ఓదార్పు యాత్ర అంటే వైఎస్ జగనే గుర్తుకొస్తారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని జీర్ణించుకోలేక తనువులు చాలించిన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ అప్పట్లో ఓదార్పు యాత్ర చేపట్టారు. ఓ ఓదార్పు యాత్రే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక రాజకీయ కుదుపులకు దారి తీసింది.
వైఎస్ జగన్ ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అభ్యంతరం చెప్పడం, ఆయన కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి సొంత పార్టీ పెట్టుకోవడం చకాచకా జరిగిపోయాయి. కాంగ్రెస్ నుంచి జగన్ బయటికి వెళ్లిన నేపథ్యంలో కనీసం ఒక ప్రాంతంలోనైనా కాంగ్రెస్ను బతికించుకోవాలనే తాపత్రయంలో నాటి యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన దిశగా అడుగులు వేసిందనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు.
ప్రస్తుతానికి వస్తే మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సమాయత్తం అయ్యారు. ఈ నెల 10న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 4న గురువారం కర్నూలు నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు. గురువారం కర్నూలు, 5న తిరుపతి, 6న విశాఖపట్నం, 7న విజయవాడ, 8న గుంటూరులో ఆయన టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది.
చంద్రబాబు ఎన్నికల ప్రచారంపై ప్రత్యర్థులు, నెటిజన్లు వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు. నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. సాయంత్రానికి బరిలో నిలిచేదెవరో స్పష్టత రానుంది. నిన్నటి నామినేషన్ల ఉపసంహరణ లెక్కలను ఒకసారి పరిశీలిద్దాం.
రాష్ట్రంలో మొత్తం 671 డివిజన్లు, 2,123 వార్డుల కోసం ఎన్నికలు జరగనున్నాయి. వీటికి మొత్తం 17,415 మంది నామినేషన్లు వేశారు. వీరిలో ఏకంగా 2,502 మంది మంగళవారం పోటీ నుంచి తప్పుకున్నారు. విశాఖపట్నం మహా నగర పాలక సంస్థ (జీవీఎంసీ) 92 ఉపసంహరణలతో రాష్ట్రంలోనే టాప్ పొజీషన్లో నిలబడడం గమనార్హం. చిత్తూరు కార్పొరేషన్లో 90, విజయవాడలో 83, తిరుపతిలో 60 మంది అభ్యర్థులు బరి నుంచి వైదొలిగారు.
అలాగే గుంటూరు కార్పొరేషన్లో 33, కర్నూలు కార్పొరేషన్లో 22 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. గెలుపోటములను పక్కన పెడితే కనీసం పోటీలో నిలిచామని చెప్పుకోడానికి ప్రతిపక్ష పార్టీల నేతలు నానా తిప్పలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నాయకుల పరువు కోసం అభ్యర్థులు బరిలో నిలుస్తారా? లేక ఉపసంహరణ దారి వెతుక్కుంటారా? అనే దానిపై సాయంత్రం నాలుగు గంటలకల్లా స్పష్టత రానుంది.
ఈ నేపథ్యంలో కనీసం సగం సీట్లలో కూడా అభ్యర్థులు లేని పార్టీ తరపున చంద్రబాబు ఏమని ప్రచారం నిర్వహిస్తారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం పోటీ చేయడానికి కూడా ముందుకు రాని దయనీయ స్థితిలో ఉన్న నేతలను, తప్పని సరి పరిస్థితుల్లో బరిలో నిలిచిన అభ్యర్థులను ఓదార్చడానికి బాబు పర్యటన పనికొస్తుందంటున్నారు. అంతే తప్ప ఎన్నికల ప్రచారం వల్ల ఒరిగేదేమీ లేదని టీడీపీ శ్రేణులే అంటున్నాయి.