ఓ కామెడీ షో.. అందులో ఓ కామెడీ నటుడు.. అత్యంత జుగుప్సాకరంగా నటిస్తోంటే, జడ్జిలు విరగబడి నవ్వుతారు. ఎప్పుడూ పక్కింటోడి పెళ్ళాన్ని లైన్లో పెట్టేసి, ఏకంగా తన పెళ్ళాంగా మార్చేసుకుని, పక్కింటోడ్ని బకరాని చెయ్యడమే ఆ కామెడీ నటుడి కాన్సెప్ట్‌లు. పైగా, ఆ స్కిట్స్‌కే టాప్ మార్క్స్. 'చూసిందే చూడబుద్దేస్తోంది..' అని జడ్జిలు అనుకుంటున్నారేమోగానీ, ఆ స్థానంలో కూర్చున్నవారి స్థాయి తగ్గుతోంది, అలాంటి స్కిట్స్‌ని ఎంకరేజ్ చేయడం ద్వారా.
అంతిమంగా, టెలివిజన్‌లో వచ్చే ఏ షో అయినాసరే, టీఆర్పీ రేటింగులకోసమే అన్నట్లుగా తయారయ్యింది. లేకపోతే, విలువలతో ఏర్పడ్డ సదరు ఛానల్, ఇలాంటి చవకబారు స్కిట్స్‌ని కామెడీ పేరుతో జనమ్మీదకు వదిలేయడమేంటి.?
కామెడీ షో సంగతి పక్కన పెడదాం, పండగ పూట.. ఓ మేల్ యాంకర్, ఇద్దరు ఫిమేల్ యాంకర్స్ మధ్య ఎఫైర్ లాంటి ఓ రచ్చ కామెడీ స్కిట్. ఎంత ఛండాలంగా తయారయ్యిందంటే, అంత ఛండాలంగా వుందది. కానీ, ఆ షోకి జడ్జిలుగా వచ్చిన ఓ టెలివిజన్ సెలబ్రిటీ, ఆమె భర్త ఓ రేంజ్లో ఎంజాయ్ చేసేశారు. 'సరదాకి' అని సరిపెట్టుకోడానికి వీల్లేంత జుగుప్సాకరంగా తయారైంది ఆ కామెడీ స్కిట్.
ఆ మధ్య వెండితెర స్టార్ కమెడియన్, ఓ కామెడీ షోలో చేసిన ఓవరాక్షన్ కారణంగా, ఆ ప్రోగ్రామ్ని ఆపేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అంత 'ఓవర్ అడల్ట్ కామెడీ' ఆ షోలో దర్శనమిచ్చింది. తీరా, అసలు విషయమేంటంటే.. ఆ షోని అప్పటికి ఆపేసి, అదే స్టార్ కమెడియన్‌తో అలాంటిదే ఇంకో షో ప్లాన్ చేశారు. ఇంకేముంది, షరామామూలుగానే సదరు వెండితెర స్టార్ కమెడియన్ చెలరేగిపోతున్నాడు.
అన్ని స్కిట్లూ అని కాదుగానీ, నూటికి 80 శాతం స్కిట్లు.. 'అడల్ట్ కామెడీ'ని తలపిస్తున్నాయి. యూ ట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే, అందులో 'ఎ' రేటెడ్ షార్ట్ ఫిలింస్ చాలానే కనిపిస్తాయి. వాటిని మించి, ఈ డబుల్ మీనింగ్ స్కిట్స్ వుంటున్నాయన్నది నిర్వివాదాంశం. అందులో, మాటలు తక్కువ రొమాన్స్ ఎక్కువ.. కామెడీ స్కిట్స్‌లో రొమాన్స్ తక్కువ.. అడల్ట్ కామెడీ డైలాగులు ఎక్కువ. అంతే తేడా. చిత్రంగా టీఆర్పీ రేటింగులో ఇలాంటి షోలకే ఎక్కువగా వస్తుండడంతో, హద్దూ అదుపూ లేకుండా పుట్టుకొచ్చేస్తున్నాయి ఈ అడల్ట్ కామెడీ షోస్.
స్టూడెంట్స్‌ని వీక్షలుగా ఈ ప్రోగ్రామ్స్‌కి పిలుస్తోంటే, కొన్ని సందర్భాల్లో వాళ్ళ నుంచి దూసుకొచ్చే ప్రశ్నలు.. 'రామ రామ..' అంటూ చెవులు మూసుకునేలా చేస్తున్నాయ్. విలువలు ఏమైపోయినా ఫర్లేదు, టీఆర్పీ రేటింగులే ముఖ్యం.. అంతే.!