నీళ్లు చల్లాను. కానీ వాడి ఉత్సాహం యొక్క వేడి వల్ల అవి రూమ్టెంపరేచర్కి చేరాయి. ఇక ఉండబట్టలేక అడిగేశా – 'నీకు బోల్డు డబ్బుంది, పైగా నక్కాశలు లేవు. మరి నీకింత ఉబలాటమెందుకు?' అని.
'ఒరేయ్, పెళ్లయిన ఇన్నేళ్లకి మా ఆవిడ నా తెలివితేటలు మెచ్చుకుంటోందిరా! ఆ ప్రోగ్రాం అవుతూన్నంతసేపూ 'మీరు కనక వెళ్లి వుంటే ప్రైజు ఖాయం. ట్రై చేయకూడదూ?' అని తెగ పోరు పెడుతోంది.'' అన్నాడు ఆశ్చర్యంతో కళ్లు పింగాణీ సాసర్లంత చేసి.
'అచలపతీ, చెవులోసారి చూపించుకోవాలయ్యా, మంచి ఈఎన్టీ డాక్టరెవరో కనుక్కో. వీళ్లావిడ వీడి తెలివితేటలు మెచ్చుకుంటోందని వీడన్నట్లు వినబడుతోంది..'' అన్నాను.
''ఈఎన్టీ డాక్టరవసరం ఇప్పట్లో లేదేమో సార్, మీ చెవులు ఈ విషయంలో పొరబడలేదు'' అన్నాడు అచలపతి.
''నేను నమ్మను. నువ్వూ, నేనూ బ్రహ్మచారులం కాబట్టి పెళ్లయిన వాళ్ల కంటే మనకే ఆడవాళ్ల గురించి బాగా తెలుసు. ఒక భార్య… అందునా భారతీయ భార్య…తన భర్త తెలివితేటలు మెచ్చుకోవడమా? దీనిలో ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వుంది. దురభిప్రాయం లేక అపార్థం ఉంది. ఏరా? ఈ మధ్య పాత తెలుగు సినిమాలు తెగచూస్తున్నావా? భార్యను అపార్థం చేసుకుంటున్నావా?'' అని లక్షింపతిని అడిగేశా.
వాడు సినిమాలు చూడటం లేదని ఒట్టేశాక, నోరు తెరిచి మందు వాసన లేదని చూపించాక, స్లీప్‌వాకింగ్ చేయటం లేదని నిర్ధారించుకున్నాక వాడు చెప్పినది నమ్మేను. దాని ప్రకారం వాడి భార్య నిజంగానే కరోడ్పతికి వెళ్లమని చంపుతోందట. ప్రోగ్రాం నడుస్తూన్నంత సేపూ ప్రతీ అన్సర్ రాగానే వీడికేసి చూసి వీడి కళ్లల్లో జ్ఞానజ్యోతిని చూసి పొంగిపోవడమే కాక, తక్కిన రోజుల్లో కూడా వీడి జనరల్ నాలెడ్జ్ గురించి ఫ్రెండ్స్‌తో మహా చెెబుతోందిట.
ఆ ప్రోగ్రాంలో క్వశ్చన్స్‌కి ఆన్సర్లు అందరికీ తెలుసున్నవే అని వీడంటే కాదు, 'నా అంతటి దానికి కూడా తెలియవు. కావాలంటే అడిగి చూడండి' అని ఛాలెంజ్ చేస్తుందిట. పేపరు చదివితే విసుక్కునే మనిషి ఈ మధ్య స్వయంగా పేపరు పట్టుకొచ్చి చదివి వినిపిస్తోందట. నేషన్వైడ్ తన భర్త పేరు పాప్యులరైజ్ చేయాలని తప్ప తనకు డబ్బాశ లేదని ఒట్టేసి చెప్పిందిట. ఓ లక్షసార్లు ప్రయత్నించి తనే ఫోన్ కనక్షన్ కలిపి ఇచ్చిందట. పెళ్లయిన కొత్తల్లో కూడా ఇంత జోరులేదట. ఇక ఆ ప్రోగ్రాంలో తను పాల్గొనకపోతే, భార్య గౌరవం పొందే ఈ సువర్ణావకాశం వదులుకుంటే, పతిధర్మం తప్పినవాడనవుతానని మావాడికి గట్టి నమ్మకం కలిగింది. ఇక నాకూ తప్పలేదు, అచలపతిని అడగక.
'అచలపతీ, ఇక బావుండదు. నీ నాలెడ్జిలో ఓ పదోవంతు లక్షింపతి కియ్యవోయ్' అని అర్డరేశా, పెసరట్టు కావాలి. తక్షణం నానవోయ్! అన్న స్టయిల్లో.
'సర్ , మీరు చెప్పాక తప్పకుండా ఇచ్చేవాణ్నే కాని ఇలాటి లాటరీ ప్రోగ్రాంకు నా తెలివితేటలు వెచ్చించను. బాధాకరంగా ఉంది. మీకేదైనా తెలియకపోతే మీరు నన్ను అడగడం, కాదనకుండా నేను జవాబివ్వడం. అది నా విద్యుక్త ధర్మం'. అని జవాబిచ్చాడు మన ధర్మవీరుడు.
నా బుర్ర అసలే పాదరసం కాబట్టి తక్షణం ప్లాన్ వేశా. దాని ప్రకారం ఆ ప్రోగ్రాంలో పాలు పంచుకునేవాడి తోడు పెళ్లికొడుకులా నేను వెళతాను. నా వెంట ఒన్‌మాన్ ఆర్మీలా అచలపతి! ఏదైనా క్వశ్చన్ రాగానే ఆన్సర్ ఏమిటో అచలపతి సైగలద్వారా నాకు చెప్పాలి. అదే సైగల ద్వారా నేను లక్షింపతికి చెప్పాలి. వాటి సహాయంతో లక్షింపతి కరక్టు ఆన్సర్ చెప్పేసి, ధనమూ, యశస్సూతో బాటు వాళ్లావిడ మెప్పు కూడా కొట్టేస్తాడు.
ప్లాన్లన్నీ ఇంత సింపుల్‌గానే తయారువుతాయి. అమలు చేసేటప్పుడే ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పటికీి ఎన్నో అనుమానాలు ముందే నివృత్తి చేసాను. ఎక్కడో హాట్సీట్లో కూచునే లక్షింపతి గుంపులో ఉన్న నన్ను గుర్తించేందుకు వీలుగా ఆరంజి కలర్ కోటు (అచలపతి నొసటి విరుపుల మధ్య) వేసుకుంటానని హామీ ఇచ్చాను. కూడా వచ్చినవాళ్ల మీద కెమెరా ఫోకస్ చేస్తారు కాబట్టి గుట్టు రట్టవుతుందని వాడు భయపడితే, పడవద్దనన్నాను నేను. సైగలు చేయడం చాలా సటిల్‌గా, తెలిసీ తెలియనట్టుగా, అంటే మనకు తెలిసేట్టూ, వాళ్లకు తెలియనట్టూ ఏర్పాటు చేస్తానన్నాను.
''చూడు అచలపతీ, ఆన్సర్ 'ఏ' అనుకో ఎడమ చెవి పట్టుకో. 'బి' అనుకో కుడి చెవి. 'సి' అనుకో ఎడమ కన్ను, 'డి' అయితే…''
''సార్, కన్ను ముట్టుకోవడం ఎబ్బెట్టుగా ఉంటుంది సార్. ఎవరికైనా అనుమానం తగిల్తే?''
''మరి ఏంచేద్దాం, మొహంలో జంటలుగా ఉండేవి ఇంకేమున్నాయి? ఆ.. ముక్కు..''
''సార్! ముక్కు ఒక్కటే కదా..''
''కరెక్టు ., కానీ ముక్కుపుటాలు రెండు కదా… ఒరేయ్ లక్షింపతీ, నీకర్థమయిందా? ఆన్సర్ సి అయితే ఏం ముట్టుకుంటాం చెప్పు చూద్దాం?''
''లెఫ్ట్ నోస్ట్రిల్…''
''రైట్…''
''రైటా? ఐ యామ్ సారీ. 'ఎ' అయితే లెఫ్ట్్ ఇయర్ అన్నావు కాబట్టి 'సి' అయితే ..''
''నీ సంజాయిషీలు ఆపు. నేనన్నది నీ ఆన్సర్ రైటని… రైట్ నోస్ట్రిల్ అని కాదు''
అచలపతి చిన్నగా దగ్గాడు. అంటే అడ్డుపడ్డాడనే అర్థం. 'సర్, ఇదంతా కన్ప్యూజింగా ఉందేమో. దీనికి ప్రత్యాయ్నాయం, అంటే శరీర అంగాలకు ప్రత్యాయ్నాయం కాకుండా అసలు కార్యక్రమంలో పాల్గొనే ఆలోచనకే ప్రత్యామ్నాయం ఏదైనా వెతికితే?''
''అచలపతీ, నువ్వు చెప్పేదాని కంటే మోర్ కన్ఫ్యూజింగ్ ఇంకేదీ ఉండదు. లెటజ్ గో ఎహెడ్ అండ్ ప్రూవ్ హౌ బ్రిలియంట్ ఈజ్ అనంత్! లక్షింపతి కరోడ్‌పతి అయినా కాకపోయినా, ఆనంత్ బుద్ధిపతి అని అందరికి తెలుస్తుంది, చూసుకో''.
దీ
బొంబాయిలో నేనూ, అచలపతి దిగిన హోటల్‌రూమ్ పక్క రూమ్‌లోనే లక్షింపతీ, అతని భార్య లక్ష్మి దిగారు. మా ప్లాను సంగతి తెలిస్తే తన మీద గౌరవం పోతుందన్న భయంతో తనకు జీకేలో ట్రెయినింగ్ ఇచ్చినవాళ్లగా మమ్మల్ని పరిచయం చేసి, మోరల్ సపోర్టుకోసం తోడుగా పాల్గొంటున్నామని ఆమెకు చెప్పాడు లక్షింపతి. నాకేసి అదోలా – 'ఇంకోళ్లకి తెలివి పంచేటంత ఘనుడివా?' అన్నట్టు – చూసిందావిడ. భర్త మీదే కాదు. భర్త స్నేహితుల మీద కూడా భార్యల కిలాంటి అభిప్రాయాలు, అనుమానాలు ఉండడం కద్దు. భర్తను, ఆయన స్నేహితులను కూడా ఒకే దెబ్బతో అంచనా వేయడానికి కాబోలు అవిడా హాల్లో దూరింది. అదే విషయం అచలపతితో అంటే 'ఆవిడ ఆశలు ఆవిడవి కదా!' అని తేల్చేశాడు, లోబడ్జెట్ సినిమాలో క్లుప్తసంభాషణలా.
నేను ప్లాన్ వేస్తే ఎంత పకడ్బందీగా వేస్తానో మీరూహించలేరు. ప్రశ్న అడగడం తరవాయి నేను అచలపతి కేసి చూడడం, అతను టపాటపా చెవులూ, ముక్కులూ ముట్టడం (ఆన్సరు బట్టి) నేను అదే విధంగా కాపీ చెయ్యడం, నన్ను చూసి లక్షింపతి జవాబు చెప్పడం! తర్వాత్తర్వాత అంటే లక్షింపతి కుర్చీలోకి వచ్చాక ఇది బాగానే పనిచేసింది కానీ ముందులో అంటే ఫాస్టెస్ట్ ఫింగర్ కనిపెట్టే విధానంలో మా వాడు ఎప్పుడూ రైట్ ఆన్సరే చెప్పేవాడు కానీ కాస్త లేటుగా చెప్పేవాడు, దాంతో ఛాన్స్ పోయేది. చివరికి ఆ రోజు ముగ్గురి ఆట ఆయ్యేక, మూడోవాడు ఇక వదులుతాడా లేదా అని భయపడే సమయంలో మా వాడికి ఛాన్సు వచ్చింది, వీడొక్కడే కరక్ట్ ఆన్సర్ చెప్పడంతో.
నేను ప్లాన్ వేయని సందర్భాలలో ఎంత అసందర్భంగా మాట్లాడతానో ఊహించడం కష్టం. లక్షింపతికి తోడుగా వచ్చానంటూ నన్ను పరిచయం చేశాక పిల్లిగడ్డపు యాంకర్ – నేను ఏం చేస్తుంటానని అడిగేడు. ఏమీ చేయకుండా ఖాళీగా ఉంటానని ఎలా చెప్పను? అందునా కెమెరా నా మీదనే పెట్టి అడిగినప్పుడు!? ఆడవాళ్లయితే హౌస్‌వైఫ్ అని చెప్పవచ్చు. పోనీ నేను హౌస్ హజ్బెండ్ అందామన్నా నేెను ఎవరికీ హజ్బెండ్‌ను కాను.
ఇలాటి ఇరకాట పరిస్థితిలోంచి కాపాడేది నా జ్ఞాపకశక్తే! గూండాలకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినప్పుడు వారి ఆక్యుపేషన్ సోషల్ సర్వీస్ అని రాస్తారని గుర్తుకు వచ్చింది. అదే నేను చెప్పాను. ఏంకర్ విడిచిపెట్టలేదు, ఎలాంటి సోషల్ సర్వీసు అన్నాడు. మాకు పరీక్షల్లో సోషల్ తర్వాత సైన్సు పేపరు ఉండేది. అదే గుర్తు వల్ల సైన్సు సర్వీసు అనేశాను. ఏంకర్ నవ్వాడు 'మీ హాస్యచతురతకు జోహార్లు'అన్నాడు జోకేశాననుకుని. ఆయనంతటివాడు నవ్వాక మెచ్చుకోకపోతే బాగుండదని హాల్లో ఉన్న వాళ్లంతా చప్పట్లు కొట్టారు. నేను లేచి అభినందనలు స్వీకరించవలసి వచ్చింది.
ఇదంతా బాగానే ఉంది కానీ నాలుగు సమాధానాలు కరెక్టుగా చెప్పిన తర్వాత వచ్చింది, అనుకోని ఇబ్బంది. ఐదో ప్రశ్నకు సమాధానంగా కుడి చెవి ముట్టుకుంటూనే అచలపతి తన జేబులోంచి రుమాలు బయటికి తీయడం జరిగింది. దానికి పూసిన సెంటు వాసనతో నేను ఛట్టున ముక్కుపుటాలు రెండూ మూసుకోవడం, మా వాడు రాంగ్ సిగ్నల్ అందుకుని ఖంగారుపడి ఆన్సర్ 'సిడి' అనేయడం జరిగిపోయింది. 'సి యా ?డి యా?'' అని ఏంకర్ అడగడంతో ఖంగారుపడి మావాడు 'సి' అనేశాడు. దాంతో గొహోవిందా!
దీ
ఆరోజు మధ్యాహ్నం నిద్రపోయి లేచేసరికి సాయంత్రమయింది. అచలపతి తెప్పించిన కాఫీ తాగుతూ నేను వేదాంతధోరణిలో పడ్డాను. ''చూశావా! అచలపతీ! ఎంతో ప్లాన్ చేశాం. అయినా ఫెయిలయ్యాం. మనవాడు ఘాెరంగా ఓడిపోయాడు. అందునా ఆ అవమానం భార్య ముందు జరిగింది. ఆవిడ హాల్లోకి రాకుండా ఉండాలనుకున్నాను. కానీ వచ్చేసింది. అదీ విక్రాంత్ అనే మరో పార్టిసిపెంటుకు తోడుగా రిజస్టరయ్యి వచ్చింది. దాంతో అంతా ఆమె కంటబడింది. మనవల్ల ఒక భర్త భార్య దృష్టిలో పతనం. వారి కుటుంబంలో చిచ్చు..''
''సర్ పొరబాటు నాది. ఆ సెంటు మీకు నచ్చదని తెలిసినా నా రుమాలుకి పూసుకుని రావడం, అదే సమయంలో బయటకు తీయడం..''
''అది ఒక దురదృష్ట ఘడియ. కానీ దాని పర్యవసానం ఇద్దరు వ్యక్తుల మధ్య ఎడబాటు ..''
''సర్ , మీరొక్కసారి కిటికీ బయటకు తొంగి చూస్తే ఇంతింత భారీ డైలాగులు చెప్పే శ్రమ తప్పతుందేమో ననిపిస్తుంది!''
చూశా. కాఫీలో ఏదో మత్తుమందు కలిపి నట్టున్నారు. లక్షింపతి, అతని భార్య లక్ష్మి చెట్టాపట్టాలు వేసుకుని హోటల్ లాన్స్‌లో షికార్లు కొడుతున్నట్లు కనబడింది. కాఫీలో ఏమీ కలపలేదనీ అచలపతి హామీ ఇచ్చాడు. ప్రోగ్రాం అయివచ్చిన దగ్గర్నుంచీ వాళ్లిద్దరిదీ ఇదే వరసట! యుద్ధరంగంలో ఓడిపోయి వచ్చిన ఖడ్గతిక్కనకు ఇలాంటి మర్యాదలు జరిగిన దాఖలాలు లేవు.
''అచలపతీ, లక్షింపతి భార్య చిన్నపుడు చరిత్ర సరిగ్గా చదివి ఉండదంటావా?'' అని అడిగేశా.
''ఆమె కోరిక తీరింది కాబట్టి ఇప్పుడు తీరిగ్గా చదవచ్చునేమో సర్'' అన్నాడు అచలపతి తొణక్కుండా.
''ఏమా కోరిక! ఏమా వైనం? సోదాహరణముగా వివరింపుము''. అని అర్డరేశా.
''ప్రతీ మనిషికీ ఉండే కోరికే సర్. టీవిలో పడాలన్న తపన! తన అందచందాలను, కట్టుబొట్లను, హావభావాలను టీవీ కెమెరా ద్వారా యావద్భారతానికి అందించాలని..''
''దానికి సులభమైన మార్గం కరోడ్‌పతి కార్యక్రమంలో పాల్గొనడం అంటావ్. కానీ.. మైడియర్ వాట్సన్! నువ్విక్కడ మర్చిపోతున్న విషయం – లక్ష్మి జవాబులు చెప్పడానికి తను వెళ్లలేదు, భర్తను పంపింది, అపర త్యాగగుణంతో…''.
''సర్ మీరొక్క విషయం గమనించాలి. హాట్సీట్లో కూర్చునేవాళ్లకు కవరేజ్ వచ్చినా వాళ్లకు జవాబులు చెప్పే బాధ్యత ఉంది కదా, చెప్పలేకపోతే జనాల దృష్టిలో నవ్వులపాలయ్యే ప్రమాదం ఉంది కదా! అలాంటి రిస్కు ఏమీ లేకుండా బోల్డంత పబ్లిసిటీ ఎవరికి వస్తుందో కాస్త ఆలోచించండి..''
''ఆలోచించడాని కేముంది? తోడుగావచ్చిన వాళ్లదే భోగం! కెమెరా ఎక్కువ సేపు వాళ్లమీద తారట్లాడుతుంది. వాళ్ల చిరునవ్వులు, దైవప్రార్థనలు, భయాందోళనలు, ఆనందాతిరేకాలు – అన్నీ కెమెరాలో బంధింపబడతాయి. ఇవాళ నా హాస్య చతురతకు కూడా బోల్డంత కవరేజి వచ్చిందిగా!'' అన్నాను పేలవంగా నవ్వుతూ.
''అటువంటి పబ్లిసిటీ ఒక మహిళ కోరుకోవడంలో ఆశ్చర్యమేముంది? అందుకే ప్రతీ భార్య తన భర్తను కరోడ్పతికి వెళ్లమని ప్రోత్సహిస్తుంది. అఫ్కోర్స్, అతను సరైన జవాబులు చెప్పి ఎంత ఎక్కువసేపు కుర్చీలో ఉంటే అంత ఎక్కువ సేపు కవరేజ్. దానికోసమేనా అతని సక్సెస్ కోసం భార్య ప్రార్థిస్తుంది. లక్ష్మిగారి విషయంలో ఇంతకంటే భిన్నంగా జరిగే అవకాశం లేదు''.
''అంటే లక్షింపతి విషయంలో ఆమె ప్రార్థించిందంటావ్?''
''సర్! మరొక విషయం మర్చిపోతున్నారు. ఆమె తోడుగా వెళ్లింది – విక్రాంత్ అనే కుర్రాడితో! అతనికి ముందు పార్టిసిపెంట్్ అయిన లక్షింపతిగారి ఆట త్వరగా పూర్తయితేనే ఆమెకు కవరేజ్ వచ్చే అదృష్టం పడుతుంది. ఆయన ఓడిపోతే సంతోషించేవారిలో ఆమె కూడా ఒకరు. ఆ సంతోషం ఆమె ముఖం మీద కనబడుతోంది.'' అన్నాడు అచలపతి సర్వజ్ఞ సింగ భూపాలుడిలా! కాఫీ మత్తు దిగిపోయింది. జరిగినదంతా ఇప్పుడు స్పష్టంగా కనబడుతోంది.
తనకు కవరేజి భాగ్యం కలిగించకుండా లక్షింపతి మమ్మల్ని తోడుగా తీసుకెళ్లడం లక్ష్మికి నచ్చలేదు. ఎవరో ఒకరిని బతిమాలుకుని విక్రాంత్‌కు ఫ్రెండులా, అతనికి తోడుగా వెళ్లింది. ఆమె ప్రార్థనలు ఫలించి లక్షింపతి త్వరగా ఓడిపోయాడు. విక్రాంత్ ధర్మమాని ఆమె తన ముఖారవిందాన్ని, నగలూ నాణ్యాలను యావద్భారతానికి చూపించగలిగింది. ఆవిడ కోరిక తీరింది. కోటిరూపాయల బహుమతి గురించి ఆవిడ కెన్నడూ చింతలేదు. భర్త గెలిస్తే ఎంత? ఓడితే ఎంత? ఇక ఆమెకు భర్త మీద కోపం దేనికి? అందుకే భార్యాభర్తల మధ్య ఆ అన్యోన్యత. అంతా బానేవుంది. కానీ ఆమెకు విక్రాంత్‌ను పరిచయం చేసిన ఎవరో ఒకరు ఎవరు? అచలపతి కేసి దీర్ఘంగా చూశా.
నా ఆలోచనల ట్రెయిన్ ఎక్కడికి దారి తీసిందో, ఏ స్టేషన్ చేరిందో కనిపెట్టిన అచలపతి కొద్దిగా తలవంచి, ''మన్నించాలి సర్. తన భర్త మిమ్మల్ని పరిచయం చేసాక లక్ష్మిగారి ముఖంలో చోటుచేసుకున్న మార్పులు చూసాను. ప్రోగ్రాం జరిగే హాలు వద్ద ఒంటరిగా వచ్చినవారెవరాని వాకబు చేస్తే, విక్రాంత్ అనే అందమైన యువకుడు కనబడ్డాడు. ఆయనకు గర్ల్ ఫ్రెండుగా టీవీ ప్రేక్షకులకు పరిచయమవుతారా? అని లక్ష్మిగారిని అడిగితే ఎగిరి గంతేయబోయి, తమాయించుకుని, సరేనన్నారు. సెంటు విషయంలో మీ ఇష్టాయిష్టాలు ఎలాగూ తెలుసు కాబట్టి, చిన్న రుమాలు సహాయంతో ఆమె ముచ్చట తీర్చడం కష్టం కాలేదు''.
నేను దీర్ఘంగా నిట్టూర్చి ''అది సరేగానీ, లక్ష్మి ఇలాగే ఆలోచిస్తుందని ఎందుకనుకున్నావ్?'' అని అడిగేను.
''రెండు కారణాలు సర్! ఒకటి – బొంబాయ్ రాగానే ఆవిడ పదివేలు పెట్టి కొత్తచీర,నలభైవేలుపెట్టి డైమండ్స్ కొనడానికి బజారు కెళ్లడం..''
''ఈజిట్?! అది నేను చూడలేదు,. చూసి ఉంటే నేనూ ఈ పోకడలు పసిగట్టి ఉండే వాణ్నేమో. ఈ కేసులోనైనా నీకు విజయం కలగకుండా చూసే వాణ్నేమో. సరేగానీ, రెండో కారణం?''
''లక్షింపతి గారు మొదటిసారి వచ్చినప్పుడే ఒక పాత ఇంగ్లీషు సామెత గుర్తుకు రావడం!''
''ఏమిటది?''
''నో మాన్ ఈజ్ గ్రేట్ ఫర్ హిజ్ వైఫ్ అండ్ వ్యాలే…''
''మొదటి విషయం ఈ కథ ద్వారా ఎలాగో తెలుస్తోంది కాని నువ్వు నాకు వ్యాలే లాటి వాడివే కదా, నీ దృష్టిలో నేను గొప్పవాడిని కానా?'' అన్నాను కిటికీలోంచి హొరైజన్కేసి దృష్టి సారిస్తూ. దేనికైనా కాస్త ఎఫెక్టు ఉండాలిగా!
రెండు నిమిషాలు గడిచినా జవాబు వినబడకపోతే తిరిగి చూశా. అక్కడ అచలపతి ఉంటేగా!!
('హాసం' హాస్య – సంగీత పత్రికలో అక్టోబరు 2001లో ప్రచురితం)
– ఎమ్బీయస్ ప్రసాద్