సినిమా రివ్యూ: నందిని నర్సింగ్‌ హోమ్‌

రివ్యూ: నందిని నర్సింగ్‌ హోమ్‌ రేటింగ్‌: 2/5 బ్యానర్‌: ఎస్వీసి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తారాగణం: నవీన్‌ విజయకృష్ణ, నిత్య, శ్రావ్య, జయప్రకాష్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, షకలక శంకర్‌ తదితరులు సంగీతం: అచ్చు రాజమణి, శేఖర్‌…

రివ్యూ: నందిని నర్సింగ్‌ హోమ్‌
రేటింగ్‌: 2/5

బ్యానర్‌: ఎస్వీసి ఎంటర్‌టైన్‌మెంట్స్‌
తారాగణం: నవీన్‌ విజయకృష్ణ, నిత్య, శ్రావ్య, జయప్రకాష్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, షకలక శంకర్‌ తదితరులు
సంగీతం: అచ్చు రాజమణి, శేఖర్‌ చంద్ర
కూర్పు: కార్తీక్‌ శ్రీనివాస్‌
ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర
నిర్మాతలు: రాధాకృష్ణ, భిక్షమయ్య
కథ, కథనం, దర్శకత్వం: పి.వి. గిరి
విడుదల తేదీ: అక్టోబరు 21, 2016

ఇంటర్మిషన్‌ పాయింట్‌కి కూడా అది ఏ జోనర్‌ సినిమా అనేది తెలీనివ్వకుండా తీయాలంటే స్పెషల్‌ టాలెంట్‌ కావాలి. సస్పెన్స్‌ మెయింటైన్‌ చేయాలనే తపనతో దర్శకుడు ఈ చిత్రాన్ని పూర్తిగా రాంగ్‌ ట్రాక్‌ పట్టించాడు. కథ ఓపెన్‌ అవడమే హారర్‌ సీన్‌తో ఓపెన్‌ అయినా, మళ్లీ ఆ ఎలిమెంట్‌కి అంతగా ఇంపార్టెన్స్‌ ఉండదు. పూర్తిగా నర్సింగ్‌ హోమ్‌లో సెట్‌ చేసిన ఈ చిత్రం ఆద్యంతం అతుకుల బొంతలా అనిపిస్తుంది. అసలు కథ పక్కదారి పట్టి కామెడీ ట్రాక్‌తోనే గంటలు, గంటలు కాలక్షేపం చేస్తుంటుంది. 

ఎంబియే చదివిన హీరో (నవీన్‌) ఎంబిబిఎస్‌గా చలామణీ అయిపోయి, జూనియర్‌ డాక్టర్‌గా ఉద్యోగం కూడా సంపాదిస్తాడు. అక్కడున్న కాంపౌండర్‌ (శంకర్‌) సాయంతో వైద్యం కూడా చేసేస్తుంటాడు. ఇదే పెద్ద ఫార్సు వ్యవహారమనుకుంటే, ఆ హాస్పిటల్‌లో ఒక పేషెంట్‌ (సప్తగిరి) ఒక రూమ్‌ని పర్మినెంట్‌గా అద్దెకి తీసుకుని అక్కడే బ్రోతల్‌ నడుపుతుంటాడు (వా.. క్యా ఐడియా జీ!). ఈ కామెడీ సరిపోలేదనుకుని, అరెస్ట్‌ తప్పించుకోవడానికి కోమాలో ఉన్నట్టు నటిస్తోన్న చెయిన్‌ స్నాచర్‌ని (వెన్నెల కిషోర్‌) తెచ్చి అక్కడ పెడితే, అతనిపై వచ్చీ రాని వైద్యంతో హీరో, కాంపౌండర్‌ కలిసి కామెడీ చేస్తుంటారు. ఈ తంతులో కొన్ని జోక్స్‌ పేలినప్పటికీ, అసలు కథ అంతు చిక్కడానికి మాత్రం చివరి రీళ్ల వరకు వెయిట్‌ చేయిస్తారు. 

ముందు హారర్‌ సినిమాగా మొదలై, తర్వాత కామెడీగా మారి, అటుపై మిస్టరీగా టర్న్‌ తీసుకుని, చివరకు ఎమోషనల్‌గా ఎండ్‌ అయ్యే 'నందిని నర్సింగ్‌ హోమ్‌'లో విషయం లేకపోలేదు. మిస్టరీ ఎలిమెంట్‌ని బాగానే డీల్‌ చేసిన దర్శకుడు దీనికి ఒక సక్రమమైన స్క్రీన్‌ప్లే రాసుకోవడంలో విఫలమయ్యాడు. లాజిక్‌ పూర్తిగా గాలికి వదిలేసిన సెటప్‌ కూడా అతనికి సహకరించలేదు. కథలో కీలకమైన నందిని పాత్ర పోషించిన నిత్య నటన ఈ చిత్రాన్ని మరింత పెయిన్‌ఫుల్‌గా మార్చింది. అసలు ఏమాత్రం నటన రాని అమ్మాయికి అంత ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ ఎలా ఇచ్చారో మరి. 

కామెడీ చేయాలనుకుంటే ఎలాగో హారర్‌ ఎలిమెంట్‌ ఉంది కనుక దాని సాయంతో నవ్వించడానికి ప్రయత్నించినట్టయితే కథని విడిచి సాము చేయాల్సిన అవసరం ఉండేది కాదు. హారర్‌ని, కామెడీని సెపరేట్‌ చేయాలని చూడడంతో అనవసరంగా లెంగ్త్‌ పెరగడమే కాకుండా మొత్తం అతుకులమయమైంది. హీరోని కావాలని అమూల్య (శ్రావ్య) హాస్పిటల్‌కి రప్పించుకుందని క్లయిమాక్స్‌లో చెప్తారు. కానీ అతడికి నిజం తెలియజెప్పడానికి ఆమె ఎలాంటి ప్రయత్నం చేయదు. బహుశా క్లయిమాక్స్‌లో ట్విస్ట్‌ మిస్‌ అవుతుందని అలా చేసారేమో కానీ కథౌచిత్యం ప్రకారం అది సబబు అనిపించదు.

కొత్త హీరో నవీన్‌ బాగానే చేశాడు. సగటు సినిమా హీరో లక్షణాలు లేని పాత్రలో అతను ఇబ్బంది లేకుండా ఒదిగిపోయాడు. మరి నిజంగా తనే నడిపించాల్సిన కథలు చేయాల్సి వస్తే నవీన్‌ ఎలా రాణిస్తాడనేది చూడాలి. శ్రావ్యకే నందిని పాత్రనిచ్చి ఉండాల్సిందేమో. ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ బాగున్నాయి. కానీ నిత్య మాత్రం ఈ చిత్రానికి బలహీనతగా మారింది. శంకర్‌, సప్తగిరి, కిషోర్‌ తమదైన శైలిలో కామెడీ చేసారు. జయప్రకాష్‌రెడ్డి కూడా తనవంతు సహకారం అందించారు. 

రెండు పాటలు వినడానికి బాగున్నాయి కానీ మిగతా సాంకేతిక వర్గం నుంచి చెప్పుకోతగ్గ అవుట్‌పుట్‌ రాలేదు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ చాలా బ్యాడ్‌గా ఉన్నాయి. వాటిపై శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది. బడ్జెట్‌ లిమిటేషన్స్‌ కొట్టొచ్చినట్టు కనిపించాయి. లో బడ్జెట్‌లోను క్వాలిటీ సినిమాలు తీస్తోన్న టెక్నీషియన్లు మనకున్నారు. క్వాలిటీ మెయింటైన్‌ చేయలేనపుడు కనీసం కంటెంట్‌తోనో, కామెడీతోనో కట్టి పడేయాలి. నందిని నర్సింగ్‌ హోమ్‌లో అలాంటివేమీ లేకపోవడంతో అన్ని విధాలా మిస్‌ ఫైర్‌ అయింది. జబర్దస్త్‌ తరహా కామెడీ ఎంజాయ్‌ చేసేవారికి మినహా ఈ నర్సింగ్‌ హోమ్‌లో మిగతావాళ్లకి కాలక్షేపం కావడం కష్టమే. 

బాటమ్‌ లైన్‌: కామెడీ కిచిడీ హోమ్‌!

– గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri