మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ పతనావస్థ ఆవిష్కృతం అవుతోంది. ఒకప్పటి కంచుకోటల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కనీసం నామినేషన్లను వేయించుకోలేని దుస్థితిలో నిలుస్తోంది. రకరకాల సమీకరణాల నేపథ్యంలో పార్టీకి బలమైన క్యాడర్ ను కలిగిన నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు టీడీపీ అభ్యర్థులను నిలుపుకోలేని పరిస్థితుల్లో ఉండటం గమనార్హం.
అలాంటి నియోజకవర్గాల్లో ఒకటి అనంతపురం జిల్లా ధర్మవరం. బీసీల జనాభా బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇది ఒకటి. ధర్మవరం టౌన్లో అయితే బీసీల జనాభానే మరింత ఎక్కువ. చేనేత పనివారు ఎక్కువగా ఉండే ఈ టౌన్లో నేసే కులస్తులు భారీగా ఉంటారు. పల్లెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుంది. టౌన్ ఎప్పుడూ టీడీపీదే!
అలాంటి టౌన్లో ఇప్పుడు పది వార్డుల్లో కనీసం టీడీపీ తరఫున నామినేషన్లు దాఖలు కాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దాదాపు 40 వార్డులకు గానూ టీడీపీ పోటీలో ఉన్నది కేవలం 30 వార్డుల్లోనే!
ధర్మవరం టౌన్లో 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో ఓడిన టీడీపీ అభ్యర్థి వరదాపురం సూరి బీజేపీలో చేరిపోయాడు. ఆ తర్వాత ఈ నియోజకవర్గం బాధ్యతలను పరిటాల ఫ్యామిలీకి ఇచ్చింది తెలుగుదేశం అధిష్టానం.
గత ఏడాది నామినేషన్లప్పుడు మీటింగ్ అంటూ పిలిచి తెలుగుదేశం కార్యకర్తల చేత వార్డుకొకరిగా నామినేషన్లను వేయించారు. పిలిచింది మీటింగుకు అని, వేయించింది నామినేషన్లు. ఎన్నికల వాయిదాతో ఆ నామినేషన్లు అలా పెండింగ్ లో ఉండిపోయాయి.
బలవంతంగా వేయించిన ఆ నామినేషన్లను గడువులోగా కొందరు ఉపసంహరించుకున్నారు. దీంతో పది వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా వార్డుల్లో మాత్రం పోటీ కొనసాగుతూ ఉంది. ఈ నియోజకవర్గంలోనే ఎప్పుడూ టీడీపీ గట్టి పోటీ ఇస్తుంది. ఆ పై ధర్మవరం టౌన్లో టీడీపీ మరింత బలంగా ఉంటుంది. ఇప్పుడు టౌన్ కు జరుగుతున్న ఎన్నికల్లో ఏకంగా పది వార్డుల్లో టీడీపీకి అభ్యర్థులే లేకుండాపోవడం ఆ పార్టీ పరిస్థితికి నిదర్శనంగా మారింది.