cloudfront

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: నరుడా డోనరుడా

సినిమా రివ్యూ: నరుడా డోనరుడా

రివ్యూ: నరుడా డోనరుడా
రేటింగ్‌: 2/5

బ్యానర్‌: రమా రీల్స్‌, ఎస్‌ఎస్‌ క్రియేషన్స్‌
తారాగణం: సుమంత్‌, తనికెళ్ల భరణి, పల్లవి సుభాష్‌, సుమన్‌ శెట్టి, శ్రీలక్ష్మి, భద్రమ్‌ తదితరులు
సంగీతం: శ్రీచరణ్‌ పాకాల
కూర్పు: కార్తీక శ్రీనివాస్‌
ఛాయాగ్రహణం: షానీల్‌ డియో
నిర్మాతలు: సుప్రియ వై., జాన్‌ సుధీర్‌ పూదోట
దర్శకత్వం: మల్లిక్‌ రామ్‌
విడుదల తేదీ: నవంబరు 4, 2016

వీర్య దానం కాన్సెప్ట్‌తో కామెడీ తీయడం ఆషామాషీ వ్యవహారం కాదు. కాస్త హద్దు దాటినా బూతు సినిమాగా ముద్ర పడిపోయే ప్రమాదం ఉన్న కథని 'విక్కీ డోనార్‌'లో చాలా మెచ్యూర్డ్‌గా, ఎంతో వినోదాత్మకంగా తీర్చిదిద్దారు. సినిమాల్లో చాలా అరుదుగా కనిపించే కాన్సెప్ట్‌ అయినప్పటికీ దానిని రియలిస్టిక్‌గా ప్రెజెంట్‌ చేయడంలో దర్శకుడు సుజిత్‌ సర్కార్‌ సక్సెస్‌ అయ్యాడు. బోల్డ్‌ కాన్సెప్టే అయినా యూనివర్సల్‌ అప్పీల్‌ వున్న విక్కీ డోనార్‌ కథని ఏ భాషలోకి అయినా నిరభ్యరతరంగా రీమేక్‌ చేసుకోవచ్చు. ఒరిజినల్‌లో ఉన్న క్వాలిటీ హ్యూమర్‌, ఫ్రీ ఫ్లోయింగ్‌ స్క్రీన్‌ప్లేని యధాతథంగా ఫాలో అయిపోయినట్టయితే డీసెంట్‌ సినిమా రెడీ అయిపోతుంది. 'నరుడా డోనరుడా' చిత్రానికీ అదే చేసారు. దాదాపు మక్కీకి మక్కీ దించారు. కానీ దానికీ, దీనికీ ఒరిజినల్‌కీ, జిరాక్స్‌కీ ఉన్నంత తేడా వుంది. 

కథాపరంగా ఇది పక్కా 'పెద్దలకు మాత్రమే' చిత్రం కనుక బడ్జెట్‌ని కంట్రోల్‌లో ఉంచాలని అనుకున్నారో ఏమో కానీ మరీ అన్నపూర్ణ స్టూడియోస్‌ పరిసరాల్లో చుట్టి పారేసి షార్ట్‌ ఫిలిమ్‌కి ఎక్కువ, టీవీ సీరియల్‌కి తక్కువ అన్నట్టు తయారు చేశారు. తక్కువ బడ్జెట్‌లో తీసినా కానీ మరీ ఇంతగా క్వాలిటీ పరంగా రాజీ పడిపోవాల్సిన పని లేదు. సపోర్టింగ్‌ కాస్ట్‌ పరంగా కూడా బడ్జెట్‌ పరిమితులు పెట్టుకోవడం వల్ల వారి నుంచి పూర్తిగా సహకారం లోపించింది. ఇక ఇందులోని లీడ్‌ రోల్‌కి సుమంత్‌ టోటల్‌ మిస్‌కాస్ట్‌ అనిపించాడు. ఎనర్జిటిక్‌గా వుండాల్సిన పాత్రలో సుమంత్‌ మెప్పించలేకపోయాడు. ద్వితీయార్ధంలో ఎమోషనల్‌ సీన్స్‌లో రాణించినా కానీ కీలకమైన కామెడీ సీన్స్‌లో సుమంత్‌ జస్ట్‌ ఓకే అనిపించాడు. 

రక్తదానం, అవయవ దానాన్ని గొప్పగా భావించే జనం, వీర్య దానాన్ని మాత్రం చేయరాని పని చేసినట్టుగా చిన్నచూపు చూస్తుంటారు. ఈ పాయింట్‌ని చాలా తెలివిగా హ్యాండిల్‌ చేసి, ఒక వినోదాత్మకంగా చిత్రంగా మలచడం 'విక్కీ డోనార్‌' స్పెషాలిటీ. అందుకే అంతగా ప్రశంసలు పొంది, అవార్డులు, రివార్డులు సైతం అందుకుంది. సెన్సిబుల్‌గా హ్యాండిల్‌ చేయాల్సిన కథని లౌడ్‌గా ప్రెజెంట్‌ చేయడం ఈ రీమేక్‌ వీక్‌నెస్‌. అలాగే విక్కీ డోనార్‌ సెకండ్‌ హాఫ్‌ డల్‌ అయిపోయి, ఫస్ట్‌ హాఫ్‌కి పూర్తి కాంట్రాస్ట్‌గా అనిపిస్తుంది. అయితే ప్రథమార్ధంలోని బలాలు, హాయిగొలిపే వినోదం ఆ బలహీనతల్ని కవర్‌ చేసాయి. ఈ రీమేక్‌లో ఆ బలాలు లేకపోగా, ఆ బలహీనతల్ని కూడా మరింత బలహీనంగా కాపీ చేయడంతో ఇది పూర్తిగా బలహీనమైపోయింది.

సెకండాఫ్‌లో వచ్చే తెలుగు వర్సెస్‌ బెంగాలీ గోల వల్ల కథకి కానీ, సినిమా చూసిన అనుభూతికి కానీ ఒరిగింది ఏమీ లేదు. ఆ పార్ట్‌ని చాలా సేపు సాగదీయడంతో సెకండాఫ్‌ స్టార్టింగ్‌లోనే 'డోనరుడు' ట్రాక్‌ తప్పేసాడు. భర్త చేసే ఉద్యోగం ఏంటనేది తెలుసుకున్న భార్య రియాక్షన్‌ కానీ, వారిద్దరి మధ్య కాన్‌ఫ్రంటేషన్‌ కానీ సరిగ్గా హ్యాండిల్‌ చేయలేదు. ఎమోషనల్‌ సీన్స్‌ తేలిపోవడంతో ఈ చిత్రం మరింతగా బలహీనపడి, ఒక దశకి వచ్చేసరికి బోర్‌ కొట్టిస్తుంది. చివరిగా ఏమి జరుగుతుందనేది తెలిసినపుడు ఇక ఆ పాయింట్‌కి త్వరగా అయినా వెళ్లిపోవాలి, లేదా ఊహించని పరిణామాలతో అయినా ఆశ్చర్యపరచాలి. అవి రెండూ జరగనపుడు ఇదిగో ఇలాగే పులిహోర పొట్లాల కోసం ఎదురు చూసే వరద బాధితుల్లా శుభం కార్డు కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. 

పల్లవి సుభాష్‌ నటన వరకు ఓకే అనిపించుకుంది కానీ హీరోయిన్‌ ఫీచర్స్‌ లేవు. తనికెళ్ల భరణి మాత్రం ఈ చిత్రానికి అతి పెద్ద బలమయ్యారు. ఆయన మాట విరుపులు, హావభావాలు దీనికి ప్లస్‌ అయ్యాయి.  కొన్ని డైలాగులు బాగున్నాయి. కాన్సెప్ట్‌కి తగ్గట్టుగా కామెడీ పుట్టించడంలో మాటల రచయితలు సక్సెస్‌ అయ్యారు. సంగీతం ఆకట్టుకోదు. బడ్జెట్‌ పరిమితుల వల్ల సినిమాటోగ్రఫీతో సహా టెక్నికల్‌గా ఏదీ మెచ్చుకోతగ్గ స్థాయిలో లేవు. సోర్స్‌ మెటీరియల్‌ స్ట్రాంగ్‌గా వున్నా కానీ దానిని హ్యాండిల్‌ చేసే మెచ్యూరిటీ దర్శకుడు చూపించలేకపోయాడు. 

నాగచైతన్య గెస్ట్‌ రోల్‌తో లాస్ట్‌ పంచ్‌ బాగున్నా కానీ 'నరుడా డోనరుడా' టోటల్‌గా మిస్‌ఫైర్‌ కావడం వల్ల చిన్న, చిన్న మెరుపుల వల్ల లాభం లేకపోయింది. కాన్సెప్ట్‌, ఫస్ట్‌ హాఫ్‌లో కాస్త కామెడీని మినహాయిస్తే మెప్పించే అంశాలు లేని ఈ చిత్రం సుమంత్‌కి మళ్లీ నిరాశనే మిగులుస్తుంది. 

బాటమ్‌ లైన్‌: మొలకెత్తని విత్తనం!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri